
గద్వాల- మాచర్ల రైల్వేలైన్ సాధిస్తాం..!
రాయిచూర్- మాచర్ల పట్టణాల మధ్య రైలుమార్గం ఏర్పాటు 30 ఏళ్ల నాటి మాట. ఎన్నికల వేళ నాయకుల హామీగా వినిపిస్తోంది. కాగా, ఈ ప్రాజెక్టులో మొదటిదశ రాయిచూర్- గద్వాల రైల్వేలైన్ పనులు పూర్తిచేసి డెమోరైలును కూడా నడిపిస్తున్నారు. కానీ రెండోదశ గద్వాల- మాచర్ల లైన్ పనులు అంగుళ ం కూడా ముందుకు కదలడం లేదు. ఈ ప్రాంతం మీదుగా రైల్వేలైన్ ఏర్పాటుచేస్తే చౌక ప్రయాణం అందుబాటులోకి వస్తుందన్న వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట వాసుల కల ఫలించడం లేదు.
పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే నలుగురికి ఉపాధి దొరుకుతుందన్న భరోసా లేదు. తెలంగాణ రాష్ట్రంలోనైనా బహుళ ప్రయోజనాలు ఉన్న ఈ రైల్వే ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పూర్తిచేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా ఈ రైల్వే ప్రాజెక్టుపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. గద్వాల- మాచర్ల రైల్వేలైన్‌ను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
నిరంజన్‌రెడ్డి: సలామ్ వలేకుమ్ చిచ్చా.. మన ప్రాంతానికి రైల్వేలైన్ ఏర్పాటు చేయమంటావా?
అన్వర్(వనపర్తి): ముప్పైఏండ్ల సంది ఈ మాట ఇక్కడి నేతలు చెప్తనే ఉన్నరు. కానీ పనులెవరూ మొదలు పెట్టడం లేదు.
నిరంజన్‌రెడ్డి: మరి వారిని మీరు నిలదీయలేదా?
అన్వర్: మస్తుగ అడిగినం.. ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడు ఈ సారి తప్పక రైలును తెస్తామని చెప్పినొళ్లే తప్ప వారిచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మీరు ఈ పనిచేయాలి. దీన్ని సాధిస్తే ఎప్పటికీ మీమ్మల్ని ఇక్కడి ప్రజలు మర్చిపోరు.
నిరంజన్‌రెడ్డి: బాబు మీది ఏ ఊరు. మన ప్రాంతానికి రైలుమార్గం
వేయాలన్న ప్రతిపాదన ఉన్న సంగతి నీకు తెలుసా?
శంకర్(కేశంపేట తండా): సార్..! మాది కేశంపేటతండా. మేం ముంబాయి వెళ్లి కూలీనాలి చేసుకుని బతుకుతాం. రైలు మన ఊరికి వస్తదని అందరూ అంటరు గాని రైలురాలె గియిల్ రాలె.
నిరంజన్‌రెడ్డి: మీరు ముంబాయికి
ఎందులో వెళ్తారు?
శంకర్: బస్సులోనే వెళ్తాం సార్..! అదే రైలు అయితే చార్జీ తక్కువ. మా సామాన్లు అన్ని అక్కడికి తీసుకుపోవచ్చు. రైలు ప్రయాణం పిల్లలు, వృద్ధులకు అనుకూలంగా ఉంటది. బస్సులో లగేజీ ఎక్కువ ఉంటే ఎక్కించుకోవడం లేదు. మీరైనా రైలు తెప్పించండి.
నిరంజన్‌రెడ్డి: చెప్పే పెద్దాయన.. మనకు రైలు వస్తే మంచిదంటవా?
గట్టయ్య(దొడగుంటపల్లి): రైలు వస్తెమంచిదే గదా సార్.. ముపై ్ప ఎండ్లసంది వస్తది.. వస్తది అంటున్నరు. గద్వాల వరకు అక్కడోళ్లు తెచ్చుకున్నరంట! మళ్ల మనోళ్లకు ఏంమైది? నాకు సీఎం దోస్తు, పీఎం దోస్తు అని ఒకరిని మించి ఒకరు చెప్పుకుంటరు. కానీ ఈ పనికాడ మాత్రం ఏ దోస్తు వారికి గుర్తుకురాడు. అందుకే రైలు వస్తదని ఎవరు చెప్పినా నమ్మబుద్ధి కావటం లేదు.
నిరంజన్‌రెడ్డి: గద్వాల- మాచర్ల రైలు మార్గం నిర్మిస్తే మనకు ఏం లాభం కలుగుతుందని అనుకుంటున్నారు?
జమ్ములు(దొడగుంటపల్లి): రైలు వస్తే మనం కర్ణాటకకు ఇక్కడి నుంచే వెళ్లొచ్చు. అదేవిధంగా విజయవాడకు డెరైక్ట్‌గా ఇక్కడి నుంచే పోవచ్చు. చిరువ్యాపారులు, రైతులకు ఈ రైలు ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. ఇక్కడి రైతులు మేలురకం పత్తి, మిర్చి విత్తనాలు కొనాలంటే రాయిచూర్, విజయవాడ ప్రాంతాలకు వెళ్తారు. బస్సులో పోవాలంటే నాలుగు బస్సులు మారాలి. అదే రైలు ఉంటే నాలుగైదు గంటల్లో వెళ్లొచ్చు.
నిరంజన్‌రెడ్డి: సోదరా.. మీరు దీని గురించి ఏమంటారు?
భూషణ్(అలంపూర్): సార్..! బస్సు ప్రయాణం కంటే రైలు ప్రయాణం ఎంతో ఈజీ. ఆంధ్రాలో ఎక్కువగా రైలుమార్గాలు ఉన్నందున వారు
వాటిలోనే ప్రయాణిస్తారు. మనకు మాత్రం రైలు సౌకర్యం లేక ఆటోలు, జీపుల్లో వెళ్తూ.. ప్రమాదాలకు గురవుతున్నరు.
నిరంజన్‌రెడ్డి: సేటు మీరు చెప్పండి రైలు మార్గం నిర్మిస్తే వ్యాపారాభివృద్ధి ఉంటుందా?
జగదీశ్వరయ్య: తప్పక ఉంటుంది.. రాయిచూర్ మనకు ఎంతో దగ్గరగా ఉన్నా సరైనా రవాణా సదుపాయాలు లేక అక్కడికి వెళ్లలేం. అదేరైల్లో నేరుగా వెళ్లే అవకాశం ఉంటే అక్కడ చౌకగా దొరికే పప్పుధాన్యాలు ఇక్కడికి తీసుకొచ్చి తక్కువ ధరకు అమ్మొచ్చు. ఇది ఓ రకంగా వినియోదారులకు లాభమే కదా..!
నిరంజన్‌రెడ్డి: మీరు చెప్పండి గద్వాల- రాయిచూర్ రైలుమార్గం పూర్తవుతదనుకుంటున్నారా?
యోగానందరెడ్డి(వనపర్తి): తప్పక అవుతుంది సార్..! మీరు దీన్ని సీరియస్‌గా తీసుకుంటే తప్పక సాద్యమవుతుంది. ఈ ప్రాంతం వారు ముపై ్ప ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలను మీరే సాకారం చేయాలి. రవాణా సదుపాయమే కాక విద్యావ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఈ ప్రాంతం అభివృద్ధి సాధించే అవకాశం ఉంది.
నిరంజన్‌రెడ్డి: తప్పకుండా బ్రదర్ మీరు నమ్ముతున్నట్లుగానే ఈ సమస్యను తక్షణం సీఎం కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్తాను. మరో వారం, పదిరోజుల్లో ఢిల్లీకి వెళ్లనున్నాం. గద్వాల- మాచర్ల రైలుమార్గం ఫైల్‌ను తెప్పించుకుని దీనిపై ప్రధాని నరేంద్రమోడీ, రైల్వేమంత్రిని కలుస్తాం. వచ్చే బడ్జెట్‌లో తప్పకుండా దీనికి నిధులు మంజూరయ్యేలా ప్రయత్నిస్తాం. అమ్మ మీరు చెప్పండి వనపర్తి అభివృద్ధికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది?
లక్ష్మిదేవమ్మ (వనపర్తి): వనపర్తికి రైల్వేలైన్ నిర్మిస్తే చాలా బాగుంటుంది సార్..! బస్సుల్లో చార్జీలు ఏటికేడు పెరుగుతున్నయ్. అదే రైళ్లో అయితే చార్జీలు తక్కువగా ఉంటయి. బీదా, బిక్కి అంతా ఏదో రకంగా రైళ్లో అవకాశం ఉంటుంది. రైల్వేలైన్ పనులు మొదలైతే ఈ ప్రాంత కూలీలకు ఏడాది పాటు పనులు దొరుకుతాయి కదా..!
నిరంజన్‌రెడ్డి: పెద్దమ్మ మీరు చెప్పండి ?
యాదమ్మ(వనపర్తి): రాయిచూరు నుంచి గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి ప్రాంతాల గుండా రైల్వేలైన్ నిర్మిస్తే వనపర్తిని సరుకు రవాణా కేంద్రంగా అభివృద్ధి చేయాలి. వనపర్తి ప్రాంతంలో కర్మాగారాలు ఏర్పాటుచేసి చేసి ఇక్కడి జనానికి ఉపాధి అవకాశాలు పెంచాలి.
నిరంజన్‌రెడ్డి: అమ్మా.. మీరేమంటారు ?
అలివేలు(గోపాల్‌పేట): రైలు మన ఊర్లకు వస్తుంటే ఎవరు వద్దంటరు సార్. మీరే ముందుకై దీనిని సాధించాలె. ఇంతకాలం చెప్పిన వారిపై అందరికీ నమ్మకాలు పోయాయి. మన తెలంగాణ మనకు వచ్చింది. మనరైలు మనకు రావాలె.
నిరంజన్‌రెడ్డి: పెద్దాయన మీరు చెప్పండి. ఇన్నాళ్లు ఈ ప్రాజెక్టు ఎందుకు నిర్లక్ష్యానికి గురైంది.
శంకర్‌రావు (సింగిల్‌విండో చైర్మన్, రాజనగరం): గత పాలకులు దీన్ని పట్టించుకోలేదు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం.
మీరు అధికారంలోకి వచ్చారు. పెద్ద పదవిలో ఉన్నారు. వనపర్తికి రైలు తెండి. మీ వెంటే ప్రజలంతా ఉంటారు.
నిరంజన్‌రెడ్డి: తప్పకుండా గతంలో నిజాం కాలంలో అద్భుతమైన రైల్వేమార్గాలు నిర్మించారు. పలు ప్రాంతాలు, పట్టణాలను వారు అనుసంధానం చేసి అన్నిరంగాల అభివృద్ధికి తోడ్పాటును అందించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కోటా కింద గద్వాల- మాచర్ల రైలు మార్గానికి కేంద్రం నుంచి నిధులు వచ్చేలా మా ప్రయత్నాలు మొదలుపెడతాం.
నిరంజన్‌రెడ్డి హామీలు
గద్వాల- మాచర్ల రైలు మార్గానికి సంబంధించిన ఫైల్‌ను వెంటనే సీఎం
కె.చంద్రశేఖర్‌రావు ముందు ఉంచుతాం.
వచ్చే పది పదిహేను రోజుల్లో సీఎంతో పాటు ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోడీ, రైల్వేశాఖ మంత్రిని కలిసి ఆవశ్యకతను వివరిస్తాం.
వచ్చే రైల్వేబడ్జెట్‌లో నిధులు కేటాయించేలా ప్రయత్నిస్తాం.
కర్ణాటక, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వారధిగా నిర్మించనున్న ఈ రైలు మార్గం పూర్తికి మూడు ప్రభుత్వాల సహకారం తీసుకుంటాం.
ప్రస్తుతం రాయిచూర్ నుంచి గద్వాల వరకు మొదటిదశ పనులు పూర్తయిన నేపథ్యంలో
రెండోదశ పనులకు దాదాపు లైన్ క్లియర్ అయింది. రాష్ట్రం వాటా వచ్చేలా ఒత్తిడి తెస్తాం. తెలంగాణలోని అన్ని పార్టీల ఎంపీల మద్దతు కూడగడతాం.
2019 నాటికి పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తాం.