అయ్యో.. అయ్యయ్యో..! | Five year old girl Tortured and killed | Sakshi
Sakshi News home page

అయ్యో.. అయ్యయ్యో..!

Published Sat, Jan 31 2015 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

అయ్యో.. అయ్యయ్యో..!

అయ్యో.. అయ్యయ్యో..!

సకాలంలో స్పందించి ఉంటే సబా బతికేదే
ఖాకీల నిర్లక్ష్యానికి పరాకాష్ట
విషయం తెలిసీ చర్యలకు వెనుకంజ
అంతా అయ్యాక హెడ్‌కానిస్టేబుల్‌పై
సస్పెన్షన్ వేటు

 
‘ఐదేళ్ల బాలికపై వేడినూనె పోశారు.. వళ్లంతా వాతలు పెట్టారు. ఆ చిన్నారి చావుబతుకుల్లో ఉంది కాపాడండి బాబూ’ అని ఎవరైనా చెబితే.. మానవత్వమున్న మనిషన్న వాడు అధికారం లేకపోయినా ఆ పాపను కాపాడేందుకు తెగిస్తాడు. కానీ అన్ని అధికారాలున్న మన పోలీసులు సొంత ఖాకీపై కరుణ చూపారు. ఆ చిన్నారి దుస్థితి తెలిసీ తేలిగ్గా తీసుకున్నారు. ఈ కారణంతోనే షాహిస్తా సబ పసిప్రాయంలోనే వసివాడిపోయింది. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదన్న బాధ ఇపుడు ప్రతి హృదయాన్ని తొలుస్తోంది.
 
సంగారెడ్డి క్రైం : వేడి నూనె పడి వ ళ్లంతా కాలిపోయింది. వాతలతో దేహం చిల్లులుపడింది. అన్నం తిని ఎన్నిరోజులైందో... కనీసం అరిచే శక్తికూడా లేదు. అందుకే ఓ మూలన సొమ్మసిల్లిపడిపోయింది. అలా పడిపోయి కూడా ఎన్నిరోజులైందో తెలియదు. అందరూ స్పందించి ఆస్పత్రికి తీసుకెళ్లేలోవు ఆ చిన్నారి ఆయువు తీరిపోయింది. కొండాపూర్ మండలం మల్కాపూర్‌లోని గాంధీనగర్‌లో హెడ్‌కానిస్టేబుల్ సయ్యద్ జాకీర్ హుస్సేన్ అహ్మద్, రజియా సుల్తానా దంపతుల చేతిలో చిత్రహింసలకు గురై గురువారం మృతి చెందిన షాహిస్తా సబ(5) దుస్థితి ఇది. చిన్నారి పరిస్థితి గురించి తెలుసుకున్న స్థానికులు ఈనెల 27వ తేదీన చైల్డ్‌లైన్ నిర్వాహకులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించాల్సిన ఖాకీలు నిందితుడు హెడ్‌కానిస్టేబుల్ కావడంతో అతనిపై కరుణ చూపారు.

కనీసం బాలిక ఎలా ఉందో కూడా ఆరా తీయలేదు. బాలిక పరిస్థితి పూర్తిగా విషమించాక గురువారం రాత్రి బాలిక ఆచూకీ కనుగొన్నారు.  వైద్యం కోసం 108లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ బాలిక ఊపిరి అప్పటికే ఆగిపోయింది.

అంతా అయ్యాక స్పందించిన పోలీస్ బాస్

షాహిస్తా సబ మృతి ఘటనపై పోలీసు బాస్ స్పందించారు. బాలిక మృతికి కారణమైన దంపతులను గురువారమే అదుపులోకి తీసుకున్నారు. హెడ్‌కానిస్టేబుల్ అహ్మద్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. వీరిపై కిడ్నాప్, హత్య, జస్టిస్ జువెనైల్, బాల కార్మిక చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

బాలిక శరీరమంతా గాయాలతో ఉండటం తీవ్రంగా కలిచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులమని చెప్పుకుంటున్న హెడ్‌కానిస్టేబుల్ దంపతులకు డీఎన్‌ఎ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. బాలిక పట్ల అత్యంత కిరాతకంగా,  వ్యవహరించిన దంపతులు శిక్ష నుంచి తప్పించుకోకుండా కఠిన కేసులు నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. కేసును పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. అయితే జిల్లా పోలీసు బాస్‌గా మహిళ ఉన్నప్పటికీ ఓ బాలిక ప్రాణం మాత్రం కాపాడలేకపోయారనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.

గాంధీ ఆస్పత్రికి బాలిక మృతదేహం

పోలీసులు బాలిక సబ మృతదేహాన్ని  పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సంగారెడ్డిలో ఆధునిక పరికరాలు లేనికారణంగా మృతదేహాన్ని గాంధీకి తరలించినట్లు ఎస్పీ సుమతి తెలిపారు.

అమ్మతానికే మచ్చ

ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చిన హెడ్‌కానిస్టేబుల్ భార్య రజియా...తన కూతురు వయసున్న సబ పట్ల కఠినంగా వ్యవహరించేదని తెలుస్తోంది. చిన్న తప్పుకే వాతలు పెట్టేదని స్థానికులు చెబుతున్నారు. ఈ దురాగతం తెలిసినా హుస్సేన్ అహ్మద్ పోలీసుశాఖలో పనిచేస్తుండడంతో ఎవరూ నోరుమెదపలేకపోయినట్లు తెలుస్తోంది. దీన్ని అలుసుగా తీసుకున్న ఆ ‘అమ్మ’ చిన్నారిపై శాడిజం చూపుతూ  ఆనందపడుతుంటే.. తన బాధచెప్పుకునే అవకాశమే లేక ఆ పసిమొగ్గ వసివాడిపోయింది. వైద్య సాయంకూడా సకాలంలో అందక ఈ దుర్మార్గలోకం నుంచి వెళ్లిపోయింది.
 
పేరులో వెలుగు.. అంతా చీకటి
 
సబ...అంటే శోభిల్లడం, ప్రకాశవంతం అని అర్థం. కానీ ఖాకీ దంపతుల కర్కశానికి బలైన చిన్నారి షాహిస్తా సబ జీవితం మాత్రం మొగ్గదశలోనే చీకటిలో విసిరి వేయబడింది. బలవంతంగా చిదిమేయబడింది. లోకంపోకడ తెలియని వయస్సులోనే నరకం చూసింది. తల్లిదండ్రులెవరో తెలియదు... నా అన్న వాళ్లు లేరు.

ఎక్కడో దర్గాలో ఉన్న సబను సొంత బిడ్డలా పెంచుకుంటామని ఇంటికి తెచ్చుకున్న ఖాకీ దంపతులు చిన్నచిన్న పనులు చేయలేదన్న కారణంతో వేడినూనె పోయడం, వాతలు పెట్టడం లాంటి దుర్మార్గమైన చర్యలకు పూనుకోవడంతో ఆ పాప అల్లాడిపోయింది. వారి దాష్టికాన్ని తాళలేక అనంతలోకాలకు తరలిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement