గుక్కెడూ.. కరువే | Freshwater shortage at nine districts | Sakshi
Sakshi News home page

గుక్కెడూ.. కరువే

Published Tue, Mar 31 2015 1:07 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

గుక్కెడూ.. కరువే - Sakshi

గుక్కెడూ.. కరువే

రాష్ట్రవ్యాప్తంగా మంచినీటికి తీవ్ర కొరత
ఎండిపోయిన చెరువులు, వట్టిపోయిన బోర్లు  
 
 రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో తీవ్రమైన మంచినీటి కొరత ఏర్పడింది. బిందెడు నీళ్ల కోసం నాలుగు గంటల పాటు క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ కోతలు, విద్యుత్ సరఫరా ఉన్నా లో వోల్టేజీ సమస్య వంటివి పరిస్థితిని మరింత దుర్భరం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో 60 నుంచి 70 శాతం గ్రామీణ మంచినీటి పథకాలు మూలనపడ్డాయి. అధికారవర్గాల సమాచారం ప్రకారమే చూసినా... ఏ జిల్లాలోనూ 10 నుంచి 12 శాతం బోర్లు కూడా పనిచేయడం లేదు. నల్లగొండ జిల్లా దేవరకొండ, ఖమ్మం జిల్లా కొత్తగూడెం, వరంగల్ జిల్లా మహబూబాబాద్ డివిజన్లలో బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. ప్రభుత్వం తీవ్రంగా నీటి కొరత ఉన్న గ్రామాలను గుర్తించి.. 1,200 నుంచి 1,500 అడుగుల లోతు వరకూ బోర్లు తవ్వించినా.. చుక్క నీరు రాని ఉదంతాలు నెలకొన్నాయి. నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో చాలా చోట్ల మహిళలు కిలోమీటర్ల కొద్దీ నడిచి మంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన వస్తోంది.
 - సాక్షి, హైదరాబాద్
 
 ఏమీ పట్టని సర్కారు..
 తాగునీటి అవసరాలను తీర్చేందుకు వేసవి కార్యాచరణ ప్రణాళిక పేరిట ప్రభుత్వం అరకొర చర్యలే చేపట్టింది. తొమ్మిది జిల్లాల్లో కేవలం 742 గ్రామాల్లోనే నీటి ఎద్దడి ఉందని.. అక్కడ అవసరమైన చర్యలు చేపట్టామని పేర్కొంది. కానీ ఆ గ్రామాల పరిస్థితిలో ఎక్కడా మార్పు లేదు. చుక్క నీరు లేని 167 గ్రామాలకు ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ అరకొర నీటి సరఫరాతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువులు ఎండిపోయిన 575 గ్రామాల్లో ప్రైవేటు వనరుల (బావులు, బోర్లు) నుంచి నీటిని సేకరించి.. సరఫరా చేస్తున్నారు. కానీ ఆయా గ్రామాల్లో అవసరమైన నీటిలో పది శాతంకూడా తీరడంలేదు. అసలు కార్యాచరణ ప్రణాళిక కింద ప్రభుత్వం రూ. 263 కోట్లను కే టాయించినా... వాటిని ఇంకా ఖర్చు చేయడం లేదు. గ్రామాల్లోని బోరుబావుల లోతు పెంచడం, పూడికతీత, మరమ్మతుల కోసం రూ. 40 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. కానీ పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉన్నా అధికారులు రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు.
 
 ‘మినరల్ వాటర్’ ప్లాంట్ల ముప్పు..
ఎక్కడైనా ఓ బోరులోనో, బావిలోనో నీళ్లు ఉన్నాయంటే.. అక్కడికి మినరల్ వాటర్ ప్లాంట్ల యజమానులు ఊరుకులు పరుగులు పెడుతున్నారు. వాటి యజమానులకు డబ్బులిచ్చి.. నీటిని వాడేసుకుంటున్నారు. ఫిల్టర్ చేసిన నీటిని ఎక్కువ ధరకు గ్రామాల్లోనే అమ్ముతున్నారు. గత డిసెంబర్ నెల చివరి వరకూ 20 లీటర్ల క్యాన్ నీళ్లను రూ. 10 నుంచి రూ. 12 వరకూ విక్రయించిన వ్యాపారులు... మార్చి తొలివారం నుంచి రూ. 25కు పెంచేశారు. ప్రస్తుతం కొన్ని చోట్ల ఏకంగా క్యాన్ నీటిని రూ. 50కి పెంచేయడం ఆందోళనకరం. నల్లగొండ జిల్లా నాంపల్లి, చండూరు, మర్రిగూడెం, కొండమల్లేపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట్, కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, జడ్చర్ల, కొడంగల్, రంగారెడ్డి జిల్లా తాండూరు, పెద్దేముల్, ఇబ్రహీంపట్నం, మంచాల ప్రాంతాల్లో ప్రైవేట్ ఏజెన్సీలు ఇలా నీటితో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. ఇలాంటి వాటిని నియంత్రించడంలో స్థానిక అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. పలు చోట్ల అధికారులు ముడుపులు పుచ్చుకుని చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
 
 ట్యాంకర్లతో సరఫరా..
 ‘‘గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు చేపట్టాం. అత్యవసర పరిస్థితులు నెలకొన్న గ్రామాలకు ట్యాంకర్లతో మంచినీటిని సరఫరా చేస్తున్నాం. కొన్ని గ్రామాల్లో బోరు బావుల లోతు పెంచడం, పూడిక తీత వంటి కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. వేసవి ప్రణాళిక కింద ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఆయా జిల్లాల కలెక్టర్ల సిఫారసుల మేరకు ఖర్చు చేయాలని అధికారులను ఆదేశించాం.’’
 - సురేందర్‌రెడ్డి, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఎన్‌సీ
 
 వర్షాభావం వల్లే..
 ‘‘రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గత నాలుగేళ్లలో ఈ ఏడాదే అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో చెరువులు ఎండిపోయాయి. భూగర్భజ లాలు అడుగంటాయి. ఇటువంటి పరిస్థితులను నివారించాలంటే వాన నీటిని సంరక్షించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాల్సిన అవసరముంది. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి.’’
 - నర్సింహులు బాబు, జియాలజిస్ట్
 
 కరుణించని వరుణుడు..
 గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది (2014-15) రాష్ట్రంలో తీవ్ర వ ర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో సగటు సాధారణ వర్షపాతం 862.10 మిల్లీమీటర్లు కాగా... ఈ ఏడాది కేవలం 591.50 మిల్లీమీటర్లుగా నమోదైంది. సాధారణ వర్షపాతం కన్నా ఇది 270.60 మిల్లీమీటర్లు అంటే ఏకంగా 31 శాతం తక్కువ. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదైంది. నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో అయితే బాగా తక్కువగా వర్షపాతం నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement