ఫాంహౌస్‌లోనే సీఎం
- కొత్త బావికి భూమి పూజ
- సాయంత్రం తిరుగు ప్రయాణం
జగదేవ్‌పూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ తనకెంతో ప్రీతిపాత్రమైన ఫాంహౌస్‌లోనే సేద దీరారు. ఖమ్మం, వరంగల్ పర్యటనను ముగించుకొని ఆదివారం సాయంత్రం మెదక్ జిల్లాలోని తన ఫాంహౌస్‌కు వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 9 గంటలకు ములుగు మండలం టీఆర్‌ఎస్ అధ్యక్షులు, ఫాంహౌస్ సూపర్‌వైజర్, తన బాల్యమిత్రుడు జహంగీర్ కారులో ప్రయాణిస్తూ ఫాంహౌస్‌లోని పంటల పరిస్థితిపై జహంగీర్‌ను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం 9:40కి ఫాంహౌస్ ఈశాన్యం దిశలో కొత్త బావికి భూమి పూజ నిర్వహించినట్లు తెలిసింది. కాగా, జాయింట్ కలెక్టర్ శరత్, గడా అధికారి హన్మంతరావు సీఎంను కలిశారు. గజ్వేల్‌లో పాదయాత్ర అనంతరం అభివృద్ధి పనులు ఎలా కొనసాగుతున్నాయి అనే అంశాలపై వారితో ఆరా తీసినట్లు సమాచారం. అలాగే, టీఆర్‌ఎస్ గజ్వేల్ ఇన్‌చార్జి మడుపు భూంరెడ్డితో కూడా పార్టీ సంగతులు తదితరాలపై ఆరా తీసినట్లు తెలిసింది.
ఫాంహౌస్‌కు ఎప్పటికీ వస్తా: సీఎం ఫాంహౌస్ నుంచి సాయంత్రం 5:40కి తన కాన్వాయ్‌లో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఫాంహౌస్ సూపర్‌వైజర్, ఫాంహౌస్‌కు వచ్చిన వారితో మాట్లాడుతూ ఇక్కడకు వస్తూ ఉంటా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పినట్లు సమాచారం. సీఎం తిరుగుప్రయాణంలో ములుగు మండలం మార్కుక్, పాములపర్తిలో ఆగి అక్కడి ప్రజలతో మాట్లాడారు.