- 1996లో ప్రాజెక్టు ఆరంభం మొదలు ఇంతవరకు లేని మరమ్మతులు
- పట్టించుకోని గత ప్రభుత్వాలు
- తాజాగా రూ. 15 కోట్లతో అంచనాలు సిద్ధం చేసిన నీటి పారుదల శాఖ
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మరమ్మతు పనులకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. 1996లో ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన తర్వాత తొలిసారి ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి కొత్త కళను తెచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే చేపట్టాల్సిన మరమ్మతు పనులను గుర్తించిన నీటి పారుదల శాఖ వాటికి అయ్యే ఖర్చుపై అంచనాలను సైతం సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపింది. పూర్తి పరిశీలన అనంతరం ఈ పనులకు మోక్షం లభించే అవకాశం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. 11.94 టీఎంసీల నిల్వ, 234 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో 1.04 లక్షల ఆయకట్టు లక్ష్యంగా 1996లో జూరాల ప్రాజెక్టును ప్రారంభించిన విషయం తెలిసిందే.
27.80 మీటర్ల ఎతై్తన డ్యామ్‌కు 64 రేడియల్ క్రస్ట్‌గేట్లు ఉన్నాయి. వీటిని పైకి ఎత్తాలన్నా, దించాలన్నా అందుకు ఉపయోగించే వైర్ రోప్స్ అత్యంత కీలకం. అవి సరిగా, బలంగా ఉంటేనే గేట్లను ఎత్తడం, దించడం సాధ్యమవుతుంది. లేదంటే గేట్లు తెరుచుకోవడం కష్టం. దీంతో పాటే గేట్లకు ఎప్పటికప్పుడు పెయింటింగ్ వేయడం సైతం అత్యంత ముఖ్యం. అది చేయని పక్షంలో తుప్పుపట్టి గేట్లకు రంధ్రాలు పడతాయి. దీనివల్ల డ్యామ్ భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. డ్యామ్ కట్టిన 15 ఏళ్ల తర్వాత జూరాల ప్రాజెక్టు నిర్వహణ, డ్యామ్ భద్రతపై దృష్టి పెట్టిన అప్పటి డ్యామ్ సేఫ్టీ ప్యానల్ మరమ్మతులు అవసరమని, వీలైనంత త్వరగా దాన్ని చేపట్టాలని సూచించింది.
అయితే ప్యానల్ సూచనను పెద్దగా పట్టించుకోని అప్పటి ప్రభుత్వాలు ఎలాంటి మరమ్మతు చర్యలకు పూనుకోలేదు. తర్వాత కాలంలోకూడా అదే డ్యామ్ సేఫ్టీ ప్యానల్‌తో పాటు, ఇతర ఇంజనీరింగ్ శాఖల నిపుణులు 2011లో ఒకమారు, 2013లో మరోమారు జూరాల మరమ్మతుల అవసరాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా ఫలితం కానరాలేదు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ తొలిసారి జూరాల మరమ్మతుల అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. పనులకు అయ్యే అంచనా వ్యయాలను సిద్ధం చేసి పంపాలన్న ఉన్నతాధికారుల సూచనతో కదిలిన డ్యామ్ అధికారులు రూ.15 కోట్లతో అంచనాలు తయారు చేశారు. వీటిని త్వరలోనే ప్రభుత్వ ఆమోదంకోసం పంపనున్నారు. కాగా, వీలైనంత త్వరగా ఈ నిధులను ఇచ్చేందుకు ప్రభుత్వం సైతం సిద్ధంగా ఉందని ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి.