ఫీజుల చెల్లింపుల్లో ఇబ్బంది వాస్తవమే
- విద్యా సంవత్సరం పూర్తికాక ముందే చెల్లిస్తాం: కడియం
- ఆ 26 బీసీ కులాల విద్యార్థులకు కోర్సుల కొనసాగింపు కోసం ఫీజులు
- వచ్చే ఏడాది కోసం కొత్త విధానం రూపకల్పన
- ప్రతి జిల్లాకో రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం కారణంగా విద్యార్థులు, కళాశాలలకు కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవమేనని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అంగీకరించారు. అయితే, ఈ విద్యా సంవత్సరం పూర్తికాక ముందే విడతల వారీగా ఫీజులు విడుదల చేస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుపై గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో బీజేపీఎల్పీ నేత కె.లక్ష్మణ్, ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్(బీజేపీ), కొప్పుల ఈశ్వర్(టీఆర్‌ఎస్), భట్టి విక్రమార్క(కాంగ్రెస్) తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమాధానమిచ్చారు. గ్రేడింగ్ విధానం వల్ల ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులు వేర్వేరుగా ఉన్నా, అందుకు తగ్గట్లు ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పూర్తి ఫీజులను చెల్లిస్తామన్నారు.
10 వేలకు లోపు ర్యాంకులు సాధించిన బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు సైతం పూర్తి ఫీజులు చెల్లిస్తామన్నారు. విద్యార్థుల స్థానికత నిర్ధారణ కోసం 371డీ ఆర్టికల్ అమలు మినహా ఈ సంవత్సరం ఫీజుల పథకాన్ని యథాతథంగా అమలు చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు, కళాశాలలకు ఇబ్బంది కలగకుండా ఫీజుల పథకానికి కొత్త విధానాన్ని రూపొందిస్తున్నామన్నారు. ఈ ఏడాది 15.77 లక్షల విద్యార్థులకు సుమారు రూ.2,300 కోట్ల ఫీజులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. బీసీ కులాల జాబితా నుంచి 26 కులాలను తొలగించినా.. ఇప్పటికే ప్రవేశాలు పొందిన ఆ కులాల విద్యార్థులకు సంబంధిత కోర్సులు పూర్తయ్యే వరకు ఫీజులు చెల్లిస్తామన్నారు. హైదరాబాద్‌లో విద్యార్థులకు కుల సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేయగా.. ఇబ్బందులు తొలగిస్తామని కడియం హామీ ఇచ్చారు. వచ్చే సంవత్సరం నుంచి ప్రతి జిల్లాలో ఒక రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
కేజ్ కల్చర్‌లో చేపల సాగు: పోచారం
రాష్ట్రంలో కేజ్ కల్చర్ విధానంలో మత్స్య సంపద పెంపునకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. జార్ఖంఢ్‌లోని చండియా జలాశయంలో విజయవంతమైన ఈ కేజ్ కల్చర్ విధానంపై స్వయంగా అధ్యయనం చేయగా లాభసాటిగా ఉన్నట్టు తేలిందన్నారు. దీంతో రాష్ట్రంలో తొలిసారిగా ఈ ఏడాది కోయిల్‌సాగర్, లోయర్ మానేరు, శ్రీరాం సాగర్, నిజాం సాగర్, పోచారం ప్రాజెక్టుల్లో కేజ్ కల్చర్ విధానంలో చేపల సాగును ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. మత్స్య కారుల అంశంపై చిలమల మదన్‌రెడ్డి(టీఆర్‌ఎస్) అడిగిన ప్రశ్నకు మంత్రి పోచారం ఈ మేరకు సమాధానమిచ్చారు.
మెట్రో విస్తరణపై ఆలోచన: తుమ్మల
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ఏడు మార్గాల్లో పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. మియాపూర్-పటాన్‌చెరు, ఎల్‌బీనగర్-హయత్‌నగర్, ఫలక్‌నుమా-శంషాబాద్, తార్నాక-ఈసీఐఎల్, నాగోల్-ఎల్.బి.నగర్-ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు మార్గాల్లో మెట్రో పొడిగింపుపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెట్రోపై టీఆర్‌ఎస్ సభ్యులు మలిపెద్ది సుధీర్‌రెడ్డి, చింతా ప్రభాకర్‌తో పాటు కె.లక్ష్మణ్ (బీజేపీ), ముంతాజ్ అహమ్మద్ ఖాన్(ఎంఐఎం) తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. 2017 జూలై లోగా మెట్రో ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందన్నారు. నాగోల్-మెట్టుగూడ మార్గంలో ఉగాది రోజున ప్రారంభం కావాల్సిన మెట్రో రైలు సర్వీసును నిర్మాణ సంస్థే వాయిదా వేసుకుందన్నారు. సికింద్రాబాద్ వరకు లైను పొడిగించిన తర్వాత సేవలను ప్రారంభించాలని నిర్ణయించిందన్నారు.