వారికి.. ఉరి శిక్షే సరైనది
సబా తల్లిదండ్రుల ఆక్రందన
కొండాపూర్ : ‘మా కూతురును అపహరించి.. చిత్రహింసలు పెట్టి హత్య చేసిన వారికి ఉరిశిక్షే సరైనది’.. అంటూ సబా తల్లిదండ్రులు బోరున విలపించారు. స్థానిక పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు, బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ మహమూద్, రేష్మ దంపతుల మూడో కూతురే.. షాహిస్త సబా. ఈమె అసలు పేరు నౌషిన్‌బేగం.
గత ఏడాది జూలై 30న హైదరాబాద్ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాలో జరిగే ఉర్సు ఉత్సవాలకు వెళ్లారు. 31న ఉద యం 6 గంటలకు గుల్బర్గాకు చేరుకున్నారు. ఉత్సవాలను చూసేందుకు వెళ్తుండగా చిన్నారి మార్గమధ్యలో అదృశ్యమైంది. రాత్రి వరకు ఎంత వెదికినా ప్రయోజనం లేకపోవడంతో ఆగస్టు 1న గుల్బర్గాలోని ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇరవై రోజుల పాటు స్థానిక దినపత్రికల్లో వార్తలు ప్రచురితమైనా ఫలితం లేక.. విషా దం నిండిన హృదయాలతో తిరిగి వచ్చారు.
ఇటీవల పాప మృతి చెందిన విషయాన్ని పేపర్‌లో చూసిన తర్వాత కొండాపూర్ పీఎస్‌ను సంప్రదించారు. ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ పాప తల్లిదండ్రులతో కలిసి గుల్బర్గాలోని ఠాణాకు వెళ్లి దర్యాప్తు చేయగా.. మృతి చెందిన పాప వీరి కూతురేనని తేలిందని సీఐ నాగరాజు చెప్పారు.