అనుమతి కోసం ప్రైవేట్ స్కూళ్ల అడ్డదారులు
కనీస సదుపాయాలు లేకున్నా పర్మిషన్లు
నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్లలో హాస్టళ్ల నిర్వహణ
కళ్లు మూసుకుని అనుమతులిస్తున్న విద్యాశాఖ
ఫైలుకు రూ.30 వేలపైనే..
సాక్షి, మంచిర్యాల : ‘రాజు తలచుకుంటే దెబ్బలకు ఏం కొదవా..?’ అన్న చందంగా ఉంది జిల్లా విద్యాశాఖ తీరు. ఏం చేసినా అడిగేవారు లేరనుకున్నారో ఏమో..? నిబంధనలు తమకు తప్ప ఇంకెవరికి తెలుసనుకున్నారో ఏమో..? జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లలో కనీస వసతులు లేకున్నా కళ్లు మూసుకుని నిర్వహణ అనుమతులిచ్చేస్తున్నారు. పాఠశాలల భవనాల్లో వసతి గృహాల నిర్వహణ నిబంధనలకు విరుద్ధమని తెలిసినా.. చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అనుమతి లేకుండా కొనసాగుతున్న స్కూళ్ల విషయంలోనూ ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
యాజమాన్యాలు ధనార్జనే ధ్యేయంగా విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ముక్కుపిండి రకరకాల ఫీజులు వసూలు చేస్తుంటే.. విద్యాశాఖాధికారులు తల్లిదండ్రులెవరైనా ఫిర్యాదు చేస్తేనే చర్యలు చేపడుతామంటూ పంతం సాగిస్తున్నారు. ఒలింపియాడ్.. ఈ టెక్నో.. ఇంటర్నేషనల్.. ప్లే స్కూల్.. గ్లోబల్.. పేర్లతో స్కూళ్లు నిర్వహించొద్దని ప్రభుత్వ ఆదేశాలున్నా.. అధికారులేమో ప్రైవేట్ యాజమాన్యాలకే వత్తాసు పలుకుతున్నారు. పై లొసుగులు కాదని నిర్వహణ అనుమతి పొందాలంటే ప్రైవేట్ యాజమాన్యాలు సంబంధిత అధికారుల చేయి తడపాల్సిందే.
స్కూళ్లపై వచ్చిన ఫిర్యాదులు.. ఇవ్వాల్సిన అనుమతులను బట్టి సంబంధిత అధికారులు రేటు ఖరారు చేస్తున్నారు. చేయి తడిపితే ఫైలు కదులుతుంది.. అనుమతి కూడా వచ్చేస్తుంది. మౌలిక వసతుల కొరతను బట్టి ఆ పాఠశాల నిర్వాహకుడు రూ.20 వేల నుంచి రూ.70 వేల వరకు చెల్లించాల్సిందే. లేకుంటే ఆ అనుమతి రాదు. మం చిర్యాలలో పలు ప్రైవేట్ పాఠశాలల్లో మౌలిక వసతులు.. పాటించాల్సిన నిబంధనలను ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. ఇవే సమస్యలు జిల్లా వ్యాప్తంగా ఉన్నాఅధికారులు ప్రైవేట్ పాఠశాలలపై అమిత ప్రేమ చూపుతున్నారని టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె.స్వామిరెడ్డి విమర్శించారు.
అనుమతి లేకుండానే..
జిల్లాలో 800కు పైగా ప్రైవేట్ పాఠశాలలుండగా.. వాటిలో 200కు పైగా పాఠశాలలు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. అనుమతి పొంది కొనసాగుతున్న పాఠశాలల్లో కనీస వసతులు కరువయ్యాయి. నిబంధనల ప్రకారం స్కూళ్లలో అన్ని సదుపాయాలు ఉన్నాయా..? లేవా...? అని నిర్ధారించిన తర్వాతే అనుమతి ఇవ్వాల్సిన విద్యాశాఖాధికారులు అవేమీ పట్టించుకోకుండా పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. జిల్లాలో సగానికి పైగా పాఠశాలలు కనీస సదుపాయాలు లేకుండానే కొనసాగుతున్నాయి. మరోపక్క.. ప్రైవేట్ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ మోజులో పడి మోసపోతున్నారు.
నిబంధనలపై నీళ్లు..!
ప్రైవేట్ పాఠశాలలు నిర్వహించాలంటే.. ఒకటి కన్నా పైఅంతస్తులుంటే గ్రిల్స్ ఏర్పాటు చేశారా..? లేదా..? అని అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలి. శానిటరీ, అగ్నిమాపక అధికారులు జారీ చేసే సర్టిఫికెట్ , పాఠశాల నిర్వహించే భవనం నాణ్యతను ధ్రువీకరించే సర్టిఫికెట్, ము న్సిపాలిటీల్లో నిర్వహిస్తే.. మున్సిపల్ అధికారుల సర్టిఫికెట్, పాఠశాల అద్దె భవనంలో నిర్వహిస్తే లీజ్‌డీడ్, సొంత భవనంలో నిర్వహిస్తే ఓనర్‌షిప్ సర్టిఫికెట్లు నిశితంగా పరిశీలించాలి.
క్రీడామైదానం, ప్రయోగశాల, లైబ్రరీ, తాగునీటి వసతి, ప్రథమ చికిత్స, కంప్యూటర్ గది, సి బ్బంది గదులు, విద్యార్థినీ విద్యార్థులకు మూత్రశాలలు, మరుగుదొడ్లు కచ్చితంగా ఉంటేనే ఆ పాఠశాలకు అనుమతి ఇవ్వాలని జీవో నెం 1 చెబుతోంది. కానీ.. జిల్లాలో వ ందలాది స్కూళ్లలో కనీసం మూత్రశాలలు కూడా లేకపోవడం విడ్డూరం. రక్షిత తాగునీటి వసతి లేక ఇంటి నుంచే నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఒకే భవనంలో తరగతుల నిర్వహణ.. హాస్టల్ కొనసాగిస్తున్నారు. అందులోనే వంట.. భోజనశాలలు నిర్వహిస్తున్నారు. ఏదైనా అగ్నిప్రమాదం జరిగినా, వంటగదిలో సిలిండర్ పేలి నా విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలవడం ఖాయం.
ప్రైవేట్ పాఠశాలల్లో ఇన్ని సమస్యలున్నా.. విద్యాశాఖాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ విషయమై డీఈవో సత్యనారాయణరెడ్డిని ఫోన్లో సంప్రదించగా ఆయన అందుబాటులో లేరు. మంచిర్యాల ఉప విద్యాశాఖాధికారి కార్యాలయ సెక్షన్ క్లర్క్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో 163 ప్రైవేట్ ఉన్నత పాఠశాలలున్నాయని.. అన్ని సదుపాయాలతో కొనసాగుతున్నాయని వివరణ ఇవ్వడం గమనార్హం.
పైసా కొట్టు.. ఫైలు పట్టు!
Published Sat, Dec 27 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM
Advertisement
Advertisement