
అన్నదాత ఇంట్లో.. చావుడప్పు
‘‘వ్యవసాయం కోసం చేసిన అప్పు మా కొంప గుల్ల చేసింది. రెండుమూడేళ్లుగా చేసిన సేతానం చేతికి రాక అప్పులయ్యాయి. ఈ ఏడు కూడా పంటలు ఏం ఆశలేవు. పొద్దున లేస్తే బాకిచ్చినోళ్లు అడుగుతున్నరు. పైసలెట్ల తీర్చాలో ఏం వసపట్టక... బాధతో నా భర్త నారయ్య ఆత్మహత్య చేసుకున్నడు. అప్పటి సంది మా పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యింది. మా ఆయన చనిపోవడంతో నా కొడుకు 20 దినాల సంది ఇంటి పట్టునే ఉంటున్నడు.’’ ఉప్పునుంతల మండలం పెనిమిళ్ల గ్రామానికి చెందిన మారం శ్యామలమ్మ ఆవేదన ఇది... ఇలా ఒకట్రెండు కుటుంబాలే కాదు.. నెల రోజుల వ్యవధిలో దాదాపు 20 రైతన్న కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి.
* బలిపీఠంపై బక్క రైతు
* ఎండుతున్న వరి, పత్తి చేలు
* పంటకు తెచ్చిన అప్పులు తీర్చలేక రాలుతున్న రైతన్నలు
* చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు
సాక్షి, మహబూబ్‌నగర్: ఈ ఏడాది మొదటి నుంచీ వరుణ దేవుడు దాగుడుమూతలాడుతున్నాడు. సకాలంలో వానలు కురవకపోవడంతో ఆది నుంచి అన్నదాతను కష్టాలు వెంటాడుతున్నాయి. కాస్తో కూస్తో కురిసిన వర్షాలకు పంటలు సాగు చేసినా అవి మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. నెలరోజు లుగా వర్షాలు పూర్తిగా కనుమరుగు కావడంతో పంటలన్నీ ఎండిపోతున్నాయి. ప్రధానంగా వరి, పత్తి, కంది పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగు చేసిన పంట నుంచి పెట్టుబడులు తిరిగిరాని పరిస్థితి అన్నదాతలను వెంటాడుతోంది.
పంట పోయి, పరువు పోయే పరిస్థితి తలెత్తిందని ఆవేదన చెందుతున్నారు. వీటికి తోడు కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని రైతన్న పంటలనే ప్రాణంగా చేసుకున్న పొలంలోనే అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. పట్టెడన్నం పెట్టే అన్నదాత ఇంట్లో చావుడప్పు మోగుతుంది. పురుగుల మందుతాగి కొందరు, పొలంలో విద్యుదాఘాతానికి గురై జిల్లాలో ప్రతిరోజూ ఒకరిద్దరి చొప్పున రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు.
గుదిబండలా మారుతున్న అప్పులు
వాతావరణశాఖ వివరాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు 374.8 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 329 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసింది. జిల్లాలోని 23 మండలాల్లో తీవ్ర వర్షభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సాధారణ సాగుకంటే అతి తక్కువగా పంటలు సాగయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 7,37,582 హెక్టార్లు సాగవ్వాల్సి ఉండగా.. 7,09,583 హెక్టార్లు మాత్రమే సాగైంది. సరైన వర్షాలు లేక 8,700 హెక్టార్లలో మొక్కజొన్న పంట పూర్తిగా నష్టపోయింది. ఆగష్టు మొదటి వారంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు రైతన్నను నట్టేట ముంచాయి.
ప్రస్తుత కాత దశలో ఉన్న పత్తి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది. దీంతో మొక్కజొన్న, వరి, పత్తి చేల దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. మొక్కజొన్న హెక్టారుకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడులు రావాలి. కానీ, ఈ సారి ఐదారు క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. సాగుకు మాత్రం రూ. పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు అయ్యింది. దీంతో పెట్టుబడికి తెచ్చిన అప్పులు అలాగే మిగిలిపోయాయి. వరి ఎకరాకు సాధారణంగా 30 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి వచ్చేది. అయితే, తెగుళ్లు, కరెంటు కోతల కారణంగా 15 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు.
వరి సాగుకు ఎకరాకు రూ.20 వేల వరకు ఖర్చవుతుండటంతో అప్పుల పాలవుతున్నారు. ఇక తెల్లబంగారంగా పిలుచుకునే పత్తి పరిస్థితి అద్వాన్నంగా తయారైంది. పత్తి హెక్టారుకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా... రెండు క్వింటాళ్లకు మించి రావడం లేదు. ఈ సారి ఎర్ర తెగుళ్లబారిన పడి పంటంతా నాశనమైంది. దీంతో ఒక్కొక్క హెక్టారుకు రైతుపై రూ.20వేల నష్టం వాటిల్లింది. దీన్ని ఎలా పూడ్చుకోవాలో అర్థంకాక చాలామంది రైతులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు.