వెంకటస్వామి కన్నుమూత | Gaddam Venkata swamy no more | Sakshi
Sakshi News home page

వెంకటస్వామి కన్నుమూత

Published Tue, Dec 23 2014 1:32 AM | Last Updated on Tue, Aug 14 2018 3:33 PM

వెంకటస్వామి కన్నుమూత - Sakshi

వెంకటస్వామి కన్నుమూత

* ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన కాకా
* తీవ్ర అస్వస్థతతో ఐదు నెలలుగా కేర్‌లో చికిత్స
* అవయవాలు విఫలమవడంతో మృతిచెందిన కాకా
* పంజాగుట్ట శ్మశాన వాటికలో నేడు అంత్యక్రియలు
* అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం ప్రకటన
* కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిగా, ఎంపీగా వెంకటస్వామి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం


సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో కాకలు తీరిన నేతగా.. కాంగ్రెస్‌వాదుల్లో ‘కాకా’గా చెరగని ముద్ర వేసిన కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(85) ఇకలేరు. కార్మిక నేతగా ప్రస్థానం ప్రారంభించి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. సోమవారం రాత్రి 8.40 గంటలకు హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురై దాదాపు ఐదు నెలలుగా ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వారం క్రితం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూలోకి మార్చారు.

 క్రమంగా శ్వాస సరిగా తీసుకోలేకపోవడంతోపాటు మూత్రపిండాల పనితీరు మందగించింది. దీంతో ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి డయాలసిస్ చేస్తూ వచ్చారు. వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆయన కన్నుమూసే సమయంలో కుమారులు మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్‌తో పాటు కూతురు, మనుమళ్లు, మనుమరాళ్లు అక్కడే ఉన్నారు. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ప్రజా గాయకుడు గద్దర్, మాజీ ఎంపీలు రాజయ్య, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి తదితరులు కేర్ ఆసుపత్రికి చేరుకుని వెంకటస్వామి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత వెంకట స్వామి మృతదేహాన్ని సోమాజిగూడలోని వివేక్ ఇంటికి తరలించారు. ప్రజలు, కాంగ్రెస్ శ్రేణుల సందర్శనార్థం మంగళవారం ఉదయం నుంచి ఆయన భౌతిక కాయాన్ని గాంధీభవన్‌లో ఉంచుతారు.

అనంతరం ఊరేగింపుగా పంజగుట్ట శ్మశా న వాటికకు తీసుకువెళ్లి మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. మరోవైపు కాకా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వెంకటస్వామి మృతికి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆరాటపడిన వ్యక్తి వెంకటస్వామి అని సీఎం గుర్తుచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు కాకా భౌతికకాయాన్ని సందర్శించి సీఎం నివాళులు అర్పించనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement