Moderator
-
భారత్‌లో తప్పులో కాలేస్తున్న ఫేస్బుక్
న్యూయార్క్: వివాదాస్పద అంశాల తొలగింపు విషయంలో ఫేస్బుక్ తమ ఉద్యోగులకు జారీచేసిన మార్గదర్శకాల్లో లోపాలు ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. స్థానికంగా ఆయా దేశాల్లో చట్టాలు ఓరకంగా ఉంటే, ఫేస్బుక్ వాటిని మరోరకంగా అర్థం చేసుకుంటోందని అభిప్రాయపడింది. ఇండియాలో హింసను రెచ్చగొట్టేలా దైవదూషణ చేస్తేనే నేరమనీ, విమర్శలు చేస్తే కాదని పేర్కొంది. అలాగే భారత్‌లో నినాదాల సందర్భంగా తరచుగా వాడే ఫ్రీ కశ్మీర్ అనే పదాన్ని ఆజాద్ కశ్మీర్‌గా పొరబడి తొలగిస్తున్నారంది. ఇండోనేసియాలో అగ్నిపర్వత బాధితులకు సాయం కోసం పెట్టిన పోస్టులను ఫేస్బుక్ తొలగించిందని తెలిపింది. -
జీవితంలో తొలిసారి మోడరేటర్‌గా విధులు
హైదరాబాద్: జీవితంలో తొలిసారి మోడరేటర్‌గా విధులు నిర్వర్తించబోతు న్నానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. ప్రధానంగా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిన మహిళా దిగ్గజాలు పాల్గొనే కార్యక్రమంలో మోడరేటర్ విధులను నిర్వహించేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో నీతి ఆయోగ్, ఫేస్బుక్, ఐఎస్బీ సంయుక్తంగా నిర్వహించిన ‘రోడ్ టూ జీఈఎస్’లో భాగంగా ‘గెట్ ఇన్ ద రింగ్’ కార్యక్రమాన్ని ఆయన సోమవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సొంతంగా ఉన్న ఆలోచనలతోనే పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగాలు చేయడం తనకు అలవాటని, కానీ.. జీఈఎస్ సదస్సులో రెండవ రోజు మోడరేటర్‌గా వ్యవహరించడం కొత్త అనుభూతి ఇస్తుందని ఆయన అన్నారు. ఈ సమ్మిట్‌లో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, వినూత్న ఆలోచనలతో వ్యాపారాలు ప్రారంభించడానికి మహిళలు ముందుకొస్తే ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అనంతరం పలువురు విద్యార్థులు, ఇతరులు రూపొందించిన స్టార్టప్‌లపై తమ ఆలోచనలను గెట్ ఇన్ ద రింగ్ కార్యక్రమంలో పాల్గొని పంచుకున్నారు. తాము ఏర్పాటు చేసిన స్టార్టప్ లక్ష్యాలు, అవి ప్రజలకు ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటాయో వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, కార్యక్రమం జ్యూరీ సభ్యులు వీ వర్క్ ఇండియా కో–జీఎం రియాన్ బెన్నెట్, ఫేస్బుక్ స్ట్రాటజిక్ పార్టనర్ సత్యజిత్ సింగ్, యునైటెడ్ టెక్నాలజీ ఉపాధ్యక్షుడు ప్రకాశ్ బొడ్ల, శ్రీకాంత్ సుందర్రాజన్ తదితరులు పాల్గొన్నారు. -
జీన్యస్!
జన్మపత్రిక.. మనం పుట్టిన నక్షత్రాన్ని బట్టి మన రాశి, దశ, గ్రహచారాలను చెప్తుంది! జినోమ్‌పత్రి.. మన నోట్లోని సలైవాలోని డీఎన్ఏను బట్టి మన ఆరోగ్యదశను వెల్లడిస్తుంది! ఇది మ్యాప్ మైజీనోమ్ సృష్టి! ఓసిమమ్ బయోసొల్యూషన్స్ అండ్ మ్యాప్ మైజీనోమ్.. ఈ రెండూ స్త్రీ శక్తికి నిదర్శనాలు! ఆమె పేరే అనురాధా ఆచార్య. ఇప్పుడెందుకు ఈ పరిచయం? అంటే.. రేపు 28న హైదరాబాద్‌లో జరగబోయే గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్‌లో స్పీకర్.. మోడరేటర్‌గా వ్యవహరించబోతున్నారు! అనురాధా ఆచార్య రాజస్థాన్‌లోని బికనీర్‌లో పుట్టారు. తండ్రి ..హెచ్. ఎన్. ఆచార్య సైంటిస్ట్. తల్లి సరళ గృహిణే అయినా పిల్లల మీద చాలా ప్రభావం చూపారు. తల్లి చదువుకుంది ఆరో తరగతే. తొమ్మిదేళ్లకే పెళ్లి. పై చదువులకు అవకాశం లేకపోయినా.. విజ్ఞానాన్ని పంచే పుస్తకాలు ఎన్నో చదివింది. లెక్కల్లో చాలా చురుకు. ఎంతటి క్లిష్టమైన సమస్యనిచ్చినా నిమిషాల్లో సాల్వ్ చేసేస్తుంది. ఇక తండ్రి అయితే.. చెప్పలేనంత స్ఫూర్తినిచ్చారు అనూరాధకు. సైంటిస్ట్ అవడం వల్లో.. కొత్తవిషయం పట్ల జిజ్ఞాస ఉండడం వల్లో ఏమో కాని.. ఇంట్లో ఉన్నప్పుడు ఒక్క నిముషం కూడా ఖాళీగా ఉండేవారు కాదట. ఎప్పుడూ ఏవేవో వస్తువులను తయారు చేస్తూ.. కొత్తవాటిని కనుక్కుంటూ కాలాన్ని లక్ష్యపెట్టేవాడేకాదట. బహుశా అనూరాధకు తండ్రి నుంచి జిజ్ఞాస, తల్లి నుంచి ఆ చురుకుదనం జీన్స్ అంది ఉంటాయి. అందుకే ఓసిమమ్ బయోసొల్యూషన్స్ పుట్టి ఉంటుంది. జీనోమ్‌పత్రి రాయాలనే ఆలోచనా వచ్చి ఉంటుంది. ‘‘మా పేరెంట్స్ ఎప్పుడూ చదువు చదువు అని మా మీద ఒత్తిడి పెట్టలేదు. నాన్న ఎప్పుడూ ఒకటే చెప్పేవారు– ‘ఆర్థికంగా ఎవరిమీదా ఆధారపడకూడదు. శక్తినే నమ్ముకోవాలి. పని ఏదైనా సరే ప్రేమతో చేయాలి. కమిటెడ్‌గా ఉండాలి’ అని. అదే మాలో నాటుకుపోయింది. ఒకరకంగా మా భవిష్యత్‌కు అదే దారైందనుకోవచ్చు. ఆ మాటను మాలోనే కాదు మా అమ్మలో కూడా బలంగా నాటారు నాన్న. ఇప్పుడు ఆయన తోడు లేరు అమ్మకు. అయినా ఆమె బికనీర్‌లో ఒంటరిగా ఉంటోంది తప్ప మా దగ్గరకు రాదు’’ అంటూ నాన్న స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు అనూరాధ. సైన్స్ ... బిజినెస్ ఖరగ్‌పూర్ ఐఐటీ అనూరాధ జీవితంలో ముఖ్యమైంది. దాదాపు ఆమె చదువంతా అక్కడే. అక్కడే ఏంబీఏ చేయాలనుకున్నారు. కాని అమెరికా వెళ్లారు ఫిజిక్స్‌లో పీహెచ్డీ చేయడానికి. షికాగో యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ చేశారు. స్టార్టప్ కూడా అక్కడే స్టార్ట్ చేశారు. చిన్నప్పుడు వాళ్ల నాన్న చేసే ఇన్వెన్షన్స్లోనూ అనూరాధ పాలుపంచుకునేవారు. ఉత్సాహంతో తానూ కొన్ని వస్తువులను తయారు చేసేవారు. తర్వాత నాన్న అనుమతితో సేల్ చేసేవారట. తయారు చేయడంలో కన్నా కూడా అలా సేల్ చేసి, డబ్బు చేతికందినప్పుడు భలే ఆనందం అనిపించేదట. ‘‘బహుశా బిజినెస్ స్పిరిట్ అప్పుడే మొగ్గతొడిగిందేమో. అమెరికా వెళ్లాక అది దృఢపడింది. సైన్స్ కన్నా కూడా ఆ రంగానికి సంబంధించిన వ్యాపారంలోనే నాకు ఆసక్తి. అందులోనే నైపుణ్యం ఉందని అర్థమైంది అక్కడే’’ అంటారు అనూరాధా. ఈలోపే పెళ్లి, తర్వాత పాప పుట్టడంతో హైదరాబాద్ వచ్చేశారు. హైదరాబాద్‌లో బిజినెస్ స్టార్ట్ చేయాలని అంతకుముందే అనూరాధా, ఆమె భర్త (సుభాష్ లింగారెడ్డి)కు ఉండడంతో ఇక్కడకు వచ్చేశారు. అలా ఓసిమమ్ బయోసొల్యూషన్స్, మ్యాప్‌మైజీనోమ్‌కు మ్యాప్ వేశారు అనూరాధ! మహిళలే స్ట్రాంగ్... అయినా... బయాలజీలో మొదటి నుంచీ మహిళలే స్ట్రాంగ్. అయితే అందులో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మహిళల సంఖ్య అంతగా లేదు. ‘బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆత్మవిశ్వాసం కావాలి. మగవాళ్లకు ఈజీ. ఎందుకంటే వాళ్లకు సపోర్ట్సిస్టమ్ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లే యాక్సెస్ ఉంటుంది. ఈ విషయంలో స్త్రీలు ఎక్కువ కష్టపడాలి. చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి మనం. స్ట్రాంగ్‌గా లేకపోతే చేయలేకపోతాం. నెట్‌వర్క్‌కు యాక్సెస్ కావాలి. కాపిటల్కు యాక్సెస్ కావాలి. సరైన సలహాదారులు అవసరం. ఇక్కడే విమెన్‌కు చాలెంజెస్ ఉంటాయి. ఈ చాలెంజెస్‌ను అధిగమించగలిగితే చాలు. ఇవన్నీ మగవాళ్లకు ఉండవని కాదు. కాని వాళ్లకు ఉండే సపోర్ట్సిస్టమ్ వీటిని ఈజీ చేస్తుంది. దాదాపు 65 దేశాల్లో మాకు మార్కెట్ ఉంది. ఈ అనుభవంతో చూసినా విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు మన దగ్గరే చాలా అవకాశాలున్నాయి. అలాగని డిస్క్రిమినేషన్ లేదని అనను. అభివృద్ధి చెందుతున్న దేశం. ఉంటుంది. అలాగని భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లొచ్చు. సవాళ్లను ఎదుర్కొని నిలబడ గలగాలి’’ అంటారు అమె. విమెన్ ఫస్ట్.. ప్రాస్పరిటీ ఫర్ ఆల్.. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. చదువుకు ఇల్లాలు ఎంటర్ప్రెన్యూర్ అయితే దేశానికే కలిమి. అందుకే మహిళలకు ప్రథమ స్థానం ఇవ్వాలి. హైదరాబాద్‌లో జరగబోయే గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్ నినాదం కూడా ఇదే. ‘విమెన్ ఫస్ట్.. ప్రాస్పరిటీ ఫర్ ఆల్’! ఈ జీఈఎస్ ఎనిమిదోది. ఇప్పటివరకే ఏ సమ్మిట్‌కు రానంతమంది మహిళలు దీనికి హాజరవుతున్నారు. అందులో మనవాళ్లూ చాలామందే ఉన్నారు. ఈ లెక్కన ఈ సమావేశం మన మహిళలకు ఎంతో ప్రేరణను.. మరెంతో స్ఫూర్తిని.. ఇంకెన్నో వ్యాపార అవకాశాలను ఇవ్వనుందా అని అడిగితే ‘‘తప్పకుండా! ఈ సమ్మిట్‌లో చాలామంది స్పీకర్స్ మహిళలే. ఎన్నో విషయాలు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా సమ్మిట్స్‌లో ఒక్క మహిళా ఎంట్రప్రెన్యూర్ నూ చూడం. కాని ఇక్కడ సమాన ప్రాతినిధ్యం ఉంది. ఇదే మనకు చాలా హెల్ప్ కానుంది. లైఫ్ సైన్సెస్, హెల్త్ మీదే ఈ సమ్మిట్‌లో ప్రధాన ఫోకస్. కాబట్టి... ఈ అంశాలకు నేచురల్ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌లో ఈ సమ్మిట్ నిర్వహించడం వల్ల చాలా ఉపయోగం’’ అన్నారు. ‘‘సైన్స్‌ను ల్యాబ్ నుంచి బిజినెస్‌కు ఎలా తీసుకెళ్లొచ్చు. రియల్ బిజినెస్‌గా ఎలా మార్చవచ్చు అనే అంశం మీద నేను మాట్లాడబోతున్నా. ఆ సెషన్‌కు మోడరేటర్గానూ ఉండబోతున్నా’’నని చెప్పారు అనూరాధ. ‘‘మా కంపెనీలో 80 శాతం మహిళలే. దాన్ని నూరు శాతం విమెన్ పవర్‌గా చేయాలి. మా నాన్న మా భవిష్యత్ ఇలాగే ఉండాలని నిర్దేశించలేదు. ‘నీ నిర్ణయాలు నీవే’ అనేవారు. నేనూ అంతే. నాకు ఇద్దరు అమ్మాయిలు. వాళ్ల భవిష్యత్ గురించి నాకు ఎలాంటి యాంబిషన్స్ లేవు. నేనూ వాళ్లను ఒత్తిడి చేయను. నాన్న నాకిచ్చిన స్వేచ్ఛను నేనూ పిల్లలకు ఇస్తున్నాను. ఈ జనరేషన్ అమ్మాయిలక్కూడా నేనొకటే చెప్తాను. ఇష్టంలేని పని చేయొద్దు. ఇష్టమైన పని మీద మనసు పెట్టాలి. స్ట్రాంగ్‌గా ఉండాలి. డోంట్ లూజ్ ప్యాషన్ ఆన్ వర్క్!’’ అంటారు అనూరాధా ఆచార్య. ఓసిమమ్, మ్యాప్ మై జీనోమ్ ఇన్వెన్షన్స్ జీనోమ్‌పత్రి.. టూత్‌బ్రష్ లాంటి పరికరం ఇది. చివుళ్ల మీద రబ్ చేసి దానికి అంటిన సలైవాలోని డీఎన్ఏతో మనకు ఏయే జబ్బులు రావచ్చో, వేటి రిస్క్ ఎక్కువో చెప్పే పరికరం. అలాగే ఇంకో పరికరాన్నీ ఉత్పత్తి చేస్తోందీ సంస్థ. అది క్షయను కనిపెట్టే సాధనం. బేబీ మ్యాప్ – అప్పుడే పుట్టిన పిల్లల డీఎన్ఏను సమీక్షించి భవిష్యత్‌లో రాబోయే 150 రకాల జబ్బులను ముందుగానే నిర్ధారించే పరీక్ష. దీనివల్ల సాధారణ చికిత్సతో జబ్బులు నయం చేసే అవకాశాలు ఉంటాయి. – సరస్వతి రమ -
అమ్మకానికి ఆడపిల్ల
కన్నవారికి పదివేలిచ్చి రూ.50 వేలకు అమ్ముకున్న మధ్యవర్తి యాచారం: కళ్లు తెరిచి లోకాన్ని చూడకుండానే పసిపాప అమ్మకానికి గురైంది. తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న మధ్యవర్తి రూ.10 వేలిచ్చి, ఆ పసికందును రూ.50 వేలకు అమ్ముకుంది. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం సర్దార్‌తండాకు చెందిన శిరీష, రవిలకు ఇద్దరు ఆడపిల్లలు. 4 రోజుల క్రితం శిరీష దేవరకొండలోని ప్రభుత్వాసుపత్రిలో మూడో కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. వీరికి బంధువైన కేతావత్ చక్రి అనే మహిళ హైదరాబాద్ ఎల్బీనగర్లో ఉంటోంది. శిరీష, రవిలకు ఆడపిల్ల పుట్టిందని తెలుసుకుని అమ్మకానికి ఒప్పించింది. సోమవారం రాత్రి 4 రోజుల పసిపాపను తల్లిదండ్రుల నుంచి తీసుకుని రూ. 50 వేలకు వేరే వారికి అమ్మేసింది. పాప తల్లిదండ్రులకు మాత్రం రూ.10 వేలే ఇచ్చింది. అనంతరం పాపతోపాటు ఆమెను కొన్నవారితో ఓ ప్రైవేటు వాహనంలో హైదరాబాద్‌కు బయల్దేరింది. విషయం బయటపడ టంతో పోలీసులు సాగర్‌రోడ్డు వద్ద తనిఖీలు చేపట్టారు. చక్రితోపాటు పాపను కొనుగోలు చేసిన సునీత, ధనలక్ష్మి, రవికిరణ్‌లను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. పసికందును శిశువిహార్‌కు తరలించారు.