కౌసల్యమ్మ మృతదేహం
వంగూరు (కల్వకుర్తి) మహబూబ్‌నగర్ : నాలుగేళ్లుగా పంట దిగుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయిన మాజీ సర్పంచ్ మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా.. వంగూరు గ్రామ మాజీసర్పంచ్ గందం కౌసల్యమ్మ భర్త లింగయ్యతో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. బుధవారం సాయంత్రం భర్త పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయాడు.
సాయంత్రానికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఊరంతా వెతికినా ఎక్కడా అతని జాడ కనిపించలేదు. ఓ ప్రాంతంలో అతని బైక్, చెప్పులు కనిపించడంతో ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని అందరు భావించారు. ఆ క్రమంలో మానసిక వత్తిడికి గురైన భార్య కౌసల్యమ్మ భర్తను వెతికేందుకు వెళ్లి తెల్లవారుజామున పొలంలో పురుగుల మందుతాగి శవమై కనిపించింది.
అంత్యక్రియల సమయానికి వచ్చిన భర్త
కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న లింగయ్య మంగళవారం రాత్రి శ్రీశైలం వెళ్లి బుధవారం దైవదర్శనం చేసుకుని సాయంత్రానికి వంగూరుకు చేరుకున్నాడు. ఆయన ఇంటికి వచ్చి న సమయంలో చనిపోయిన భార్యకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్ని చూసిన ఆయన ఒక్కసారిగా భార్య మృతదేహంపై పడి రోదించాడు.
కుటుంబసభ్యులు కూడా కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తులంతా పోగై ఈ ఘటన గురించి చర్చించుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసినట్టు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment