నల్లకుంట,న్యూస్‌లైన్: నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో బుధవారం రాత్రి మరో ఐదు ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయి. చాంద్రాయణగుట్ట హఫీజ్‌బాబానగర్‌లోని బేక్‌వెల్ బేకరీలో మార్చి 29న పాడైపోయిన పిజ్జా, బర్గర్‌లు తిని పలువురు అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చేరిన విషయం తెలిసిందే. కాగా, బాధితుల్లో పది మంది మంగళవారం రాత్రి చికిత్స కోసం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో చేరారు. ఇదిలా ఉండగా మరో ఐదుగురు బాధితులు బుధవారం రాత్రి ఫీవర్ ఆసుపత్రిలో చేరారు.
వీరిలో కంచన్‌బాగ్‌కు చెందిన ఫిరదౌసి బేగం(9), ఖలీ దాబిన్ యూసఫ్(22), అబ్దుల్ సమి(32), హసీనాబేగం(36)తో పాటు మౌలాలికి చెందిన ఆబేద్(23) ఉన్నారు. చికిత్స అనంతరం ఈ ఐదుగురిలో ఫిరదౌసిబేగం, యూసఫ్, హసీనాబేగం, ఆబేద్‌లను గురువారం ఉదయం డిశ్చార్జి చేసినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, బాధితుల్లో ప్రస్తుతం 11 మంది తమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, అందరూ కోలుకుంటున్నారని, ఎవరికీ ప్రాణాపాయం లేదని పీవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
బేకరీ యజమానుల అరెస్ట్
సంతోష్‌నగర్: కలుషిత ఆహారం వల్ల దాదాపు 20 మంది అస్వస్థతకు గురికావడానికి కారణమైన హఫీజ్‌బాబానగర్‌లోని బేక్‌వెల్ బేకరీ యజమానులను కంచన్‌బాగ్ పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. బేక్‌వెల్ బేకర్స్‌లో పాడైపోయిన ఫిజ్జాలు, బర్గర్‌లు తిని వినియోగదారులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
బాధితుల్లో చాలా మంది ఇప్పటికీ చాంద్రాయణగుట్టలోని బాకోబన్ ఆసుపత్రి, బార్కాస్ ఆసుపత్రి, నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. హఫీజ్‌బాబానగర్‌కు చెందిన విద్యార్థి మహ్మద్ అలీముద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బేకరీ యజమానులైన సోదరులు మహ్మద్ అబ్దుల్ గఫార్(32), మహ్మద్ నిస్సార్(36)లను గురువారం అరెస్ట్ చేసి రిమాం డ్‌కు తరలించినట్టు ఇన్‌స్పెక్టర్ రమేష్ కొత్వాల్ తెలిపారు.
‘ఫీవర్’లో మరో ఐదు ఫుడ్‌పాయిజన్ కేసులు
Published Fri, Apr 4 2014 3:06 AM | Last Updated on Wed, Jun 13 2018 8:02 PM
Advertisement
Advertisement