దివాళా కోరు విధానాలు
మిర్యాలగూడ : పాలకుల దివాళా కోరు విధానాల వల్ల రైతులు, కార్మికులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం మేడే సందర్భంగా సీపీఎం, సీఐటీయూ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక హనుమాన్‌పేటలోని సీఐటీయూ కార్యాలయం నుంచి రాజీవ్‌చౌక్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం రాజీవ్‌చౌక్ వద్ద నిర్వహించిన బహిరంగసభలో జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర రావాలని, కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే మేడే స్ఫూర్తిగా ఉద్యమించాలన్నారు.
రాష్ట్రంలో మిర్చి, కందులు పండించిన రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు కావల్సినవి, అసరమైనవి అడిగితే అడగని వాటి గురించి హామీలు ఇస్తాడని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమి, లక్ష మందికి ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా అమలు చేయడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నోట్లు రద్దు చేయడం వల్ల పేద వర్గాలే తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. రూ.7.50 లక్షల కోట్లు కార్పోరేట్ శక్తులకు రాయితీలు కల్పించారని, లెవీ విధానాన్ని తొలగించడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పాటు వ్యాపారులు, కార్మికులకు తీరని అన్యాయం జరిగిందని వివరించారు. పేద ప్రజల గురించి పట్టించుకోని పాలకులను ప్రతిఒక్కరు నిలదీయాలన్నారు.
దోపిడిలేని సమానత్వం రావాలని, సమసమానత్వం కోసం ఉద్యమించాలని కొరా రు. రాష్ట్రంలో 93 శాతంగా ఉన్న బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు బాగుపడితేనే బంగారు తెలం గాణా వస్తుందని, కానీ పాలకులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అధ్యక్షత వహించగా సభ, ర్యాలీలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ మాలి పురుషోత్తంరెడ్డి, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మహ్మద్‌బిన్ సయ్యద్, కౌన్సిలర్ ఘని, నాయకులు మల్లుగౌతమ్‌రెడ్డి, గాదె పద్మ మ్మ, పాపానాయక్, చంద్రశేఖర్‌యాదవ్, జగదీశ్‌చంద్ర, రహమాన్‌ఖాన్, రవినాయక్, అమ్జద్, శంకర్, పరురాములు పాల్గొన్నారు.