ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌పై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
‘ఈటెల'బడ్జెట్ నిధులు జిల్లాకు వచ్చేనా..!
ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌పై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నా రు. బడ్జెట్ కేటాయింపుల్లో వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం దక్కుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా అసంపూర్తిగా నిలిచిన సాగునీటి ప్రాజెక్టులు, చదువుల తల్లి కొలువైన బాసరలోని ట్రిపుల్‌ఐటీ వంటి రంగాలకు నిధుల కేటాయింపుల్లో పెద్దపీట వేయాలని కోరుతున్నారు.
జిల్లాకు ఏకైక దిక్కై న రిమ్స్ వైద్యాసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని జిల్లా వాసులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రధాన అంశాలపై కథనం..
- సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ల్లాలో మూడు భారీ నీటి పారుదల ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరున్న ప్రాణహిత-చేవెళ్ల, శ్రీపాద ఎల్లంపల్లి, గూడెం ఎత్తిపోతల పథకం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతోంది. ఇందులో ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులు దాదాపు 95 శాతం పూర్తి కాగా, గూడెం ఎత్తిపోతల పథకాల పనులు కూడా వివిధ దశల్లో ఉన్నాయి. కేసీఆర్ సర్కారు ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఆయకట్టుకు సాగునీరందే అవకాశాలున్నాయి. ఈ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు చేపట్టాలని జిల్లా వాసులు పేర్కొంటున్నారు.
మధ్యతరహా ప్రాజెక్టులు..
కొమురంభీమ్, పెద్దవాగు డైవర్షన్ పథకం, గొల్లవాగు, నీల్వాయి, ర్యాలీవాగు వంటి మధ్యతరహా ప్రాజెక్టుల పనులు కూడా నిలిచిపోయాయి. వీటి నిర్మాణం పూర్తిచేస్తే వాటి కింద ఉన్న సుమారు రెండు లక్షలకు పైగా బీడు భూములు సాగులోకి వస్తాయి. కేటాయింపుల్లో ఈ పనులకు ప్రాధాన్యమిస్తే ఆయకట్టు రైతులకు లబ్ధి చేకూరనుంది. స్వర్ణ, సాత్నాల, గడ్డెన్నవాగు, మత్తడివాగు వంటి ప్రాజెక్టుల నిర్వహణకు కూడా నిధులు కేటాయించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
పెన్‌గంగపై చిగురిస్తున్న ఆశలు..
మహరాష్ట్ర-తెలంగాణ అంతర రాష్ట్ర ప్రాజెక్టు పెన్‌గంగపై ఆయకట్టు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేసీఆర్ సర్కారు ఈ ప్రాజెక్టు నిర్మాణం దిశగా అడుగులు వేస్తుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంతి ఫడణవీస్‌తో జరిపిన చర్చల్లో పెన్‌గంగ ప్రాజెక్టు కూడా ప్రధాన అంశం. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశాలున్నాయి.
బాసర ట్రిపుల్ ఐటీకి..
గ్రామీణ ప్రాంతాల్లో విద్యనభ్యసించే నిరుపేద విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో బాసర వద్ద ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ఐటీ సమస్యలకు నిలయంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా శాశ్వత భవనాల నిర్మాణం పూర్తికావడం లేదు. అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి.
అరకొర సిబ్బందితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏటా బడ్జెట్ కేటాయింపులు కనీసం నిర్వహణకు కూడా సరిపోవడం లేదు. దీంతో ఈ ఉన్నత విద్యా సంస్థ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. విద్యార్థులు సమస్యలతో కాలం వెళ్లదీయూల్సి వస్తోంది. ఈ ఏడాది కేటాయింపులపై ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు కోటి ఆశలు పెట్టుకున్నారు.
రిమ్స్ అభివృద్ధికి..
నిరుపేదలకు ఏకైక దిక్కయిన ఆదిలాబాద్ రిమ్స్ (రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్)లో వైద్యం అందని ద్రాక్షగా మారింది. వైద్యుల, పరికరాల కొరత, పారిశుధ్య లోపం, అరకొర వసతులు వెరసి రోగుల పాలిట శాపంగా మారాయి. అత్యవసర సమయాల్లో రెఫర్ ఒక్కటే మార్గమైంది. రిమ్స్‌కు మొత్తం 155 వైద్య పోస్టులు మంజూరైతే ఇందులో కేవలం 45 మంది వైద్యులే పనిచేస్తున్నారంటే ఇక్కడ అందుతున్న వైద్యం తీరును ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందించే ట్రామకేర్ సెంటర్ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. సెంటర్ ఆక్సిజన్ ప్లాన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం దాదాపు రూ.కోటి నిధులు మంజూరైనా పనులు పూర్తి కాలేదు. స్ట్రెచర్‌లు, వీల్‌చైర్‌లు, సెలైన్ స్టాండ్లు లేకపోవడంతో రోగిని బంధువులే చేతులపై ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. ఈ రిమ్స్ అభివృద్ధి దిశగా కేటాయింపులు ఉండేలా చూడాలని జిల్లా వాసులు కోరుతున్నారు.