విద్యుత్ లైన్లను పునరుద్ధరించడమంటే.. ట్రాన్స్‌ఫార్మర్లలో ఆయిల్ లీకేజీలు గుర్తించి సరిచేయడం, ఎర్తింగ్‌ను మెరుగుపర్చడం, దెబ్బతిన్న కండెన్సర్లను గుర్తించి కొత్తవి అమర్చడం, లూజ్ కాంటాక్ట్‌లను సరి చేయడం.. కానీ డిస్కంలో కొంత మంది ఇంజినీర్లు లైన్ల పునరుద్ధరించడమంటే కేవలం విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించడమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా చిన్నపాటి ఈదురుగాలులతో కూడిన వర్షానికే విద్యుత్ ఫీడర్లు కుప్పకూలుతుండటానికి ఇదే కారణం. లైన్ల పునరుద్ధరణకు డిస్కం ఏటా రూ.100–120 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ.. సరఫరా వ్యవస్థ మాత్రం మెరుగుపడటంలేదు.
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో పరిధిలో 13 వేలకుపైగా కిలోమీటర్ల 11 కేవీ, 2500 కిలోమీటర్ల 33 కేవీ లైన్లు, 3600 కిలోమీటర్ల ఎల్‌టీ లైన్లు ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యత సెంట్రల్ బ్రేక్ డౌన్ (సీబీడీ) విభాగం చూస్తోంది. ఇందుకోసం విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) 2013–14 వార్షిక సంవత్సరానికి రూ.110 కోట్లు కేటాయించగా, 2015–16 వార్షిక సంవత్సరానికి రూ.120 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత ఏటా పది శాతం చొప్పున పెంచుతూనే ఉంది. లైన్ల పునరుద్ధ రణ పనుల్లో భాగంగా కేవలం ప్రధాన రహదారుల ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించడం మినహా దెబ్బతిన్న కండెన్సర్లు గుర్తించి తొలగించడం, ట్రాన్స్‌ఫార్మర్లలోని ఆయిల్ లీకేజీలను అరికట్టడం, లూజు కాంటాక్ట్‌లను సరిచేయడంవంటి పనులను విస్మరిస్తున్నారు. లైన్ల పునరుద్ధరణ అంటే కేవలం చెట్ల కొమ్మలు తొలగించడమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన రహదారులు మినహా వీధుల్లోని లైన్స్ కింద ఉన్న చెట్లు కొమ్మలు తొలగించకపోవడంతో గాలివానకు కొమ్మలు తీగలు ఆనుకోవడంతో షార్ట్‌సర్క్యూట్స్ తలెత్తుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయానికి కారణమవుతున్నాయి.
చేయని పనులకు బిల్లులు..
ఇటీవల కురిసిన చినుకులకు ఆస్మాన్‌ఘర్, సరూర్‌నగర్, చంపాపేట్, జూబ్లిహిల్స్, బంజా రాహిల్స్, గచ్చిబౌలి, హబ్సిగూడ, బోడుప్పల్, నాగోలు, చాంద్రాయణ గుట్ట, రాజేంద్రనగర్, వనస్థలిపురం, నల్లకుంట, రామంతాపూర్, గన్‌రాక్ డివిజన్లలో సుమారు 350 ఫీడర్లు ట్రిప్పు అయ్యాయి. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. లైన్ల కింద ఉన్న చెట్ల కొమ్మలు తొలగించకపోవడం, పాడైన కండెన్సర్లను పునరుద్ధరించక పోవడంతో షార్ట్‌సర్క్యూట్ తలెత్తి.. ఇళ్లల్లోని విలువైన గృహోపకరణాలు దగ్ధమవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో లోపాన్ని గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం డిస్కం వద్ద లేక పోవడంతో సిబ్బందే స్వయంగా లైన్ టు లైన్ తిరిగి సమస్యను గుర్తించాల్సి వస్తోంది. చెట్ల కొమ్మల నరికివేత పేరుతో ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా.. సరఫరా వ్యవస్థ మాత్రం మెరుగుపడటం లేదు. పాడైన కండెన్సర్లు, శిధిలావస్థకు చేరిన వైర్లు మార్చకున్నా.. మార్చినట్లు బిల్లు పెట్టి డిస్కం నుంచి డ్రా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు స్థానిక ఏఈలు, డీఈలు కాంట్రాక్టర్లకు సహకరిస్తుండటం విశేషం. లైన్ల పునరుద్ధరించడమంటే కేవలం చెట్ల కొమ్మలు నరకడమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
పునరుద్ధరణ పనులపై విచారణ జరిపించాలి
నగరంలో విద్యుత్ పునరుద్ధరణ పనుల పేరుతో అధికారులు గంటల తరబడి కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే చాలా చోట్ల అసలు పనులే చేయడం లేదు. కానీ లైన్లను పునరుద్ధరించినట్లు బిల్లులు పెడుతున్నారు. స్థానిక డీఈ, ఏఈలే బినామీ కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తి చేయని పనులకు బిల్లులు పెడుతున్నారు. ఈ అంశంపై రాజేంద్రనగర్ డివిజన్‌లో ఇప్పటికే విజిలెన్స్ విచారణ కూడా జరిగింది. అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లు, వారికి సహ కరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.
–నాగరాజు, విద్యుత్ కార్మిక సంఘం నాయకుడు
Comments
Please login to add a commentAdd a comment