శ్రీపాద విగ్రహం ఎదుట శవ దహనానికి యత్నం!
- ఆత్మహత్య చేసుకున్న మాజీ సర్పంచ్ తల్లి?
- శ్రీధర్‌ను నమ్ముకొని ఆస్తులు అమ్ముకున్నాం:మాజీ సర్పంచ్
కరీంనగర్: ఓ మాజీ సర్పంచ్ కరీంనగర్ నడిబొడ్డున మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు విగ్రహం వద్ద బుధవారం రాత్రి తన తల్లి శవాన్ని దహనం చేసేందుకు యత్నించాడు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కారణంగా తాము ఆస్తులు అమ్ముకున్నామనీ, అందుకే తన తల్లి ఆత్మహత్య చేసుకుందంటూ ఈ చర్యకు పాల్పడ్డాడు. బెజ్జంకి మండలం పారువెల్లికి చెందిన మాజీ సర్పంచ్ రెడ్డవేణి వినోద్ తల్లి లచ్చవ్వ(55) బుధవారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా శవపంచనామా చేసిన అధికారులు.. కొడుకు మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లమన్నారు. దీంతో వినోద్ టాటాఏస్ వాహనంలో తల్లి మృతదేహంతోపాటు వాహనాల టైర్లు, పెట్రోల్ తీసుకుని బయల్దేరాడు.
అక్కడ బస్టాండ్‌ఎదురుగా ఉన్న మాజీ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహం వద్దకు చేరుకోగానే వాహనం ఆపాలని డ్రైవర్ అజీమ్‌ను కోరాడు. దీంతో అజీమ్ వాహనాన్ని నిలపగా అందులో ఉన్న టైర్లను శ్రీపాద విగ్రహం వద్ద వేసి వాటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. శ్రీపాద విగ్రహం గద్దెకు ఉన్న శిలాఫలకాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత వాహనంలో ఉన్న తన తల్లి శవాన్ని ఆ మంటల్లో వేసి దహనం చేయడానికి ప్రయత్నించాడు. ఇంతలోనే ట్రాఫిక్ పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. దీంతో వినోద్ ఆమె శవాన్ని అక్కడే వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని పట్టుకుని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తాను మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును నమ్ముకోవడం వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిం దని పోలీసుల విచారణలో వినోద్ తెలిపాడు. తాను అన్నివిధాలా నష్టపోవడం వల్లే తన తల్లి వేదనతో ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. అందుకే శ్రీధర్‌బాబు తండ్రి శ్రీపాదరావు విగ్రహం వద్ద తల్లి శవాన్ని దహనం చేయూలనుకున్నానని వెల్లడించాడు.