పేట్ల బురుజు ఆస్పత్రిలో బారులు తీరిన రోగులు
ఇప్పుడు కరోనా రోగులకు తప్ప...ఏ ఇతర రోగమొచ్చినా చికిత్స కష్టంగా మారింది. ఎక్కడ చూసినా కరోనా గురించేమాట్లాడుతున్నారు తప్ప.. మధుమేహం, హృద్రోగం ఉన్నవారు, గర్భిణిలు, వివిధ సర్జరీలు చేయించకున్న తర్వాత వైద్యం అందాల్సిన వారిగురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. దీంతో ఆయా రోగులు అల్లాడుతున్నారు. డాక్టర్లు దొరక్క..ఓపీ చూపించుకునే పరిస్థితి లేక అవస్థలు పడుతున్నారు. గర్భిణిలు నెలవారీ చెకింగ్‌లకూ నోచుకోక భయాందోళన చెందుతున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్ ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులను మరింత కష్టాల్లోకి నెట్టింది. పేదలకు పెద్ద దిక్కుగా నిలిచిన గాంధీ జనరల్ ఆస్పత్రిని రెండు నెలల క్రితం ప్రభుత్వం పూర్తిస్థాయి కోవిడ్ కేంద్రంగా మార్చడం, అప్పటికే ఇక్కడ చికిత్స పొందుతున్న రోగులు సహా ఆయా విభాగాలను ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ కేవలం కరోనా బాధితులకు మాత్రమే చికిత్సలు అందిస్తున్నారు. ఇప్పటికే గాంధీలో వివిధ సర్జరీలు చేయించుకుని, ఆ తర్వాత రెగ్యులర్ చెకప్‌లకు (ఫాలోఅప్ రోగులు) వచ్చే వారితో పాటు ఆ తర్వాతి సర్జరీలకు వచ్చే వారి పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది. ఇప్పటి వరకు వైద్యసేవలు అందించిన వారెక్కడున్నారో? వారిని ఎలా చేరుకోవాలో..? తెలియక అయోమయంలో పడిపోయారు. మరో వైపు జనరల్ నర్సింగ్‌హోంలు, స్పెషాలిటీ ఆస్పత్రులు కూడా ఓపీ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులకు ఇబ్బందు లు తప్పడం లేదు. అంతేకాదు గతంలో గాంధీలో వైద్య సేవలు పొందిన గర్భిణులను సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రికి తరలిస్తుండటంతో అక్కడ రోగుల రద్దీ పెరిగింది.
45 రోజుల క్రితమే ఖాళీ చేయించారు
గాంధీ జనరల్ ఆస్పత్రిలో మొత్తం 36 విభాగాలు ఉన్నాయి. కరోనా వైరస్ ప్రవేశానికి ముందు ఆస్పత్రి ఓపీకి గతంలో రోజుకు సగటున 2500 నుంచి 3000 మంది రాగా, ఇన్‌పేషంట్లుగా 1500 మంది చికిత్స పొందేవారు. అత్యవసర విభాగానికిరోజుకు సగటున 200 మంది వచ్చేవారు. ఇక్కడ చిన్నాపెద్ద కలిపి రోజుకు సగటున 200 సర్జరీలు జరిగేవి. మార్చి రెండున తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అప్పటికే అక్కడ ఉన్న స్వైన్‌ఫ్లూ నోడల్ కేం ద్రంలో కరోనా రోగులను అడ్మిట్ చేసి, చికిత్సలు ప్రారంభించారు. ఆ తర్వాత రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా గాంధీ ఆస్పత్రి ఓపీ, ఐపీలను ఖాళీ చేయించింది. ఆయా విభాగాలను ఉస్మానియాకు మార్చింది. గాంధీని పూర్తిస్థాయి కరోనా నోడల్ కేంద్రం గా మార్చేసింది. ప్రస్తుతం జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, నెప్రాలజీ, కార్డియాలజీ, యురాలజీ, గైనకాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాలు మాత్రమే గాంధీలో ఉన్నాయి. మిగిలన విభాగాలను ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి షిఫ్ట్ చేసింది. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల్లో 99 శాతం మంది పేద, మధ్య తరగతి రో గులే. వీరిలో 50 శాతానికిపైగా నిరక్షరాశ్యులే ఉంటారు. కేవలం బస్తీవాసులే కాకుండా సిటి శివారు జిల్లాల రోగులు ఉంటారు. మొదటి నుంచి రోగిని ఏ డాక్ట రైతే చూశాడో...ఆ తర్వాత కూడా అదే డాక్టర్ వద్ద చూపించుకునేందుకు రోగులతో పాటు వారి బంధువులు ఆసక్తి చూపుతుంటారు. ఇప్పటికే గాంధీలోని వా ర్డులను ఉస్మానియాకు తరలించడం, అక్కడ రెండు ఆస్పత్రులకు ఒకే ఓపీ కొనసాగుతుండటం, గాంధీలో సర్జరీ చేసిన డాక్టర్ ఉస్మానియాలో లేక పోవడం ఇ బ్బందికరంగా మారింది.
గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించడంతోనే...
ఏ డాక్టర్..ఎక్కడున్నాడో తెలుసుకోవడం పేద రోగులకు పెద్ద పరీక్షగా మారింది. గాంధీలో సర్జరీ చేసిన వైద్యుడు ప్రస్తుతం ఇక్కడ లేక పోవడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు సాధారణంగా ఒక వైద్యుడు సర్జరీ చేసిన వ్యక్తిని చూసేందుకు మరో వైద్యుడు కూడా సుముఖత వ్యక్తం చేయడు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుల్లో కొంత మందికి రెండు మూడు సర్జరీలు అవసరం అవుతుంటాయి. అయితే ఇప్పటికే గాంధీ డాక్టర్ వద్ద ఒక సర్జరీ చేయించుకున్న రోగులు ఆ తర్వాతి సర్జరీల కోసం ఎక్కడ, ఏ వైద్యుడిని ఆశ్రయించాలో తెలియని దుస్థితి. ఒక వేళ ఉస్మానియా వైద్యులతో సర్జరీ చేయించుకుందామనుకుంటే వారి వద్ద అప్పటికే భారీ క్యూ ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో ఏదైనా ప్రైవేటు ఆస్పత్రిలో చూపించుకుందామనుకుంటే.. కరోనా ఆంక్షల నేపథ్యంలో వారు కూడా చూసేందుకు వెనుకాడుతున్నారు. మధుమేహం, హైపర్‌టెన్షన్, థైరాయిడ్, హృద్రోగ, కిడ్నీ, కాలేయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. గాంధీలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను గచ్చిబౌలిలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ మెడికల్ సైన్స్(టిమ్స్)కు తరలించి, గాంధీలో యథావిధిగా ఆయా సేవలను పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు సీనియర్ వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment