అచ్చంపేట: మృగశిర కార్తె దాటి వారం గడిచినా వానల జాడలేదు. ఖరీఫ్ సీజన్ పనులకు సిద్ధమైన రైతులు ఆశతో ఆకాశం వైపు చూస్తున్నారు. పుడమితల్లి పులకరించేలా వర్షం కురియక పోవడంతో విత్తనాలు వేసేందుకు చాలా మంది రైతులు వెనకాడుతున్నారు. నల్లమలలో తొలకరి ముందుగానే పలకరించి రైతుల్లో ఆశలు చిగురింప జేసింది. కానీ ముందుస్తు విత్తనాలు వేసిన రైతులను కష్టాల్లోకి నెట్టింది.
మొఖంచాటేసిన రుతుపవనాలు..
ప్రతీఏడాది జూన్ మొదటి వారంలో రావాల్సిన రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. ఈనెల7న కురిసిన వర్షానికి కొంత మంది రైతులు విత్తనాలు వేశారు. తిరిగి వరుణడు మళ్లీ కన్నెత్తి చూడకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తక రూ.కోట్లలో నష్టం సవిచూడాల్సి వస్తోంది.
2.35లక్షల హెక్టార్లలో..
ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా సుమారు 2.35లక్షల హెక్టార్లలో పంటల సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే అక్కడక్కడ కురిసిన వర్షాలకు ఇప్పటివరకు 20శాతం మంది రైతులు పత్తి, మొక్కజొన్న, జొన్న విత్తనాలు విత్తారు. విత్తనం వేసింది మొదలు ఇప్పటి వరకు చినుకు రాలక పోవడంతో మొక్కలు మొలకదశలోనే ఎండిపోతున్నాయి. గతేడాది మృగశిర కార్తే నుంచే వర్షాలు కురవడంతో దాదాపుగా జూన్ మద్యమాసం వరకు ఆరుతడి పంటలను విత్తడం పూర్తయింది. ఈసారి జూన్ మద్య మాసం వచ్చినా పంటలు విత్తుట ప్రారంభం కాలేదు. అచ్చంపేట నియోజకవర్గంలో కొంత మంది రైతులు మందుస్తుగా రోహిణి కార్తే ప్రారంభం నుంచే పంటల విత్తడం ప్రారంభించారు.
అయితే ఇప్పటి వరకు బారీ వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. బోరుబావులు ఎండిపోతున్నాయి. ఉన్న నీటిని వర్షాలు తోడు అయితే పంటలు మొలకెత్తుతాయని రైతులు అశించారు. పరిస్థితులు ప్రతికూలంగా మారియి. భానుడి ప్రతాపం తగ్గకపోవడంతో నాటిన విత్తనాలు కూడా మొలకెత్తకుండా పోతున్నాయి. రైతులు ఆకాశంలో మేఘవంతం అవుతున్న మబ్బుల వైపు వర్షంకోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. నేలపై విత్తనాలు చల్లిన రైతన్నలు భూమిలోనే ఎండిపోయే పరిస్థితి దాపురించి ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. నీటి వనరులు ఉన్నా రైతులు స్పింక్లర్ల సహాయంతో భూమిని తడిపి పంటను రక్షించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వర్షంపై ఆధారపడిన మెట్టపొలాల రైతులు మాత్రం వర్షం కోసం చూస్తున్నారు. ఈ సారి గతేడాది మాదిరిగానే వర్షాలు వస్తాయని భావించిన రైతులు విత్తనాలు విత్తి పంటలసాగుపై దష్టికేంద్రికరించగా అందుకు బిన్నంగా ఉంది. ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారులు సమృద్ధిగా వర్షాలు కురిసిన తర్వాత విత్తనాలు వేసుకోవాలని సూచించిన వర్షాన్ని నమ్ముకొన్ని రైతులు ముందుగానే విత్తనాలు వేశారు. చాలా మంది రైతులు విత్తనాలు భూమిలో పోసి వర్షం కోసం కళ్లు కాయలు కాయంగా ఎదురు చూస్తున్నారు.
వర్షం రాకపోతే..?
మండుతున్న ఎండలు, ఈదురు గాలులు తప్ప ఇంత వరకు చినుకు రాలకపోవడంతో రైతులు నిరాశ, నిస్పహతో కొట్టుమిట్టాడుతున్నారు. రెండు రోజుల్లో వర్షాలు పడకపోతే రూ.2 నుంచి రూ.4 కోట్ల వరకు నష్టం జరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయాధికారులు అంటున్నారు. రైతులు సబ్సిడీ విత్తనాలతో పాటు ప్రైవేట్ వ్యాపారుల నుంచి అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారు. చాలా వరకు అవీ మొలకెత్తక పోవడంతో పెట్టినపెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని రైతన్న కలత చెందుతున్నారు. ఎకరా పత్తిసాగుకు రూ.15వేల పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు వర్షాలు కురియకపోతే మళ్లీ రైతులు దుక్కి దున్ని విత్తనాలు కొనుగోలు చేసి పంటల సాగు చేయాలంటే మళ్లీ అంత డబ్బు ఖర్చు అవుతుంది. ఒక ఖరీఫ్‌లోనే రెండు సార్లు పెట్టబడులు పెట్టాల్సిన పరిస్థితి రైతుకు ఏర్పడుతుంది. ఇదీ అంత చేసినా పంటలు చేతికి వచ్చే నాటికి పరిస్థితులు ఏలా ఉంటాయోనన్ని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు పడిన అప్పులు ఇచ్చేది ఎవరన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది చేసిన అప్పులే నేటికి తీరలేదని, ఇప్పుడు మళ్లీ అప్పులతో తాము ఏలా బతికేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment