8, 9 తేదీల్లో చేప ప్రసాదం
♦ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పంపిణీ
♦ పూర్తికావస్తున్న ఏర్పాట్లు
♦ అన్ని ప్రభుత్వ శాఖలు పనుల్లో నిమగ్నం
♦ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని
హైదరాబాద్: ఈ నెల 8, 9 తేదీల్లో బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు హైదరాబాద్ నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖ, ఆర్ అండ్ బీ, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్, పోలీస్ తదితర శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆస్తమా రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభం
ఈ నెల 8వ తేదీ (గురువారం) ఉదయం 9 గంటలకు చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మృగశిర కార్తె ప్రారంభమయ్యే సమయంలో బత్తిని కుటుంబీకులు చేప ప్రసాద పంపిణీని చేపడతారు. 32 కౌంటర్ల ద్వారా చేపప్రసాదం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. దీంతో పాటు వీఐపీ కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రెండు రోజుల పాటు ఈ పంపిణీ కొనసాగుతుంది.
రెండు రోజుల ముందే నగరానికి రాక...
రెండు రోజుల ముందే పలు రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలి వస్తున్నారు. వారికి భోజన వసతులను పలు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్నాయి.
భారీ పోలీస్ బందోబస్తు
దాదాపు 1,000 మంది పోలీసులతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ స్వయంగా అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
2 లక్షల చేపపిల్లలు సిద్ధం: మంత్రి తలసాని
హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈ నెల 8వ తేదీన చేప ప్రసాద పంపిణీ పెద్ద ఎత్తున చేపడతామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. చేప ప్రసాద ఏర్పాట్లను మంగళవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చేప ప్రసాదం కోసం 2 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచుతున్నట్లు తలసాని వివరించారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. రైల్వేస్టేషన్లు, ఇతర ప్రధాన కేంద్రాల నుంచి అదనపు బస్సులను నడపాలని ఆదేశించినట్లు చెప్పారు. గురువారం ఉదయం పాతబస్తీలోని బత్తిని సోదరుల ఇంటి నుంచి పోలీస్ ఎస్కార్ట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి.. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేప ప్రసాదం సరైన సమయానికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
క్యూలైన్లలో నిలబడే వారికి వాటర్ ప్యాకెట్లు
క్యూలైన్లలో నిలబడే ఆస్తమా రోగులకు కూడా మంచినీటి ప్యాకెట్లను ఉచితంగా సరఫరా చేయాలని వాటర్ బోర్డ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
1845 నుంచి చేప ప్రసాదం పంపిణీ
చేప ప్రసాదం పంపిణీ మా పూర్వీకుల నుంచి ప్రారంభమైంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆస్తమా రోగులకు నయం చేసేందుకు 1845 నుంచి ఈ ప్రసాదాన్ని అందిస్తున్నాం. ఈ ఏడాది కూడా దాదాపు 2 లక్షలకు పైగా ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు ప్రసాదాన్ని తయారు చేస్తున్నాం.
– బత్తిని హరినాథ్‌గౌడ్