
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో మొదలైన మొదటి ‘మెట్రో రైలు’ నడిపిన మహిళా డ్రైవర్లు తెలంగాణ యువతులే. మహానగర ప్రజల కలల ప్రాజెక్ట్ అయిన మెట్రో రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వరకూ ప్రధాని మోదీ మెట్రో రైలులో ప్రయాణించారు. తిరిగి అదే రైలులో మియాపూర్‌కు చేరుకున్నారు. కాగా ప్రధాని ప్రయాణించిన ఈ రైలును నిజామాబాద్ జిల్లాకు చెందిన సుప్రియా సనమ్ నడిపారు.
ఈ సందర్భంగా సుప్రియ మాట్లాడుతూ ....సవాళ్ళతో కూడిన విధులను నిర్వహించేందుకు ఎంతో ఇష్టపడతానని తెలిపారు. ప్రధాని ప్రయాణించిన మెట్రో రైలును నడపే సమయంలో తాను ఎంతో ఉద్వేగానికి గురయ్యానని చెప్పారు. సుప్రియతో పాటు మరో ముగ్గురు మహిళా డ్రైవర్లు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌లో ఉన్నారు. వీరిలో వరంగల్‌కు చెందిన కె.సింధుజ, మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్ మండలం బలిజపేట వాసి వీరేశం కూతురు బి.వెన్నెల ఉన్నారు.