‘రైస్‌ పుల్లర్స్‌’ మాయగాడు అరెస్టు  | Fraud Person Arrested In Rangareddy District | Sakshi
Sakshi News home page

‘రైస్‌ పుల్లర్స్‌’ మాయగాడు అరెస్టు 

Published Fri, Jul 5 2019 1:37 PM | Last Updated on Fri, Jul 5 2019 1:40 PM

Fraud Person Arrested In Rangareddy District - Sakshi

నిందితుడు మహ్మద్‌ ఆసిఫ్‌

సాక్షి, కొందుర్గు: ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం ఇలా ఏ రంగంలోనైనా కష్టపడి పనిచేస్తేనే తప్పా జీవనం సాగించేది కష్టంగా మారింది. కానీ సంపాదనకు ఓ రాజామార్గం ఉందని, రూ.10 లక్షల పెట్టుబడి పెడితే వారంలో కోటి రూపాయలు సంపాదించవచ్చని అమాయకులను నమ్మించి మోసం చేసి రూ.కోట్లు గడించిన ఓ మాయగాడు గురువారం జిల్లేడ్‌చౌదరిగూడ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా వీరబల్లి మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములుగౌడ్‌ తన చిన్నతనంలో కుటుంబాన్ని విడిచి కేరళ వెళ్లాడు.

మతం మార్చుకొని రెహమాన్‌ సాబ్‌గా పేరు మార్చుకొని ఎత్తి వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ జాతకరాళ్ల వ్యాపారం చేసేవాడు. అతడి కూమారుడు మహ్మద్‌ ఆసిఫ్‌ తన మామ స్వగ్రామం వరంగల్‌ వచ్చి సెంటు, అల్వా బిజినెస్‌ చేసేవాడు. అనంతర జాతకరాళ్ల వ్యాపారం చేసేవాడు. కాలక్రమేణ హైదరాబాద్‌ బహద్దూర్‌పూరాలో సూర్యప్రకాష్‌ అనే వ్యక్తితో ఆసిఫ్‌కు పరిచయం ఏర్పడింది. అతడి సలహా మేరకు పాతకాలం  లోహపుకాయిన్‌ వస్తువులకు అతీతమైన శక్తి ఉంటుందని, దీంతో అపారంగా సంపాదించవచ్చని భావించారు. ఈ లోహపు వస్తువే రైస్‌ పుల్లర్‌గా చలామణి చేస్తూ రైస్‌ పుల్లర్‌తో కోట్ల రూపాయలు సంపాదించవచ్చని ఎందరో వ్యక్తులను నమ్మించి వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ మోసం చేయడం మొదలెట్టాడు. ఇదే క్రమంలో జిల్లేడ్‌చౌదరిగూడ మండలం పద్మారం గ్రామానికి చెందిన భూపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి ఇతడి వలలోపడి ఉన్న భూమిని తాకట్టుపెట్టి లక్షలు నష్టపోయారు. 

తెలుగు రాష్ట్రాల్లో బాధితులు..  
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు, ముంబాయి, బెంగళూర్, తదితర ప్రాంతాల్లోని ఎందరో అమాయకులు ఇతడి వలలో పడి మోసపోయారు. మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు కూడా ఇతడి మాయలోపడ్డారంటే అతిశయోక్తిలేదు. ఇతడి మాయమాటలు నమ్మి మోసపోయిన వారంతా మహ్మద్‌ ఆసిఫ్‌ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేశారు. ఇతడి ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖాతాలో రూ. 60,20,73,000 జమచేయడం జరిగిందని షాద్‌నగర్‌ రూరల్‌ సీఐ రామకృష్ణ గురువారం విలేకరులకు వెల్లడించారు. 

ఐదు పోలీసుస్టేషన్లలో కేసులు.. 
నిందితుడు మహమ్మద్‌ ఆసిఫ్‌పై ఇప్పటికే జిల్లేడ్‌ చౌదరిగూడతో పాటు షాద్‌నగర్, షాబాద్, కడప, బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్లలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. పద్మారం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, కక్కులూర్‌ అనంతస్వామి, ఎల్కగూడెం భూపాల్‌రెడ్డి, షాద్‌నగర్‌ వెంకటేష్, హేమాజీపూర్‌ శంకర్, షాద్‌నగర్‌ మారుతి, నాగప్ప, జైపాల్‌రెడ్డి, మాణిక్యం, అన్వర్, జడ్చర్ల శ్రీనివాసురెడ్డి, కాటేదాన్‌ కుమారస్వామి తదితరులు ఆసిఫ్‌ను నమ్మి మోసపోయినవారే. 

ఎట్టకేలకు చిక్కిన నిందితుడు.. 
జిల్లేడ్‌చౌదరిగూడ పోలీసులు 2018 జనవరి 8న ఇతడిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఇతడి కోసం గాలింపులు చేపట్టారు. కానీ, ఫలితం దక్కలేదు. ఎట్టకేలకు గురువారం నిందితుడు పట్టుకున్నారు. పద్మారం గ్రామానికి చెందిన భూపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి వద్దకు మహ్మద్‌ ఆసిఫ్‌ వెళ్తుండగా లాల్‌పహాడ్‌ వద్ద పోలీసులకు చిక్కినట్లు సీఐ రామకృష్ణ వెల్లడించారు. నిం దితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతడు ఇంతకాలం అమాయకులను నమ్మించి మోసం చేసి సంపాదించిన డబ్బుతో లగ్జరీ జీవితం గడిపాడని, ఎలాంటి స్థిరాస్తులు లేవని, ఇతడిపై పీడీయాక్ట్‌ నమోదు చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి వారి మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement