
హైదరాబాద్: జీవితంలో తొలిసారి మోడరేటర్‌గా విధులు నిర్వర్తించబోతు న్నానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. ప్రధానంగా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిన మహిళా దిగ్గజాలు పాల్గొనే కార్యక్రమంలో మోడరేటర్ విధులను నిర్వహించేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో నీతి ఆయోగ్, ఫేస్‌బుక్, ఐఎస్‌బీ సంయుక్తంగా నిర్వహించిన ‘రోడ్ టూ జీఈఎస్’లో భాగంగా ‘గెట్ ఇన్ ద రింగ్’ కార్యక్రమాన్ని ఆయన సోమవారం రాత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సొంతంగా ఉన్న ఆలోచనలతోనే పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగాలు చేయడం తనకు అలవాటని, కానీ.. జీఈఎస్ సదస్సులో రెండవ రోజు మోడరేటర్‌గా వ్యవహరించడం కొత్త అనుభూతి ఇస్తుందని ఆయన అన్నారు. ఈ సమ్మిట్‌లో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, వినూత్న ఆలోచనలతో వ్యాపారాలు ప్రారంభించడానికి మహిళలు ముందుకొస్తే ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అనంతరం పలువురు విద్యార్థులు, ఇతరులు రూపొందించిన స్టార్టప్‌లపై తమ ఆలోచనలను గెట్ ఇన్ ద రింగ్ కార్యక్రమంలో పాల్గొని పంచుకున్నారు. తాము ఏర్పాటు చేసిన స్టార్టప్ లక్ష్యాలు, అవి ప్రజలకు ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటాయో వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, కార్యక్రమం జ్యూరీ సభ్యులు వీ వర్క్ ఇండియా కో–జీఎం రియాన్ బెన్నెట్, ఫేస్‌బుక్ స్ట్రాటజిక్ పార్టనర్ సత్యజిత్ సింగ్, యునైటెడ్ టెక్నాలజీ ఉపాధ్యక్షుడు ప్రకాశ్ బొడ్ల, శ్రీకాంత్ సుందర్‌రాజన్ తదితరులు పాల్గొన్నారు.