కన్ను మూసిన కాకా
హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి
1969 తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం
ముల్కీ ఉద్యమంలోనూ కీలక పాత్ర
జిల్లా అభివృద్ధిలో విశేష కృషి
సాక్షి, మంచిర్యాల : కాంగ్రెస్ కురువృద్ధుడు.. ఏఐసీసీ శాశ్వత సభ్యుడు.. ‘కాకా’గా సుపరిచితుడైన గడ్డం వెంకటస్వామి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఎస్సీ సామాజిక వ ర్గానికి చెందిన కాకా కాంగ్రెస్ పార్టీలో కే ంద్ర, రాష్ట్ర స్థాయిల్లో కీలక రాజకీయ పదవులతోపాటు మంత్రి పదవులు చేపట్టారు. జిల్లా కీర్తిని దేశవ్యాప్తంగా చాటారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తొలిసారిగా వాదించింది వెంకటస్వామియే.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వాదాన్నీ వినిపించిన ఘనత కూడా కాకాకే దక్కింది. ముక్కు సూటిగా మాట్లాడే కాకా.. సమస్యల పరిష్కారం విషయంలో ప్రతిపక్షాలనే కాదూ స్వపక్షంలోనూ నాయకులపైనా విమర్శలు గుప్పించారు. పలుసార్లు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర మంత్రులు, ముఖ్యమంత్రులను కూడా వదలిపెట్టలేదు. పార్టీ విధానాలకు కట్టుబడి పని చేసిన కాకా పార్టీ నిర్ణయాలు.. సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను తిప్పికొట్టడంలో దిట్టగా పేరొందారు.
‘తెలంగాణ వచ్చిన తర్వాతే చస్తా..’
వెంకటస్వామి 1929 అక్టోబర్ 5న హైదరాబాద్‌లో జన్మించారు. 1969లో తొలిసారిగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత సమయం వచ్చినప్పుడల్లా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తన గళం వినిపించారు. పదేళ్ల క్రితం జరిగిన మలి ఉద్యమంలోనూ ఆయన పాల్గొనడంతోపాటు తెలంగాణ వాదాన్ని చాటారు. ఆ సమయంలో ఆరోగ్య క్షీణించగా..‘నేను ఇప్పుడే చనిపోను.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతే చనిపోతా..’ అని చెప్పిన మాటల్ని జిల్లా ప్రజలు నెమరువేసుకుంటున్నారు.
జిల్లా అభివృద్ధిలో తనవంతు..
1957 నుంచే వెంకటస్వామికి జిల్లాతో అనుబంధం ఉంది. సిర్పూర్ ద్విసభ్య నియోజకవర్గం ఉన్నప్పుడు 1957లో తొలిసారిగా ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అప్పటి పీఎస్‌పీ పార్టీకి చెందిన రామన్నపై 8821 ఓట్లతో గెలుపొందారు. అప్పటి నుంచి తూర్పు ప్రాంతాభివృద్ధిలో తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు. మంచిర్యాలలో ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం.. రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం వెంకటస్వామి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే జరిగాయి.
రూ.24 కోట్ల వ్యయంతో మంచిర్యాల పట్టణ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా పథకాన్ని కూడా కాకా హయాంలోనే ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ ఇప్పించేందుకు విశేష కృషి చేసిన కాకా చివరకు అనుకున్నది సాధించారు. 1998 నుంచి కార్మికులు పెన్షన్ పొందుతున్నారు. కార్మిక సంఘాలను స్థాపించిన ఘనత కూడా కాకాకే దక్కింది.
రాజకీయ ప్రస్ధానం..!
వెంటకస్వామి.. మూడు సార్లు సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా, పెద్దపల్లి ఎంపీగా నాలుగుసార్లు గెలిచారు. సిర్పూర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, పీవీ న రసింహారావు కేబినెట్‌లో కార్మిక, గ్రామీణాబివృద్ధి, జౌళిశాఖ మంత్రిగా పని చేశారు. 2002-04లో ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ అధ్యక్షుడిగా, 1982-84 వరకు ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. రాష్ట్రంలో అంజయ్య, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వారి కేబినెట్‌లో సేవలందించారు. గడ్డం వినోద్‌కుమార్, గడ్డం వివేకానంద కాకా తనయులు. కాగా వారు రాజకీయంగా ఎదిగేందుకు తండ్రి ఆశీస్సులు ఎంతగానో ఉన్నాయి.