సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తీవ్ర వర్షాభావ పరిస్థితులతో కరువు ఛాయలు.. ఎడాపెడా విద్యుత్ కోతలతో ఆందోళన బాట పట్టిన అన్నదాతలు.. రుణమాఫీపై స్పష్టత లేక అప్పులివ్వని బ్యాంకర్లు.. వైరల్ జ్వరాలతో మంచంపట్టిన గిరిజన గూడాలు.. ఇలా ప్రధాన సమస్యలు రాజ్యమేలుతున్న ఈ తరుణంలో బుధవారం జరుగనున్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
జెడ్పీ పాలకవర్గం కొలువుదీరాక రెండోసారి జరుగుతున్న ఈ సమావేశంలో జిల్లా వాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలున్నాయి. రూ.వేలల్లో పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు కళ్లెదుటే ఎండిపోతుండడంతో అన్నదాతలు తట్టుకోలేకపోతున్నారు. అనేక మండలాల్లో పత్తి, సోయా పంటలు రెండోసారి విత్తుకున్నారు.
అయినా.. పంటలు చేతికందే పరిస్థితులు కనిపించకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ అంశంపై జిల్లా పరిషత్‌లో ప్రధానంగా చర్చకొచ్చే అవకాశాలున్నాయి. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీల సభ్యులు డిమాండ్ చేసే అవకాశాలున్నాయి. అయితే జిల్లా పరిషత్‌లో ప్రతిపక్ష సభ్యుల సంఖ్య నామమాత్రంగా ఉండటంతో వారు ఏ మేరకు గళం వినిపిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
స్టాండింగ్ కమిటీల నియామకం
పాలకవర్గం ఏర్పడిన మూడు నెలల్లోపు జెడ్పీ స్టాండిం గ్ కమిటీలను నియామించాల్సి ఉంటుంది. ఈ కమిటీ ల నియామకం కోసం వారం రోజులుగా జెడ్పీ చైర్మన్ శోభాసత్యనారాయణగౌడ్ కసరత్తు చేస్తున్నారు. జిల్లా లోని ఎంపీ, ఎమ్మెల్యేలను సంప్రదించి ఆయా కమిటీల సభ్యులను ఎంపిక చేశారు. అయితే.. ఈ కమిటీల ని యామకాలకు నేడుజరుగనున్న సమావేశంలో ఆమోద ముద్ర పడనుంది. పనులు, ఆర్థిక, ప్రణాళిక కమిటీల్లో సభ్యులుగా నియామకం కోసం పోటీ ఎక్కువ ఉంది.
రాజ్యమేలుతున్న సమస్యలు..
జిల్లాలో విద్యుత్ కోతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. వ్యవసాయానికి కనీసం మూడు గంటలు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా కావడం లేదు. అర్ధరాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా అవుతుండటం.. ఇచ్చే రెండు మూడు గంటల్లో పలుమార్లు ట్రిప్ అవుతుండటంతో తడిసిన మడే తడిసి పంటలు ఎండిపోతున్నాయి. దీంతో తీవ్ర ఆవేదన చెందుతున్న రైతులు ఆందోళన బాటపడుతున్నారు. నిత్యం పలుచోట్ల సబ్‌స్టేషన్లను ముట్టడిస్తూనే ఉన్నారు. రోడ్డెక్కి రాస్తారోకోలు చేస్తున్నారు.
ఏకంగా నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి ఇంటి ఎదుటే రైతులు ధర్నా చేయడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ సమస్యపై సభ్యులు చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు రుణమాఫీపై స్పష్టత రాకపోవడంతో రైతుల్లో అయోమయం నెలకొంది. ఖరీఫ్ సీజను పూర్తవుతున్నా బ్యాంకర్లు కొత్త రుణం మంజూరు చేయకపోవడంతో అన్నదాతలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ప్రజలు వైరల్ జ్వరాలబారిన పడుతున్నారు.
ముఖ్యంగా ఏజె న్సీ ఏరియాలోని గోండు గూడాలు మంచం పట్టాయి. రూ.కోట్లలో నిధులు ఖర్చవుతున్నా గిరిజనులకు వైద్యం అందడం లేదు. ఈ అంశం సమావేశంలో చర్చకొచ్చే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘మన ఊరు.. మన ప్రణాళిక..’కు ఆమోదముద్ర వేసేందుకు గత నెలలో జరిగిన జెడ్పీ సమావేశం అంతా సభ్యుల ప్రసంగాలతో సాగింది. ఈ సమావేశంలోనైనా ప్రజాసమస్యలను చర్చించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం నెలకొంది.
కరువుపైనే ఫోకస్..
Published Wed, Aug 27 2014 12:02 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement