నగరాల్లో కార్లను నడిపే వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? ట్రాఫిక్ నిబంధనల పట్ల ఎలా స్పందిస్తున్నారు? రోడ్లపై వారెంత అప్రమత్తంగా ఉంటున్నారు? ఇతరులతో ఎంత మర్యాదగా మెలుగుతున్నారు? ఇలాంటి విషయాలపై ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్ ఫోర్డ్ ఇటీవల కార్టెసి సర్వే నిర్వహించింది. ఈ సర్వే కోసం హైదరాబాద్ సహా 10 నగరాలను ఎంచుకుంది. రహదారి భద్రతను పెంచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదించిన ఫైవ్– పిల్లర్ అప్రోచ్‌కు అనుగుణంగా దేశీయ నగరాల్లో కార్ల డ్రైవర్లను, వారి ప్రవర్తనను విశ్లేషించే ప్రయత్నం చేసిందీ సర్వే.
సాక్షి, సిటీబ్యూరో :6 మెట్రో నగరాల్లో.. కార్లు నడిపేవారు అత్యంత అప్రమత్తతతో మెలుగుతున్నవిగా హైదరాబాద్, కోల్‌కతా నగరాలు ఎంపికవ్వడం విశేషం. అదే సమయంలో ఈ విభాగంలో ముంబై, ఢిల్లీ నగరాలు మరింత మెరుగవ్వాల్సిన పరిస్థితి కనిపించింది. నాన్ మెట్రో నగరాల్లో లూథియానా, లక్నో, పుణె ముందంజలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. రోడ్లపై వాహన చోదకుల ప్రవర్తన, ఆలోచనల గురించి ఈ సర్వే వెల్లడించిన పలు విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
చదువుకున్నా.. సెన్స్ సున్నా..
ట్రాఫిక్ సేఫ్టీ, రైట్ రోడ్ బిహేవియర్‌లో విద్యావంతులు మేము సైతం అంటూ నిబంధనలు తోసి రాజంటున్నారని సర్వే తేల్చింది. విద్యావంతులైన వారిలో 51శాతం మందికి సీట్ బెల్ట్స్ వాడడం రోడ్ సేఫ్టీకి అత్యవసరమైన అంశమనేది అవగాహన లేదు. అలాగే తాము చైల్డ్ లాక్ ఉపయోగించబోమని 42శాతం మంది చెప్పారు. అదే విధంగా 27శాతం మంది తాము రాత్రి సమయంలో డైప్పర్స్ వాడమన్నారు. ఇక డ్రైవింగ్ చేసే సమయంలో ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడంలో తప్పేమీ లేదని 22 శాతం మంది అంటున్నారు.
పిల్లలే ‘దారి’ చూపుతున్నారు
సర్వేలో వెల్లడైన మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. పెళ్లి కాని వారు, సింగిల్స్‌గా నివసిస్తున్నవారి కన్నా, పెళ్లయి పిల్లలున్నవారు చాలా అప్రమత్తతతో ఉంటున్నారట. పసిపిల్లలు కలిగి ఉన్న యువ తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. అలాగే టీనేజ్ పిల్లలున్నవారు కూడా తమ పిల్లలకు రోడ్ సేఫ్టీ విషయంలో రోల్ మోడల్స్‌గా ఉండాలని కోరుకుంటూ తదనుగుణంగా మెలుగుతున్నారు.
అనుభవమే పాఠం..
ఏ విషయంలోనైనా అనుభవాన్ని మించిన పాఠం లేదు. గతంలో రోడ్డు ప్రయాణాల సమయంలో చేదు అనుభవాలు ఎదుర్కొన్నవారు, ప్రమాదాలు/ఇతర నష్టాలకు గురైన వారు ఒకింత జాగ్రత్తగా ఉంటున్నారు. అటువంటి అనుభవాలేమీ లేనివారికన్నా 8శాతం ఎక్కువ జాగ్రత్త చూపిస్తున్నారు.
కారున్న మైనరూ.. షురూ
నిర్ణీత వయసు లేకపోయినా డ్రైవ్ చేయడాన్ని తాము అంగీకరిస్తామని 33శాతం మంది చెప్పడం ఆందోళనకరం. అలాగే 18శాతం మంది మద్యం సేవించి డ్రైవ్ చేయడం ఏమంత పెద్ద తప్పుకాదని చెప్పారు. మొత్తం మీద చూసుకుంటే 18 నుంచి 34 మధ్య వయస్కులు తమకన్నా పెద్ద వయస్కులతో పోలిస్తే కాస్తంత అప్రమత్తత పెంచుకోవాల్సిన అవసరం కనిపించింది. ఇక పురుషులకన్నా మహిళలు మరింత జాగరూకతతో మెలుగుతున్నట్టు వెల్లడైంది.
పరుగే జీవన తత్వం.. కరువైన మానవత్వం..
ఉరుకుల పరుగుల జీవితం యాంత్రికంగా మార్చేస్తోందని మరోసారి రుజువైంది. రోడ్ల మీద అంధుల కోసం తాము ఆగబోమని 48శాతం మంది తేల్చి చెప్పేశారు. ప్రతి ఇద్దరిలో ఒకరు తాము రహదారి మధ్యలో సాయం కోసం అర్థించే వ్యక్తిని పట్టించుకోమన్నారు. రోడ్డు ప్రమాద బాధితులను తమ వాహనంలో ఆస్పత్రికి తరలించే ఆలోచన చేయబోమని 41శాతం మంది, వృద్ధులకు రోడ్డు దాటడంలో సాయపడబోమని 40శాతం మంది చెబుతున్నారు.
ఖాకీ.. లేకపోతే చలాకీ..
అదుపు చేసేవారు లేకపోతే చాలా మందిలో హద్దూ అదుపూ ఉండదని తేలింది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పోలీసు గానీ కనపడకపోతే సిగ్నల్స్ పట్టించుకోబోమని 22శాతం మంది అంగీకరించారు. అలాగే ఒకవేళ నిబంధనలను అతిక్రమించి పట్టుబడినా పోలీసుల్ని ‘మేనేజ్’ చేయడానికి ప్రయత్నిస్తామని 22శాతం మంది అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment