పసికందును ఎత్తుకెళ్లిన తండ్రి  | Father Trying Kidnap His New Born Child In Karimnagar | Sakshi
Sakshi News home page

పసికందును ఎత్తుకెళ్లిన తండ్రి 

Published Tue, Dec 24 2019 8:24 AM | Last Updated on Tue, Dec 24 2019 8:25 AM

Father Trying Kidnap His New Born Child In Karimnagar - Sakshi

తల్లి ఒడిలో పసికందు

సాక్షి. జగిత్యాల(కరీంనగర్‌): మూడు రోజుల చంటిపాప ఆస్పత్రిలో తల్లి ఒడిలో ఉండగా మద్యం మత్తులో ఉన్న తండ్రి ఆ చిన్నారిని ఎత్తుకెళ్లాడు. దీంతో తల్లితో పాటు ఆస్పత్రి సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. స్థానికులు అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పట్టణ పోలీసుల కథనం మేరకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరకుంటకు చెందిన చిదిరె ప్రశాంత్‌కు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నిజామాబాద్‌పల్లెకు చెందిన సర్వేశ్వరితో వివాహం జరిగింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సర్వేశ్వరి కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది.

ప్రసవం నిమిత్తం ఈ నెల 20న జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో చేరగా, ఆడబిడ్డ జన్మించింది. విషయం తెలుసుకున్న ప్రశాంత్‌ సోమవారం జగిత్యాలకు వచ్చి ఆస్పత్రిలో ఉన్న భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం పసికందును  ఎత్తుకొని ఆస్పత్రి నుంచి పరుగులు పెట్టాడు. సిబ్బంది వెంట పడటంతో స్థానికులు అతన్ని పట్టుకొని, దేహశుద్ధి చేశారు. చంటిపాపను ఇవ్వకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని, పసికందును తల్లికి అప్పగించి. ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement