టీఆర్‌ఎస్‌లోకి అరవిందరెడ్డి..?
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సార్వత్రిక ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి తిరిగి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కొద్ది రోజుల్లోనే ఆయన చేరిక ఉంటుందనే చ ర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆయన టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడితో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పలుమార్లు పార్టీ అధినేత కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన అరవింద్‌రెడ్డిని తిరిగి పార్టీలో చే ర్చుకునే అంశంపై ముఖ్య నాయకత్వం తర్జనభర్జన పడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అరవింద్‌రెడ్డి 2001 నుంచి టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నా రు. అప్పట్లో అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్-కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కలేదు. 2009 జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో రెండోసారీ విజయం సాధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్‌లో చేరారు.
రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆయన మంచిర్యాల స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. పలుమార్లు అధినేత కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన అరవింద్‌రెడ్డి చాలాసార్లు వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో అరవింద్‌రెడ్డి కూడా కారెక్కే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మంచిర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ అత్యధిక కౌన్సిలర్ స్థానాలు గెలుచుకుంది. కానీ.. ఈ బల్దియా చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్ నియోజకవర్గ ముఖ్య నాయకులు పావులు కదుపుతుంటే.. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న అరవింద్‌రెడ్డి పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఎన్నిక విషయంలో చొరవ చూపాల్సిన అరవింద్‌రెడ్డి పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్లు చర్చకు దారితీస్తోంది.