రైతుల గౌరవం పెంచాలి : మంత్రి ఈటల
► గిట్టుబాటు ధర కల్పించాలి
► మార్కెట్లో మచ్చ రాకుండా పాలకవర్గం పనిచేయాలి
► మంత్రి ఈటల రాజేందర్
జమ్మికుంట: వ్యవసాయ మార్కెట్‌లలో ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తోందని, వాటిని అమలు చేసే బాధ్యత నూతన మార్కెట్ పాలకవర్గంపైనే ఉందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంట నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల గౌరవం పెరిగేలా మార్కెట్ కమిటీ పాలకవర్గం చూడాలని సూచించారు. ప్రభుత్వానికి, రైతులకు మచ్చ రాకుండా పనిచేయాలన్నారు. మార్కెట్‌లను రైతాంగం పరం చేయాలనే అలోచనలతో ప్రభుత్వం అనేక సంస్కరణలు చేస్తోందని చెప్పారు. దోపిడీ వ్యవస్థ నుంచి విముక్తి కలిగించి ఆదుకున్నప్పుడే రైతులు సంతోషంగా ఉంటారని, అందుకు మార్కెట్ కమిటీ పాలకవర్గం కృషి చేయాలన్నారు.
మార్కెట్‌ను నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికులను అదుకోవాలని సూచించారు. రెండేళ్లుగా కాలం లేక మార్కెట్ కళ తప్పిందని, రైస్ మిల్లర్లు, కాటన్ మిల్లర్లు దివాళా దశలో ఉన్నారని, బ్యాంక్ అప్పులు చెల్లించలేని దుస్థితిలో వ్యాపారులు ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవాలని సూచించినా కొందరు ప్ర జాప్రతినిధులు పట్టించుకోవడం లేదని తెలిపారు. పదవులు వందేళ్లు ఉండవని, ఐదేళ్ల మాత్రమే ఉంటాయాన్నది మరిచిపోవద్దని పేర్కొన్నారు. ప్రజ లను పట్టించుకోని వాళ్లు చివరకు కాల గర్భంలో కలిసిపోతారని హెచ్చరించారు.
జమ్మికుంట అంటేనే సీసీఐకి దడ -ఎంపీ వినోద్ కుమార్
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ అంటేనే సీసీఐ లాంటి సంస్థకు దడ పుడుతుందని ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడితే నిరసనలు, ఆందోళనతో నిలదీసే చైతన్యం ఇక్కడికి రైతులకుందని తెలిపారు. జమ్మికుంట మార్కెట్‌ను హైటెక్ మార్కెట్‌గా ఎంపిక చేసేందుకు మంత్రి ఈటల కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.