
కాలయముడైన కన్నతండ్రి
' కూల్‌డ్రింక్‌లో విషం కలిపి హత్యాయత్నం
' చనిపోకపోవడంతో గొంతునులిమి ముగ్గురు చిన్నారుల హత్య
వలిగొండ : కంటికి రెప్పలా కాపాడా ల్సిన తండ్రే కాలయముడయ్యాడు. ఆదమరిచి నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులను పొట్టన బెట్టుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా వలిగొండ మండలం వెల్వర్తిలో సోమవారం వెలుగు చూసింది. వెల్వర్తికి చెందిన చముడాల రమేశ్ భార్య కవిత మూడు సంవత్సరాల క్రితం ముగ్గురు పిల్లలను, భర్తను వదిలి వెళ్లిపోయింది. దీంతో రమేశ్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య పిల్లలు రెండోభార్యతోపాటే ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో రెండోభార్య కూడా తల్లిగారింటికి వెళ్లిపోయింది. రమేశ్ పిల్లలు మాత్రమే ఉంటున్నారు.
తన జీవనానికి అడ్డువస్తున్నారని అతడు తన ఇద్దరు కూతుళ్లు నిరోష(8), రక్షిత(7), కుమారుడు జశ్వంత్(4)లను చంపాలనుకున్నాడు. ఆదివారం రాత్రి ఎలుకలు చంపే మందును కూల్‌డ్రింక్(మజా)లో కలిపి తాగించాడు. సోమవారం తెల్లవారుజామున పిల్లలు కదులుతుండడంతో చనిపోలేదని నిర్ధారించుకుని దస్తీతో ఒక్కొక్కరిని గొంతు నులిమి చంపేశాడు. అనంతరం రమేశ్‌కూడా ఉరేసుకుని, కరెంట్ షాక్‌తో ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించాడు. కానీ, భయపడి వెనుకంజ వేశాడు. సోమవారం తెల్లవారుజామున తండ్రి రాములు తలుపు కొట్టాడు. చాలాసేపు అవుతున్నా తలుపు తీయకపోవడంతో చుట్టుపక్కల వారు వచ్చి గట్టిగా తలుపులు కొట్టారు. దీంతో వెంటనే తలుపు తీసి బైక్‌పై పరారయ్యాడు. మధ్యాహ్నం సమయంలో రమేశ్ పోలీసులకు లొంగిపోయినట్టు తెలిసింది.