పాకిస్థాన్‌నుంచి ఇందూరుకు.. | from pakistan to induru | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌నుంచి ఇందూరుకు..

Published Wed, Jul 23 2014 3:03 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

from pakistan to induru

నిజామాబాద్ క్రైం : అతి సులువుగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. అక్రమ మార్గం పట్టాడు. నకిలీ నోట్లు చలామణి చేశాడు. తల్లిదండ్రులను సైతం ఈ దందాకు వాడుకున్నాడు. కుమారుడిని మందలించాల్సిన తల్లిదండ్రులు.. అతడిని ప్రోత్సహించారు. చివరికి బండారం బట్టబయలైంది. కుటుంబం కటకటాలపాలైంది. ఈ దందాతో తొమ్మిది మందికి సంబంధం ఉండగా ఆరుగురిని అరెస్టు చేశామని నిజామాబాద్ రూరల్ సీఐ సూదిరెడ్డి దామోదర్‌రెడ్డి తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు.

వివరాలిలా ఉన్నాయి
 ఎడపల్లి మండలానికి చెందిన దువ్వ మహేశ్‌కు ఆశ ఎక్కువ. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని భావించాడు. స్నేహితులు కేసరి సత్యనారాయణగౌడ్ అలియాస్ సతీశ్, ఆకుల ప్రవీణ్‌గౌడ్‌లతో కలిసి దొంగనోట్ల వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని.. అప్పటికే ఆ వ్యాపారం చేస్తున్న బాన్సువాడలోని అంగడిబజార్‌కు చెందిన మలావత్ మోహన్‌ను కొన్నేళ్ల క్రితం కలిశారు. అతడి ద్వారా మెదక్ జిల్లా రేగోట్ గ్రామానికి చెందిన వడితె కిషన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.

కిషన్ ద్వారా నకిలీ నోట్లు చలామణి చేసే ప్రధాన సూత్రధారి మంగ్యానాయక్ అనే వ్యక్తిని కలిశారు. మంగ్యానాయక్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ద్వారా దొంగనోట్ల వ్యాపారం చేసేవాడు. ఈ నోట్లు పాకిస్థాన్‌లో ముద్రితమై బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమ బెంగాల్ చేరుకునేవి. వాటిని కోల్‌కతాలోని ఓ వ్యక్తి దేశంలోని చాలా ప్రాంతాలకు పంపించేవాడు. అక్కడినుంచే మంగ్యానాయక్‌కు చేరేవి. అతడు ఈ ప్రాంతంలో దొంగనోట్లను చలామణి చేసేవాడు. ఎవరికీ అనుమానం కలుగకుండా వివిధ మార్కెట్‌లలో తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తూ నకిలీ నోట్లను ఇచ్చేవారు.

 పట్టుబడ్డారిలా..
 ఎడపల్లి మండలానికి చెందిన రమాదేవి గత నెల 21వ తేదీన దగ్గరి బంధువు శోభరాణిని వెంటబెట్టుకుని నవీపేట్‌లో బంగారం, వెండి ఆభరణాల దుకాణాలకు వెళ్లింది. ఆభరణాలను కొనుగోలు చేసి 57 వేల బిల్లు చెల్లించింది. ఆమె ఇచ్చిన డబ్బులు తీసుకొని షాపు యజమాని నాంపల్లి ప్రవీణ్ కుమార్ జిల్లా కేంద్రంలోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో జమ చేసేందుకు వెళ్లాడు. బ్యాంకు సిబ్బంది నకిలీ నోట్లను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నవీపేటలో కలకలం చెలరేగింది.

 నిజామాబాద్ డీఎస్పీ అనిల్‌కుమార్, నిజామాబాద్ రూరల్ సీఐ దామోదర్‌రెడ్డి, నవీపేట్ ఎస్సై సంపత్‌కుమార్, ఐడీ పార్టీ ఏఎస్సై పోచయ్య, కానిస్టేబుళ్లు నరేందర్, రవీందర్‌లు విచారణ చేపట్టారు. అనుమానితులను నవీపేట పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. దీంతో వాస్తవాలు ఒక్కోక్కటిగా బయట పడడంతో పోలీసులే నివ్వెరపోయారు. ఈ కేసులో మహేశ్, గంగాధర్, రమాదేవి, కేసరి సత్యనారాయణ గౌడ్, ఆకుల ప్రవీణ్‌కుమార్, మలావత్ మోహన్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుల వద్దనుంచి రూ. 69 వేలు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగ నోట్లు చలామణి చేసే మహేశ్, అతని స్నేహితులు పట్టుబడ్డారన్న విషయం తెలియగానే మెదక్ జిల్లాకు చెందిన వడాతె మంగ్యానాయక్, రాముగౌడ్, వడాతె కిషన్‌లు పరారయ్యారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన మంగ్యానాయక్ చిక్కితే మరిన్ని అసక్తికరమైన విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 ఆందోళనలో వ్యాపారులు
 జిల్లాలో నకిలీ నోట్ల చలామణి అలజడి సృష్టించింది. పాకిస్థాన్‌లో ముద్రించిన దొంగనోట్లను జిల్లాలో చలామణి చేస్తున్నట్లు తెలియడంతో ప్రజలతోపాటు వ్యాపారులూ ఆందోళన చెందుతున్నారు. అసలు నోటుకు తీసిపోని విధంగా నకిలీ నోటు ఉండడం గమనార్హం. నిందితులు మూడేళ్లుగా నకిలీ నోట్లను మార్కెట్‌లో చలామణి చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరు ఇప్పటి వరకు నిజామాబాద్, మెదక్ జిల్లాలలో కలిపి రూ. 20 లక్షల వరకు నకిలీ నోట్లను చలామణి చేసినట్లు సమాచారం. ఏడాది క్రితం ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్‌లలో దొంగనోట్లు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
 
 చిన్న దుకాణాలే టార్గెట్
 పెద్ద షాపులలో నోట్ల కట్టలను లెక్కించేందుకు ప్రత్యేకంగా మిషన్లు ఉంటాయి. ఇవి నకిలీ నోట్లను గుర్తుపట్టగలవు. కానీ చిన్న దుకాణాలు, వారాంతపు సంతలు, వైన్స్‌లు, కల్లుదుకాణాలలో ఈ మిషన్లు ఉండవు. దీంతో నిందితులు ఆయా దుకాణాలను టార్గెట్‌గా చేసుకొని నకిలీ నోట్లను మార్చుతున్నారు. నవీపేటలో నకిలీ నోట్ల వ్యవహారం బట్టబయలు కావడంతో రూ. 500, రూ. 1000 నోట్లను తీసుకునేందుకే వ్యాపారులు జంకుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement