- 29కి విచారణ వాయిదా
వరంగల్: పరకాల ఉప ఎన్నికల సందర్భంగా ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు విచారణ కోసం శుక్రవారం సీఎం కేసీఆర్ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో తదుపరి విచారణ కోసం కేసును ఈ నెల 29కి వాయిదా వేశారు. పరకాల అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా 2012 మే 20న ఆత్మకూరు మండల కేంద్రం లోని స్పెక్ట్రమ్ కాన్సెప్ట్ స్కూల్ ప్రాంగణంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
టీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో హాజరైన కేసీఆర్ ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారనే అభియోగాలతో అప్పటి రిటర్నింగ్ అధికారి టి.విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసు లు కేసు నమోదు చేశారు.
భారత ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘించినందుకు నమోదైన కేసు విచారణ కోసం శుక్రవారం వాయిదాకు కేసీఆర్ హాజరు కాలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికార పనిలో ఉండడం వల్ల విచారణకు హాజరుకాలేదని కేసీఆర్ తరఫున న్యాయవాది గుడిమల్ల రవికుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కేసును ఈ నెల 29కి మొదటి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి అనిత వాయిదా వేశారు.