బాల్కొండ : మృగశిర కార్తె దాటి వారం గడిచినా వానల జాడలేదు. ఖరీఫ్ సీజన్ పనులకు సిద్ధమైన రైతులు ఆశతో ఆకాశం వైపు చూస్తున్నారు. పుడమి తల్లి పులకరించేలా వర్షం కురియక పోవడంతో విత్తనాలు వేసేందుకు రైతులు జంకుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా సుమారు 4 లక్షల 46 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు అందులో పాతిక శాతం కూడా పంట విత్తే పనులు ప్రారంభం కాలేదు. గతేడాది మృగశిర కార్తే నుంచే వర్షాలు కురువడంతో దాదాపుగా జూన్ మధ్య మాసం వరకు ఆరు తడి పంటలను విత్తడం పూర్తయింది. ఈసారి జూన్ మధ్య మాసం వచ్చినా పంటలు విత్తుట ప్రారంభం కాలేదు.
ఆర్మూర్ విడిజన్‌లో బోరు బావుల ఆధారంగా కొంత మంది రైతులు ముందస్తుగా రోహిణి కార్తే ప్రారంభం నుంచే పంటలు విత్తడం ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు భారీ వర్షాలు లేక పోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. బోరు బావులు ఎత్తిపోతున్నాయి. ఉన్న నీటికి వర్షాలు తోడు అయితే పంటలు మొలకెత్తుతాయని రైతులు ఆశించారు. పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. భానుడి ప్రతాపం తగ్గక పోవడంతో నాటిన విత్తనాలు కూడా మొలకెత్తకుండా పోతున్నాయి. కొందరు రైతులు పసుపు పంటను కూడా విత్తారు. ప్రస్తుతం వానలు లేక పోవడంతో పరేషాన్ అవుతున్నారు. పసుపు పంట విత్తనం మార్కెట్‌లో లభించే అవకాశం లేదు. ఒక్కసారి విత్తితే మళ్లీ పంట దిగుబడి వచ్చిన తరువాతనే విత్తనం లభిస్తుంది. వర్షాలు లేక పోవడంతో పూర్తి స్థాయిలో మొలకెత్తే అవకాశం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.
వాన పడుతుందని పంటను విత్తాను
బోరుబావుల్లో నీరు ఉండటం, వానలు పడుతాయని ఆశతో పసుపు పంటను విత్తాను. ఇప్పుడు వర్షాలు లేక పోవడంతో నీరు సరిపోవడం లేదు. విత్తిన పంట పూర్తిగా మొలకెత్తుతుందో లేదోనని ఆందోళనగా ఉంది. వానలు కురువాలని మొక్కుతున్నాం. – దేవేందర్, వన్నెల్(బి), రైతు
ఏటా ఇదే దుస్థితి ఉంది
వాన కాలం ప్రారంభమైనా వానలు కురవడం లేదు. ఏటా ఇదే పరిస్థితి ఉండటంతో సకాలంలో విత్తనాలు విత్తలేక పోతున్నాం. ఇప్పటి వరకు పసుపు పంట విత్తడం పూర్తి కావాలి. కాని వానలు లేక మొగులుకు మొకం పెట్టి చూస్తున్నాం. – ఎల్లరెడ్డి, రైతు, నాగంపేట్
Comments
Please login to add a commentAdd a comment