చేప ప్రసాదం @ 171 ఏళ్లు | Fish Prasadam Distribution From 171 Years | Sakshi
Sakshi News home page

చేప ప్రసాదం @ 171 ఏళ్లు

Published Thu, Jun 6 2019 7:14 AM | Last Updated on Mon, Jun 10 2019 11:59 AM

Fish Prasadam Distribution From 171 Years - Sakshi

బత్తిని సోదరులు (ఫైల్‌)

చార్మినార్‌: మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. ఈ నెల 8న సాయంత్రం 6 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందని బత్తిని హరినాథ్‌ గౌడ్‌ తెలిపారు. చేప ప్రసాదం తయారీలో భాగంగా ఈ నెల 7న ఉదయం 11 గంటలకు దూద్‌బౌలిలోని ఆయన స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనంతరం 8వ తేదీ సాయంత్రం దూద్‌బౌలిలోని స్వగృహంలో కుటుంబ సభ్యులంతా చేప ప్రసాదాన్ని తీసుకున్న అనంతరం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పంపిణీ ప్రారంభమవుతుంది. కాగా.. చేప ప్రసాదానికి 171 ఏళ్ల చరిత్ర ఉందని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రతి ఏడాది పాతబస్తీ దూద్‌బౌలిలోని తమ స్వగహంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చేప ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇంటి బావిలోని నీటితోనే ఈ చేప ప్రసాదాన్ని తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పూర్వీకుల నుంచి ఈ బావిలోని నీటినే వాడుతున్నారు. ఇప్పటికీ ఈ బావిలో నీరు సమృద్ధిగా ఉంది.  

మొదట్లో 50 కిలోల వరకు..  
మొదట్లో 50 కిలోల వరకు తయారు చేసిన చేప ప్రసాదం ప్రస్తుతం 3.5 క్వింటాళ్లకు చేరిందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. మొన్నటి వరకు చేప మందుగా ప్రాచుర్యం పొందగా.. ప్రస్తుతం చేప ప్రసాదంగా మారింది. భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ సైతం చేప ప్రసాదం కోసం ఇక్కడికి వచ్చారని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

మూడు రకాలు..  
చేప మందును మూడు రకాలుగా తయారు చేస్తారు. చేపతో ఇచ్చే మందు, బెల్లంతో ఇచ్చే మందు, కార్తె మందు. 2 నుంచి 3 అంగుళాల కొరమీను చేపతో ఇచ్చే ప్రసాదాలు 10 గ్రాములుంటుంది. 30 గ్రాములు కలిగిన కార్తె మందును మూడు డోసులుగా 45 రోజుల పాటు వాడాలి. 15, 30,45 రోజుల్లో కార్తె మందును వాడాలి. చేపతో మింగడం ఇష్టం లేని వారికి బెల్లం ప్రసాదాన్ని అందజేస్తారు. నిజానికి చేపతో తీసుకునే ప్రసాదమే సత్ఫలితాలిస్తుందని చెబుతున్నారు.

రెండు గంటలకు ముందుగా..
చేప ప్రసాదం స్వీకరించే ముందు రెండు గంటల వరకు ఎలాంటి ఆహార పదార్థాలతో పాటు నీటిని కూడా స్వీకరించరాదని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చేప ప్రసాదం స్వీకరించిన అనంతరం గంటన్నర వరకు కూడా ఆహారం, నీరు తీసుకోవద్దు.  

బత్తిని స్వగృహంలోని బావి , పూజ అనంతరం చేప ప్రసాదం స్వీకరిస్తున్న బత్తిని హరినాథ్‌ గౌడ్‌ (ఫైల్‌)  

బత్తిని వీరన్న గౌడ్‌తో ప్రారంభం...
బత్తిని వంశ పూర్వీకులైన వీరన్న గౌడ్, శివరాంగౌడ్‌ల నుంచి చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. వీరి మూడో తరమైన శంకరయ్య గౌడ్‌ హయాంలో చేప ప్రసాదం పంపిణీ ఎక్కువ ప్రాచుర్యం పొందింది. అనంతరం మూడు తరాలుగా చేప ప్రసాదం కొనసాగుతూనే ఉంది.

ఇలా ఫలితం ..
ఔషధ గుణాలు కలిగిన ప్రసాదాన్ని చేప నోటిలో పెట్టి మింగడంతో అది కదులుతూ గొంతు ద్వారా జీర్ణాశయంలోకి వెల్లి జీర్ణకోశాన్ని శుభ్రం చేస్తుందంటున్నారు. అంతేకాకుండా నేరుగా జీర్ణాశయంలో జీర్ణం అవుతుండడంతో చేప ప్రసాదం త్వరగా రక్త ప్రసరణలో కలిసి శ్వాసకోశ సంబంధ వ్యాధులను తగ్గిస్తుందంటున్నారు బత్తిని సోదరులు. 

అప్పట్లో అక్కడ.. ఇప్పుడు ఇక్కడ..  
పూర్వీకుల నుంచి 1996 వరకు పాతబస్తీ దూద్‌బౌలిలో పంపిణీ అయిన చేప ప్రసాదం.. 1997లో పాతబస్తీలో జరిగిన మతకలహాల కారణంగా నిజాం కాలేజీ గ్రౌండ్‌కు మారింది. 1998లో అప్పటి ప్రభుత్వం పంపిణీ కోసం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ను కేటాయించింది. అనంతరం చేప ప్రసాదం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2012లో బత్తిని మృగశిర ట్రస్ట్‌కు కేటాయించిన కాటేదాన్‌లోని ఖాళీ స్థలంలో కాకుండా పక్కనే ఉన్న మరో ఖాళీ స్థలంలో పంపిణీ జరిగింది. పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలా టలో ఒకరు మృతి చెందడంతో పాటు పలువురు తీవ్ర గాయాలకు గురయ్యారు. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2013లో తిరిగి పంపిణీ కోసం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీకి అనుమతించింది. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చేప ప్రసాదం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోనే కొనసాగుతూ వస్తోంది. ఈసారి కూడా ఇక్కడే చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement