
కేంద్ర మంత్రివర్గంలో చోటు!
సాక్షిప్రతినిధి, వరంగల్ : కేంద్రంలో ఏర్పడనున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం లో తెలుగుదేశం పార్టీ చేరడం ఖాయ మైంది. తెలంగాణకు సంబంధించి టీడీపీ కోటాలో ఎవరికి కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీకి తెలంగాణలో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం ఒక్కటే దక్కింది. ఈ స్థానం నుంచి గెలిచిన మల్లారెడ్డి ఎన్నికల ముందే టీడీపీలో చేరారు. దీంతో తెలంగాణకు సంబంధించి టీడీపీ కోటాలో రాజ్యసభ సభ్యులకే అవకాశం కల్పించే పరిస్థితి ఉంది. జిల్లాలోని ఇద్దరు రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్‌రావు, గుండు సుధారాణిలలో ఒకరికి అవకాశం వస్తుందని టీడీపీ శ్రేణులు ఆశిస్తున్నాయి.
ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత గరికపాటి మోహన్‌రావుకు కేంద్రంలో మంత్రి పదవి దక్కే అవకాశం మెండుగా కనిపిస్తోంది. టీడీపీ అధినేతతో ఉన్న సాన్నిహిత్యం గరికపాటికి ప్రధాన అనుకూలతగా ఉంది. 2004లో అధికారం కోల్పోయిన రోజు నుంచీ.. గరికపాటి మోహన్‌రావు రాజకీయంగా, ఆర్థికంగా టీడీపీకి అండగా ఉంటున్నారు. చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’తో పాటు భారీ కార్యక్రమాలకు గరికపాటి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ అంశాలతోనే ఇటీవల గరికపాటికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం వచ్చింది. సాధారణ ఎన్నికల్లో గరికపాటి తెలంగాణలోని పలువురికి ‘సహకారం’ అందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల సమన్వయ బాధ్యతలను గరికపాటి నిర్వహించారు.
ఈ మూడు జిల్లాలో కలిపి టీడీపీకి 44 సీట్లు వచ్చారుు. ఏడు లోక్‌సభ స్థానాల్లోనూ విజయం సాధించింది. టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంలో గరికపాటికి మరింత గుర్తింపు వచ్చిందని, తెలంగాణ కోటాలో ఈయనకు కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల వరకు తెలంగాణలో పార్టీని పటిష్ట పరచడంపై దృష్టి పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు... అన్ని రకాలుగా తనకు విధేయుడిగా ఉండే గరికపాటి మోహన్‌రావుకు ఈ అవకాశం కల్పిస్తారని అంటున్నారు. జిల్లాలోని మరో రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి పేరు సైతం కేంద్ర మంత్రి వర్గం విషయంలో పరిశీలనకు వస్తుందని ఆమె వర్గీయులు చెబుతున్నారు.