సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిలో వరద ప్రవాహం ఒక్క సారిగా తగ్గిపోయింది. శ్రీశైలం జలాశయంలోకి శుక్రవారం ఉదయం 9 గంటలకు 1,47,856 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. సాయంత్రం ఐదు గంటలకు 49,479 క్యూసెక్కులకు తగ్గిపోయింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 884.3 అడుగుల్లో 211.476 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. వరద తగ్గుముఖం పట్టడంతో క్రస్ట్ గేట్లను మూసివేశారు. కుడి, ఎడమగట్టు కేంద్రాల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 11 వేల క్యూసెక్కులు, హంద్రీ–నీవా ద్వారా 1,300 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,053 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తంగా నాగార్జునసాగర్‌కు 56,373 క్యూసెక్కులు చేరుతున్నాయి. హైదరాబాద్, నల్లగొండ జిల్లాల తాగునీటి అవసరాల కోసం 1,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 570.4 అడుగుల్లో 257.579 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. నాగార్జునసాగర్ నిండాలంటే ఇంకా 55 టీఎంసీలు అవసరం. నదీ పరీవాహక ప్రాంతంలో మళ్లీ వర్షాలు కురిస్తే నాగార్జునసాగర్‌కు ప్రవాహాలు పెరగనున్నాయి.
మున్నేరు, మూసీ, వాగుల ద్వారా వస్తున్న జలాలతో నాగార్జునసాగర్‌కు దిగువన కృష్ణా నదిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి 3,395 క్యూసెక్కులు చేరడంతో నీటి నిల్వ 16.44 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 29.33 టీఎంసీలు అవసరం. తుంగభద్ర నదిలో వరద ప్రవాహం కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 90.51 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. ఇంకో పది టీఎంసీలు చేరితే జలాశయం పూర్తిగా నిండిపోతుంది.
విద్యుదుత్పత్తి ఆపండి: కాగా శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ పరిధిలో తెలంగాణ చేస్తున్న విద్యుదుత్పత్తిని తక్షణం నిలిపివేయించాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు కృష్ణా బోర్డును కోరింది. ఈ మేరకు ప్రాజెక్టు అధికారులు బోర్డుకు శుక్రవారం లేఖ రాశారు. ఇప్పటికే బోర్డు కేటాయించిన వాటా కన్నా తెలంగాణ అధిక నీటిని వినియోగం చేసిందని, ఇన్‌ఫ్లో తగ్గిన దృష్ట్యా, విద్యుదుత్పత్తి నిలిపివేయించాలని ఏపీ అధికారులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment