సాక్షి, హైదరాబాద్: ఇటీవల షాద్‌నగర్‌లో మార్క్‌ఫెడ్ రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోళ్లు జరిపింది. రైతులకు రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ రూ.66 లక్షలు మాత్రమే ఇచ్చింది. 20 రోజులు గడిచినా పూర్తిగా సొమ్ము చెల్లించలేదు. ఈ విషయం మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు దృష్టికి వచ్చింది. ఆయన మందలించాక అధికారులు మరో రూ. రెండున్నర కోట్ల వరకు రైతులకు చెల్లించారు. ఇంకా రూ.కోటి వరకు చెల్లింపులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇక్కడే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. మొక్కజొన్న, మినుములు, పెసర, సోయాబీన్, వరి, పత్తి పంటలను ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేసినా.. రైతులకు సకాలంలో సొమ్ము చెల్లించడం లేదు. మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారమే... రైతులకు ఇంకా రూ.324 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ధాన్యం కొనుగోళ్లు మినహా మిగతా పంటలకు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో అనేక చోట్ల రైతులు తమ పంటలను దళారులకు అమ్ముకుంటున్నారు. మద్దతు ధర కంటే తక్కువే ఇస్తున్నా.. తక్షణమే సొమ్ము చెల్లిస్తుండటంతో వారికే విక్రయిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు..
ప్రధాన పంటల్లో మిరప మినహా దాదాపు అన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను ఖరారు చేస్తుంది. రైతులు పండించే పంటలకు మార్కెట్లో మంచి ధర లభించే పరిస్థితి లేకుంటే.. ప్రభుత్వ సంస్థలు రంగంలోకి దిగి మద్దతు ధర మేరకు ఉత్పత్తులను కొనుగోలు చేస్తాయి. ఈ సారి భారత పత్తి సంస్థ (సీసీఐ) రాష్ట్రంలో 243 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. పౌర సరఫరాల శాఖ 2,555 వరి కొనుగోలు కేంద్రాలను, హాకా సంస్థ 29 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనేందుకు 236, పెసర కొనేందుకు 12, మినుములు కొనేందుకు 13 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటన్నింటిలో పౌర సరఫరాల శాఖ కొనుగోలు చేసిన ధాన్యానికి మాత్రమే త్వరగా చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ శాఖ ఇప్పటివరకు 15.05 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. రైతులకు రూ. 2,388 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ. 2,203 కోట్లు చెల్లించింది కూడా. మార్క్‌ఫెడ్, హాకాలు కొనుగోలు చేసిన ఉత్పత్తులకు మాత్రం చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. రైతులకు మార్క్‌ఫెడ్ రూ.91.26 కోట్లు, హాకా రూ.35.07 కోట్లు బకాయి పడ్డాయి.
మంత్రి హెచ్చరించినా..
రైతులకు చెల్లింపుల్లో జాప్యం చేయొద్దని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించినా అధికారుల తీరు మారడం లేదనే విమ ర్శలు వినిపిస్తున్నాయి. మార్క్‌ఫెడ్ రూ.500 కోట్ల రుణం తీసుకోవడానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. అయినా ఆ సంస్థ రైతులకు చెల్లిం పుల్లో జాప్యం చేస్తోంది. మార్క్‌ఫెడ్ 20.31 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసింది. దాని విలువ రూ.289 కోట్లు కాగా.. ఇప్ప టివరకు రూ.234 కోట్లు చెల్లించి రూ.55 కోట్లు బకాయి ఉంది. అలాగే మిను ముల కు సంబంధించి రూ.31.03 కోట్లు.. పెసర్ల కొనుగోళ్లకు సంబంధించి రూ.5.05 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక హాకా సంస్థ 3.36 లక్షల క్వింటాళ్ల సోయాబీన్ కొను గోలు చేసి రైతులకు రూ.67.67 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇంకా రూ.35.07 కోట్లు బకాయి పడింది.
Comments
Please login to add a commentAdd a comment