ఖమ్మం: ‘పత్తి బస్తానే... పాడె కట్టెనా..’ అనే శీర్షికతో మంగళవారం ‘సాక్షి’ మెయిన్‌లో వచ్చిన కథనానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పత్తికి కనీస మద్దతు ధర ఎందుకు చెల్లించడం లేదు? సీసీఐ కేంద్రాన్ని ఎందుకు నిలిపి వేశారు? ఈ వ్యవహారంలో అధికారులు, వ్యాపారుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే వివరాలతో నివేదికను అందచేయాలని మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయటంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అధికారుల్లో ఆందోళన మొదలైంది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం పత్తి అమ్మకానికి వచ్చిన రైతు గొర్రెముచ్చు వెంకటి మృతిపై ‘సాక్షి’ సవివరంగా ప్రచురించింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర మార్కెటింగ్ శాఖమంత్రి టి.హరీశ్‌రావు స్పందించారు. రైతు మరణంపై సమగ్ర నివేదికను తెప్పించాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో మార్కెటింగ్ శాఖ రాష్ట్ర కమిషనర్ అండ్ డెరైక్టర్ ఖమ్మం మార్కెట్ కమిటీకి మంగళవారం లేఖ రాశారు. మార్కెటింగ్ శాఖ వరంగల్ జేడీతో పాటు జిల్లా అధికారులు సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. పంటలను తక్కువ ధరకు కొనుగోలు చేయటంపై కూడా ప్రభుత్వం వివరణ కోరినట్లు సమాచారం.
రేపటి నుంచి సీసీఐ కేంద్రం పున:ప్రారంభం: జిన్నింగ్ మిలుల్లో నిల్వ చేసేందుకు స్థలం లేదనే సాకుతో సీసీఐ కేంద్రాలలో పత్తి కొనుగోలును నిలిపివేయటంతోనే గిట్టుబాటు ధర రాక మనస్తాపంతో రైతు మృతి చెందాడని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఉన్నతాధికారులు స్థానిక మార్కెటింగ్ అధికారులను మందలించినట్లు తెలిసింది. కాగా, గురువారం నుంచి సీసీఐ కేంద్రాన్ని ఖమ్మం మార్కెట్‌లో పున:ప్రారంభిస్తామని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి వినోద్ కుమార్ తెలిపారు.
రైతు మృతిపై వివరణ కోరిన ప్రభుత్వం
Published Wed, Feb 4 2015 4:11 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement