మట్టిగడ్డ కూలి ఐదుగురి దుర్మరణం
పులిచింతల ప్రాజెక్టు వద్ద ఘోర ప్రమాదం
అచ్చంపేట/ మేళ్లచెర్వు/జగ్గయ్యపేట : నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండల పరిధిలోని వజినేపల్లి వద్ద పులిచింతల ప్రాజెక్ట్‌పై జెన్‌కో నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్ట్‌లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... పులిచింతల ప్రాజెక్ట్‌లో విద్యుదుత్పాదన కోసం జెన్‌కో 120 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నది. నిర్మాణ పనుల్లో భాగంగా ప్రాజెక్ట్ చుట్టూ రక్షణగోడ నిర్మిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రాజెక్ట్‌కు ఒక పక్కగా ఉన్న మట్టికట్ట వద్ద గోడ నిర్మించేందుకు సుమారు 30 మంది కూలీలు పనిచేస్తున్నారు. భోజన సమయంలో 25 మంది కూలీలు బయటకు రాగా, కాంట్రాక్టర్ మరో ఐదుగురు కూలీలు అక్కడే పనిచేస్తున్నారు. దానిపక్కనే ఎర్త్ డ్యాం నిర్మాణానికి వినియోగించగా మిగిలిన మట్టిని పెద్ద కుప్పగా పోశారు. దానినుంచి పెద్ద మట్టిగడ్డ విరిగి వీరిపై పడింది. దీంతో వారంతా మట్టిలో కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో ఒక కూలీ సురక్షితంగా బయటపడగా, కాంట్రాక్టర్‌తో పాటు మరో నలుగురు సజీవ సమాధి అయ్యారు.
మృతుల్లో మహబూబ్‌నగర్ జిల్లా సున్నిపెంటకు చెందిన పోతన గోపాలకృష్ణ (35), మేళ్లచె ర్వు మండలం వజినేపల్లికి చెందిన బారెడ్డి గోవిందరెడ్డి (45), మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగరవేలి జిల్లా బరిల్‌బరిది గ్రామానికి చెందిన నందుకోల్(20), ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సారంగ్‌పూర్ జిల్లాకు చెందిన మహ్మద్‌ఖలీల్ (23), పశ్చిమబెంగాల్ రాష్ట్రం ప్రాన్స్‌పుర గ్రామానికి చెందిన సుబ్బురాయ్‌పాడవాయ్(35)లు ఉన్నారు. మృతదేహాలను నల్గొండ జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాజెక్టు సీఈ రమేష్‌బాబు, ఎస్‌ఈ చంద్రశేఖర్ పరిస్థితిని సమీక్షించారు. జెన్‌కో పవర్ ప్రాజెక్టు తమ పరిధిలో లేదని దీనికి సంబంధించిన తదుపరి సహాయక చర్యలను పవర్ ప్రాజెక్టు అధికారులు అందించవలసి ఉంటుందని చెప్పారు. కాగా, ప్రమాద స్థలాన్ని భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాత్రి పరిశీలించారు. మృతుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. జెన్‌కో రూ.2 లక్షలు, కార్మిక శాఖ మరో రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తక్షణమే మట్టి ఖర్చుల కింద రూ.10 వేల చొప్పున కార్మిక శాఖ అందజేయనుంది. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉమ తెలిపారు.