ఫైన్‌ బియ్యం దందా | Fine Rice Business With Fake Name | Sakshi
Sakshi News home page

ఫైన్‌ బియ్యం దందా

Published Mon, Apr 9 2018 12:09 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

Fine Rice Business With Fake Name - Sakshi

కర్నూల్‌ రైస్‌ పేరుతో ఉన్న బస్తాలు

మిర్యాలగూడ : బియ్యం వ్యాపారంలో ఆరితేరిన రైస్‌మిల్లర్లు సూపర్‌ ఫైన్‌ బియ్యం విక్రయాల్లో అడ్డదారులు తొక్కుతున్నారు. సూపర్‌ ఫైన్‌ బియ్యంలో కర్నూల్‌ రైస్‌కు తెలుగు రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉంది. దానిని ఆసరాగా చేసుకుంటున్న మిర్యాలగూడ రైస్‌మిల్లర్లు కొంత మంది ‘నం.1 కర్నూల్‌ రైస్‌’ పేరుతో దందా సాగిస్తున్నారు. ఏ రైస్‌ మిల్లులోతయారవుతున్నాయో వారి ఇండస్ట్రీ పేరుతోనే బియ్యం వ్యాపారం సాగించాల్సి ఉంది. కానీ స్థానికంగా బియ్యం విక్రయించుకోవడానికి సొంత ఇండస్ట్రీ పేరును ఉపయోగిస్తూనే, హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే సమయంలో కర్నూల్‌ రైస్‌ పేరుతో దందా సాగిస్తున్నారు. లోకల్‌ బ్రాండ్‌ ఉన్న ఫైన్‌ బియ్యాన్ని 25 కిలోల బస్తాను 1,100 రూపాయలకు విక్రయిస్తుండగా కర్నూల్‌ రైస్‌ బ్రాండ్‌తో ఉన్న 25 కిలోల ఫైన్‌ బియ్యాన్ని 1150 రూపాయలకు వి క్రయిస్తున్నారు. స్థానికంగా తయారైన వాటినే కర్నూల్‌ రైస్‌పేరుతో సూపర్‌ ఫైన్‌ బియ్యంగా విక్రయించి క్వింటాకు అదనంగా రెండు వందల రూపాయలు కూడా వినియోగదారుడి వద్ద దోచుకుంటున్నారు.

సూపర్‌ ఫైన్‌ బియ్యంలో మిక్సింగ్‌ ఇలా..
లోకల్‌ బ్రాండ్‌ పేరుతో సూపర్‌ ఫైన్‌ బియ్యం విక్రయిస్తున్నారు. అయితే అందులో బీహార్‌ ధాన్యంతో తయారు చేసిన బియ్యాన్ని మిక్సింగ్‌ చేస్తున్నారు. వాస్తవానికి సూపర్‌ఫైన్‌ బియ్యం తయారు చేయాలంటే బీపీటీ ధాన్యంతో పాటు రబీలో దిగుబడి వస్తున్న హెచ్‌ఎంటీలతో పాటు మరికొన్ని రకాలను వినియోగించాల్సి ఉంది. కానీ బీహార్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సాధారణ రకం ధాన్యాన్ని బియ్యంగా మార్చి సూపర్‌ఫైన్‌లో మిక్సింగ్‌ చేస్తున్నారు. క్వింటాకు 4400 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న వినియోగదారులు మిక్సింగ్‌ బియ్యం తినాల్సి వస్తోంది.

బియ్యం వ్యాపారుల సిండికేట్‌
మిర్యాలగూడలో బియ్యం వ్యాపారులు సిండికేట్‌గా మారారు. మిర్యాలగూడలోనే సుమారుగా వంద రైస్‌ మిల్లులు ఉప్పటికీ కేవలం 10 నుంచి 15 మంది రైస్‌ మిల్లర్లు మాత్రమే స్థానికంగా బియ్యం విక్రయాలు చేస్తుంటారు. మిగతా వారు ఎక్కువగా హైదరాబాద్‌తో ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేస్తుంటారు. స్థానికంగా బియ్యం విక్రయించే మిల్లర్లు సిండికేట్‌గా మారి ధరలను విపరీతంగా పెంచుతున్నారు. ఫైన్, సూపర్‌ ఫైన్‌ బియ్యం పేరుతో రకరకాల పేర్లతో దందా సాగిస్తున్నారు. హైదరాబాద్‌లో సూపర్‌ఫైన్‌ బియ్యానికి ఉన్న ధరలనే మిర్యాలగూడలో విక్రయిస్తున్నారు.

తూకంలోనూ మోసం
25 కిలోల సూపర్‌ఫైన్‌ బియ్యం బస్తాలో కేవలం 24 కిలోల తూకం మాత్రమే ఉంటుంది. కానీ 25 కిలోల బస్తాకు నిర్ణయించిన ధరనే తీసుకుంటారు.  ఈ బస్తాను 1150 రూపాయలకు విక్రయిస్తే, దానిలో ఒక కిలో బియ్యం తక్కువగా ఉన్నట్లయితే వినియోగదారుడు కిలోకు 46 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అంటే క్వింటా బియ్యానికి నాలుగు కిలోలకు 184 రూపాయలను అదనంగా ఇవ్వాలి. ఈ విధంగా వినియోగదారులను తూకంలో కూడా మోసం చేస్తున్నారు.

బియ్యం ఓపెన్‌ మార్కెట్‌లో విక్రయించుకోవచ్చు
బియ్యం ఓపెన్‌ మార్కెట్‌లో విక్రయించుకోవచ్చు. క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో వినియోగదారులు సరిచూసుకోవాలి. కర్నూల్‌ బ్రాండ్‌ పేరు బియ్యం విక్రయాలు ఎక్కువగా సాగుతున్నాయి. ఏ బ్రాండ్‌తో బియ్యం విక్రయాలు చేసినా రైస్‌మిల్లు అడ్రస్‌ ఉండాలి. తూకంలో తక్కువగా ఉంటున్న విషయంపై తూనికల కొలతల అధికారులు ఇటీవల రెండు, మూడు కేసులు కూడా నమోదు చేశారు. అదే విధంగా సూపర్‌ఫైన్‌ బియ్యం మిక్సింగ్‌ విషయంలో వినియోగదారులు నాణ్యత చూసుకొని కొనుగోలు చేయాలి. బియ్యం రవాణా, తయారీపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో మేము తనిఖీలు చేయాలనే నిబంధనలు కూడా లేవు.   
– డీఎస్‌ఓ ఉదయ్‌కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement