అప్రమత్తంగా ఉండండి
- వచ్చే ఐదు నెలలూ కీలకం
- నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిస్థితి, నేరాల అదుపుపై నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి బుధవారం సాయంత్రం అధికారులతో తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. విధుల నిర్వహణలో రాజీ పడొద్దని, బాధితులకు అండగా నిలవాలని కోరారు. సిటీ పోలీసుల ముందు ఉన్న తక్షణ కర్తవ్యాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఉమ్మడి రాజధానిగా ఉండటంతో ఇక్కడి పోలీసులపై మరింత పని భారం పెరిగిందని, దీన్ని అధిగ మించేందుకు కృషి చేయాలన్నారు. వచ్చే ఐదు నెలలు చాలా కీలకమైనవని, ఒక పక్క ఇరువర్గాల పండుగలు... మరోపక్క రెండు రాష్ట్రాల రాజకీయ వేడి మొదలవుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు మొదలైతే.. రెండు రాష్ట్రాల్లోని సమస్యలపై ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు, బహిరంగ సభలు జరిగే అవకాశాలున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులకు భద్రత కల్పించడంతో పాటు వారి రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలుగుకుండా ఎప్పటికప్పుడు శాంతి భద్రతలు, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పని చేయాలన్నారు. ట్రాఫిక్‌లో వీఐపీలు, వీవీఐపీల వాహనాలు జామ్ కాకుండా జాగ్రత్త వహించాలని ట్రాఫిక్ చీఫ్ జితేందర్‌ను కోరారు.
ట్రాఫిక్ అధికారులు ఎక్కువ సమయం కార్యాలయాలకే పరిమితం కాకుండా.. బయటకు వచ్చి ట్రాఫిక్‌పై అధ్యయనం చేయాలన్నారు. కాగా, పెండింగ్ కేసుల పరిష్కారంపై సివిల్ పోలీసులు దృష్టి పెట్టాలని కోరారు. ముఖ్యంగా చైన్ స్నాచింగ్‌ల నివారణకు బస్తీలు, కాలనీల్లో పెట్రోలింగ్ పెంచాలన్నారు.
సమావేశంలో అదనపు పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, జితేందర్, సందీప్‌శాండిల్యా, జాయింట్ పోలీసు కమిషనర్లు సంజయ్‌కుమార్‌జైన్, మల్లారెడ్డి,అబ్రహం లింకన్, శివప్రసాద్, డీసీపీలు కమలాసన్‌రెడ్డి, జయలక్ష్మి, సత్యనారాయణ, త్రిపాఠీ, షానవాజ్ ఖాసిం, సుధీర్‌బాబు, శ్యాంసుదర్, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీలు కోటిరెడ్డి, లింబారెడ్డి తదితరులు పాల్గొన్నారు.