డాన్‌ ఆయుధాలెక్కడ? | Gangster Nayeem AK47 Where Gun | Sakshi
Sakshi News home page

డాన్‌ ఆయుధాలెక్కడ?

Published Fri, Sep 8 2017 1:01 AM | Last Updated on Tue, Jun 4 2019 6:41 PM

డాన్‌ ఆయుధాలెక్కడ? - Sakshi

డాన్‌ ఆయుధాలెక్కడ?

21 పిస్టళ్లను స్మగ్లింగ్‌ చేసిన అర్ఖాన్‌ భాయ్‌.. ఉత్తరప్రదేశ్‌ నుంచి తుపాకుల సరఫరా
పోలీసులు సీజ్‌ చేసింది ఒక్క ఏకే–47, 6 పిస్టళ్లు మాత్రమే.. మిగతా ఏకే–47లు, పిస్టళ్లు ఎక్కడ?
నయీం అనుచరుల వద్దే ఉన్న మారణాయుధాలు
ఏడాది తర్వాత బయటకు వచ్చిన సంచలన అంశాలు
రెండు గ్రూపులుగా చీలిపోయిన అనుచరులు
మళ్లీ గ్యాంగ్‌వార్‌ మొదలయ్యే అవకాశముందంటున్న నిఘా వర్గాలు  

 
(ఐరెడ్డి శ్రీనివాసరెడ్డి) జేబులో పెన్ను పెట్టుకున్నంత సులభంగా గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఏకే–47 వంటి మారణాయుధాలను వినియోగించాడు. నయీమ్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులు, ప్రధాన అనుచరులు కూడా ఏకే–47లు, పిస్టళ్లు పట్టుకుని దందాలు చేశారు. అసలు నయీం 2003 నుంచి 2015 మధ్య ఏకంగా 11 ఏకే–47లు, 21 పిస్టళ్లు కొనుగోలు చేసినట్లు కుటుంబ సభ్యులు, అనుచరుల విచారణలో వెల్లడైంది. కానీ నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత పోలీసులకు దొరికింది ఒకే ఒక ఏకే–47, ఆరు పిస్టళ్లు మాత్రమే. దీంతో మిగతా ఆయుధాలు ఏమయ్యాయనే దానిపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అసలు నయీంకు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎన్ని ఆయుధాలను కొనుగోలు చేశాడు, వాటికోసం ఎంత ఖర్చుపెట్టాడన్న అంశాలపై పోలీసులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేకపోయారు. అంతేకాదు ప్రస్తుతం నయీం అనుచరుల వద్ద ఉన్న ఆయుధాల పరిస్థితి ఏమిటి? మళ్లీ దందాలు, ముఠా కక్షలు మొదలవుతాయా అన్న ఆందోళన రేకెత్తుతోంది. ఈ నేపథ్యంలో నయీం ఆయుధాల అంశంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం..

ముఖ్యులందరి వద్దా ఏకే–47లు
నయీం దందాలు, సెటిల్‌మెంట్లు వంటివి చేసే ముందు తన భార్య హసీనా, అక్క సలీమా, తల్లి తాహేరా, అత్త సుల్తానా, బావమరిది సాదిక్‌లను ‘టార్గెట్‌’ప్రాంతానికి పంపుతాడు. వారు మూడు ఏకే–47లు, ఒక కార్బైన్, రెండు పిస్టల్స్‌తో అక్కడికి చేరుకుంటారు. తర్వాత నయీం తన ఆంతరంగికురాలు అమీనా, అనుచరులు శ్రీధర్‌గౌడ్, శ్రీధర్‌రాజు, శేషన్న, పాశం శ్రీను, రాంబాబు, గోపన్న, ఈశ్వరయ్యతో కలసి వస్తాడు. వీరందరి వద్దా ఏకే–47లు ఉంటాయి. వాటితోపాటు ప్రతీ ఒక్కరి వద్ద అదనంగా పిస్టల్‌ కూడా ఉంటుంది. ఏకే–47లను కారులో కనబడకుండా పట్టుకునే వీరు.. పిస్టళ్లను లోదుస్తుల్లో దాచుకునేవారని సమాచారం. ఇలా 2014 నుంచి 2016 ఆగస్టు వరకు దందాలు చేసేందుకు షాద్‌నగర్‌లోని ఇందిరాపార్క్‌ నివాసానికి వచ్చేవాడు. యాంజాల్‌ శివారులోని ఇంజాపూర్‌లో ఉన్న నివాసంలోనూ సెటిల్‌మెంట్లు చేశాడు.

ఉత్తరప్రదేశ్‌ నుంచి ఆయుధాలు
ఐపీఎస్‌ వ్యాస్‌ హత్య కేసులో నయీంను అరెస్టు చేసిన పోలీసులు ముషీరాబాద్‌ జైలుకు పంపించారు. అక్కడే నయీంకు ఐఎస్‌ఐ ఉగ్రవాది షాహీద్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం షాహీద్‌ ఉత్తరప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన ఆయుధాల డీలర్‌ అర్ఖాన్‌భాయ్‌ అలియాస్‌ యుజవార్‌ను నయీంకు పరిచయం చేశాడు. అలా అర్ఖాన్‌భాయ్‌ ద్వారా 2000 సంవత్సరంలో నయీంకు ఆయుధాలు అందాయి. నయీం వాటిని మావోయిస్టుల హత్యలకు, భూ దందాలకు వినియోగించుకున్నాడు. ఈ క్రమంలో 2003లో అర్ఖాన్‌కు రూ.10 లక్షలు చెల్లించి.. రెండు ఏకే–47లు, రెండు పిస్టళ్లను తెప్పించాడు. ఆ డబ్బును తన అక్క సలీమా అర్ఖాన్‌కు అందించింది. తర్వాత 2006లో రూ.15 లక్షలు ఇచ్చి మరో 2 ఏకే–47లు, నాలుగు పిస్టళ్లను గోవాలోని తన చర్చిహౌస్‌కు తెప్పించుకున్నాడు. 2008లో అర్ఖాన్‌ రూ.20 లక్షలు తీసుకుని మరో రెండు ఏకే–47లను ఇంజాపూర్‌లోని నయీం అడ్డాకు తెచ్చి ఇచ్చాడు. 2013లో శంషాబాద్‌లోని రైల్వేహౌజ్‌లో ఇంకో రెండు ఏకే–47లు, రెండు పిస్టళ్లు ఇచ్చి రూ.20 లక్షలు తీసుకెళ్లాడు. 2015లో రూ.20 లక్షలు తీసుకుని ఒక ఏకే–47, ఒక కార్బైన్, 4 పిస్టళ్లను తెచ్చి ఇచ్చాడు. ఇవన్నీ నయీం కుటుంబ సభ్యులకు తెలిసి జరిగినవి. ఇవిగాకుండా ఛత్తీస్‌గఢ్‌లో రెండు సందర్భాల్లో 2 ఏకే–47లను, నాలుగు పిస్టళ్లను, ప్రకాశంలో ఉన్నప్పుడు రెండు పిస్టళ్లను నయీం తెప్పించినట్లు అనుచరుల విచారణలో వెల్లడైంది. మొత్తంగా నయీం దాదాపు కోటిన్నర వరకు చెల్లించి.. పదకొండు ఏకే–47లు, 21 పిస్టళ్లను తెప్పించాడు.

దొరికింది మాత్రం ఒక్కటే..
గతేడాది ఆగస్టు 8న షాద్‌నగర్‌ మిలినీయం టౌన్‌షిప్‌లో ఉన్న ఇందిరాపార్క్‌ హౌజ్‌ వద్ద నయీం ఎన్‌కౌంటర్‌ జరిగింది. అనంతరం పోలీసులు అలకాపురి కాలనీ, శంషాబాద్, ఇంజాపూర్‌లలోని ఇళ్లు, తుక్కుగూడ ఫాంహౌస్‌.. ఇలా 12 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. రూ.2.5 కోట్ల నగదుతోపాటు భారీగా బంగారు ఆభరణాలు, పేలుడు పదార్థాలను సీజ్‌ చేశారు. నయీం ఎన్‌కౌంటరైన ప్రాంతంలో ఒక ఏకే–47ను.. అతడి అనుచరులు శ్రీధర్‌గౌడ్, పాశం శ్రీనుల వద్ద మూడు చొప్పున ఆరు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలకాపురి కాలనీలోని ఇంట్లో ఒక కార్బైన్, 169 రౌండ్ల బుల్లెట్లు, 10 జిలెటెన్‌ స్టిక్స్‌ దొరికాయి. అయితే నయీం వద్ద 11 ఏకే–47 తుపాకులు, 21 పిస్టళ్లు ఉన్నట్లు లెక్క. మరి పోలీసులకు దొరికింది ఒక్క ఏకే–47, 6 పిస్టళ్లు మాత్రమే. మిగతా ఆయుధాల సంగతేంటి, అసలు అవి ఎక్కడికి వెళ్లాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నయీం షాద్‌నగర్‌ డెన్‌కు వెళ్లే ముందు రోజు అతడి భార్య, అక్క, అనుచరుల వద్ద ఏకే–47లు ఉన్నాయి. కానీ సోదాల సమయంలో మాత్రం లభించలేదు. దీనిపై పోలీసులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. పోలీసులు సీజ్‌ చేసినట్లుగా పేర్కొన్న ‘ప్రాపర్టీ’లో ఆయుధాల వివరాలను పూర్తిగా చూపకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మళ్లీ గ్యాంగ్‌వార్‌..
నయీం ముఠా యాక్షన్‌ కమిటీలో కీలకంగా ఉన్న శేషన్న, ఇతర అనుచరులు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు. వారు ఇటీవల పలు రాజకీయ పార్టీల కార్యాలయాలకు కూడా వెళ్లడం సంచలనంగా మారింది. నయీంకు సంబంధించిన ఆయుధాలు వారి వద్ద ఉండి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల నయీం కుటుంబీకులు, అనుచరులుగా ఉన్న వ్యక్తుల మధ్య విభేదాలు తలెత్తాయని నిఘా వర్గాలు గుర్తించాయి. నయీం ముఠాలో రెండు గ్రూపులు ఏర్పడి ఉంటాయని. వాటి మధ్య తిరిగి గ్యాంగ్‌వార్‌ మొదలయ్యే అవకాశముందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement