రాజధానిలోని అన్ని జోన్లు, ప్రతి జిల్లాలో పోలీస్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్
ప్రభుత్వానికి ప్రతిపాదించనున్న రాష్ట్ర మహిళా భద్రతా కమిటీ
గుజరాత్, ముంబైలలో పర్యటించి వచ్చిన కమిటీ
నేడు డీజీపీతో సమావేశం
హైదరాబాద్: ఆపదలో ఉన్న మహిళలకు వెంటనే రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా మహిళా పోలీస్ కంట్రోల్‌రూంను ఏర్పాటు చేయాలని మహిళా భద్రతా కమిటీ రాష్ర్ట ప్రభుత్వానికి ప్రతిపాదించనుంది.అలాగే రాజధానిలోని అన్ని జోన్లతోపాటు, ప్రతి జిల్లాలో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయాలని కూడా సూచించనుంది. రాష్ర్టంలో మహిళలు, యువతులు, బాలికల భద్రత కోసం ప్రభుత్వం తీసుకువచ్చే చట్టాల కోసం తగిన సిఫారసులు చేయడానికి ఏర్పాటైన మహిళా భద్రతా కమిటీ సభ్యులు రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ సౌమ్యామిశ్రా, సీఐడీ ఐజీ చారుసిన్హా, హైదరాబాద్ నగర అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్) స్వాతి లక్రా రెండురోజుల పాటు గుజరాత్, ముంబైలలో పర్యటించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లోని వన్‌స్టాప్ క్రైం సిస్టంతోపాటు, మహిళలు ఆన్‌లైన్‌లో కంప్లయింట్ చేసే విధానాన్ని బృందం పరిశీలించింది. పోలీసు డయల్ 100 మాదిరిగా ఆపదలో ఉన్న మహిళల కోసం డయల్ 181 విధానాన్ని పరిశీలించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూం, అందులో మహిళలే పనిచేయడం, వచ్చిన కాల్‌లపై స్పందిస్తున్న తీరును పరిశీలించిన వారు ఆ విధానాన్ని రాష్ర్టంలోనూ అమలు చేయాలని ప్రతిపాదించనున్నారు. అలాగే, ముంబైలో ప్రతిజోన్‌లో ఒక ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు ద్వారా మహిళలకు అందుతున్న తక్షణ రక్షణను పరిశీలించారు.
వీటిని మహారాష్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని అక్కడి అధికారులు కమిటీ సభ్యులకు వివరించారు. గుజరాత్, ముంబైలలో మహిళల భద్రతకు పనిచేస్తున్న వ్యవస్థలు, విధివిధానాలకు సంబంధించిన పుస్తకాలను పరిశీలించిన కమిటీ ముఖ్యమైన అంశాలతో ప్రభుత్వానికి సిఫారసులు చేయనుంది. అందులో భాగంగానే పోలీస్ కంట్రోల్ రూం, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌ల ఏర్పాటు, మహిళా సిబ్బంది నియామకంపై సూచనలు చేస్తుంది. వీటికి తుదిరూపు ఇవ్వడానికి ఆదివారం డీజీపీ అనురాగ్‌శర్మ, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సునీల్ శర్మలతో మహిళా భద్రతా కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు.
మహిళల కోసం పోలీసు కంట్రోల్ రూం
Published Sun, Oct 12 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM
Advertisement
Advertisement