సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆగస్టు 30న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడి చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఫీజు సకాలంలో విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
రెండేళ్లకు సంబంధించి రూ.2,200 కోట్ల ఫీజు, స్కాలర్‌షిప్ బకాయిలున్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి రెండు త్రైమాసికాల నిధులను కూడా విడుదల చేయాలన్నారు. 119 కొత్త గురుకులాలను ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని, బీసీ, ఈబీసీ విద్యార్థులకు ర్యాంకుతో సంబంధం లేకుండా కన్వీనర్ కోటాలో సీటు సాధించిన వారందరికీ పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment