జిల్లాలో గాలివాన బీభత్సం | Farmers Lost Crops With Heavy Rain in Medak | Sakshi
Sakshi News home page

జిల్లాలో గాలివాన బీభత్సం

Published Sat, Apr 11 2020 10:27 AM | Last Updated on Sat, Apr 11 2020 10:27 AM

Farmers Lost Crops With Heavy Rain in Medak - Sakshi

నంగునూరు మండలం తిమ్మాయిపల్లిలో మíß ళా రైతును ఓదారుస్తున్న మంత్రి హరీశ్‌రావు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ఆరుగాలం చేసిన రైతన్న కష్టం నేలపాలైంది. గురువారం జిల్లాలో కురిసిన వడగండ్ల వర్షం, ఈదురుగాలులతో రైతులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చేతికి రావాల్సిన పంట వర్షార్పణమైంది.  దీంతో తీవ్రంగా నష్టపోయారు. నంగునూరు, చేర్యాల, కొమురవెల్లి, మిరుదొడ్డి, గజ్వేల్, జగదేవ్‌పూర్, మర్కూక్, ములుగు, దుబ్బాక మండలాల్లో  పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది.  4,840 ఎకరాల్లో వరి పంట, 187 ఎకరాల్లో ఇతర పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రూ.11.55 కోట్లు నష్టం వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు.

జిల్లాలో ఈ సంవత్సరం అత్యధికంగా 1,55,258 ఎకరాల్లో వరి సాగు చేశారు. 20,438 ఎకరాల్లో మొక్కజొన్న, 7249 ఎకరాల్లో శనగ, 1983 ఎకరాల్లో పొద్దు తిరుగుడు పంటలు సాగవుతున్నాయి. ఇందులో గురువారం కురిసిన వడగళ్ల వర్షంతో చేర్యాల మండలంలో 2099 ఎకరాల వరి, మర్కుక్‌ మండలంలో 348 ఎకరాల్లో వరి, కొమురవెల్లి మండలంలో 880ఎకరాల్లో వరి, కొండపాక మండలంలో 136 ఎకరాల్లో వరి, జగదేవ్‌పూర్‌ మండలంలో 520 ఎకరాల్లో వరి, 27 ఎకరాల మొక్కజొన్న, ములుగు మండలంలో 255 ఎకరాల్లో వరి, నంగునూరు మండలంలో 340 ఎకరాల్లో వరి, దుబ్బాక మండలంలో 80 ఎకరాల్లో వరి, మిరుదొడ్డి మండలంలో 166 ఎకరాల్లో వరి పంటలు మొత్తంగా 4840 ఎకరాల్లో వరి, 27 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. 

నేల రాలిన ఆశలు
వరి, మొక్కజొన్నకు మొత్తంగా రూ.11కోట్ల నష్టం వాటిల్లింది. అలాగు జిల్లాలో 12,000 ఎకరాల్లో మామిడి, 50వేల ఎకరాల్లో కూరగయాలు, 50వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.  కురిసిన వర్షలతో 30 ఎకరాల్లో మామిడి తోటలు, 125 ఎకరాల్లో ఇతర కూరగాయల పంటలు, 50 ఎకరాల్లో ద్రాక్షపంటలకు అపార నష్టం వాటిల్లింది. దీంతో ఉద్యానశాఖ పంటలకు మొత్తంగా రూ.55లక్షలు రైతులు నష్టపోయారు. వ్యవసాయ సాగు పెట్టుబడి కోసం చేసిన అప్పులతో పాటుగా ఈ వడగళ్ల వర్షంతో వచ్చిన నష్టంతో మొత్తం మీద రైతులు అత్యధికంగా నష్టపోయారు. దీంతో ఎక్కడి రైతులను పలకరిస్తే చేతికొచ్చిన పంటలు వడగళ్లకు నేలరాలాయని దిగులుపడుతున్నారు. ఏ ఇద్దరి మధ్య చర్చ జరిగినా వడగళ్ల నష్టల గురించి చర్చిస్తున్నారు. శుక్రవారం వివిధ గ్రామాల్లో వడగళ్లతో నష్టపోయిన పంటలను మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలతో పాటు వివిధ సంస్థల చైర్మన్‌లు, అధనపు కలెక్టర్, వ్యవసాయ అధికారులు పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేశారు.

అధైర్యపడొద్దు..
వడగండ్ల వానతో పంట నష్టం వాటిల్లిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకుంటుంది. రబీ పంట తీరా చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలతో దెబ్బతిన్నది.  వెంటనే బీమా కంపెనీలతో మాట్లాడి పంట నష్టం అంచనాలను వేయాలని ఆదేశించాం.   లాక్‌ డౌన్‌ నేపథ్యంలో పంటను కొనుగోలు చేయడానికి ఏ ఆంక్షలు అడ్డురావు. ధాన్యం డబ్బులు కూడా త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం.  –హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి

అత్యధికంగా చేర్యాలలో..
గురువారం జిల్లా వ్యాప్తంగా తొమ్మిది మండలాల్లో 4,840 ఎకరాల్లో వరి, 27 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 11కోట్ల నష్టం వడగల్లు మిగిల్చాయి. అత్యధికంగా చేర్యాల మండలంలో 2,022 ఎకరాల్లో వరి నెలకొరిగింది. వడగళ్లతో నష్టపోయిన పంటలను మంత్రి హరీశ్‌రావు తదితరులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారు రైతులకు ధైర్యం నింపారు.– శ్రవణ్‌కుమార్,జిల్లా వ్యవసాయ అధికారి

ప్రభుత్వం ఆదుకోవాలి..
ఈయన పేరు గంగుల లక్ష్మయ్య. కొమురవెల్లి మండలం రాంసాగర్‌ గ్రామం. మూడున్నర ఎకరాల్లో వరిసాగు చేశాడు. రెండు రోజుల్లో పంట కోయాలని నిర్ణయించాడు.  కానీ గురువారం కురిసిన వడగండ్ల వర్షంతో పంట మొత్తం నేలరాలింది. తన కష్టం.. పెట్టుబడి అంతా నేల పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.  ప్రభుత్వం ఎలాగైనా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. ఇది ఒక లక్ష్మయ్య  పరిస్థితే కాదు. జిల్లాలోని అనేక మంది రైతులు వడగండ్ల వర్షంతో తీవ్రంగానష్టపోయారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement