మృత్యుగీతిక | Ghastly accident on NH 44 claims 9 lives | Sakshi
Sakshi News home page

మృత్యుగీతిక

Published Thu, Feb 22 2018 1:31 AM | Last Updated on Mon, Oct 8 2018 4:59 PM

Ghastly accident on NH 44 claims 9 lives  - Sakshi

బుధవారం వనపర్తి జిల్లా కనిమెట్ట ప్రధాన రహదారిపై ప్రమాదానికి గురైన కారు. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు

సాక్షి, వనపర్తి: పెళ్లిలో బంధుమిత్రులతో ఆనందంగా గడిపి తిరుగు ప్రయాణమైన ఓ కుటుంబం.. ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వెళుతున్న బంధువుల బృందం.. ఇంటికి వెళ్లాలన్న తొందర ఒకరిది.. పెళ్లి ముహూర్తం దాటిపోతుందన్న ఆత్రుత మరొకరిది.. వాహనాల వేగం పెరిగింది.. కానీ ఒక్క క్షణంలో అంతా తారుమారు.. మితిమీరిన వేగంతో అదుపు తప్పిన ఓ కారు.. డివైడర్‌పైకి ఎక్కి అవతలివైపు ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది..ఏం జరిగిందో అర్థమయ్యేలోపే ఏడుగురి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి.. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరిని, చికిత్స పొందుతూ మరొకరిని మృత్యువు కబళించింది. మరో ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరు కుటుంబాలను కన్నీటి సంద్రంలో ముంచేసిన ఈ దుర్ఘటన.. 44వ నంబర్‌ జాతీయ రహదారిపై వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద బుధవారం ఉదయం 7.45 గంటల సమయంలో జరిగింది.  

పెళ్లి ముహూర్తం దాటిపోతుందని..
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్లకు చెందిన ఆంజనేయులు (35), మదనాపురం మండలం అజ్జకొల్లుకు చెందిన పత్తోల్ల రాజు (34), అమరచింత మండలం మస్తీపూర్‌కు చెందిన కుర్వ మల్లేశ్‌ (28), మొగిలయ్య, నందిమల్ల గ్రామానికి చెందిన నరేశ్‌ (25) హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో ఉంటూ పళ్ల వ్యాపారం చేస్తుంటారు. అప్పుడప్పుడూ స్వగ్రామాలకు వచ్చి వెళ్తుంటారు. వీరి బంధువు మూలమల్ల గ్రామానికి చెందిన కుర్వ బుడ్డమ్మ కుమారుడు శ్రీకాంత్‌ వివాహం బుధవారం జరగాల్సి ఉంది. ఈ వివాహంతో పాటు చిన్నచింతకుంట మండలం నెల్లికొండిలో జరిగే అమ్మవారి పండుగకు వెళ్లాలని వారంతా నిర్ణయించుకున్నారు. వారికి బంధువైన మదనాపురం మండలం గోపన్‌పేటకు చెందిన బీరప్ప (24) కారు (మహీంద్రా వెరిటో)లో హైదరాబాద్‌ నుంచి బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో బయలుదేరారు. పెళ్లి ముహూర్తం 8 గంటలకే ఉండడంతో త్వరగా చేరుకోవాలన్న ఆత్రుతలో వేగంగా వస్తున్నారు.

పెళ్లికి హాజరై వస్తూ..
కడప జిల్లా కేంద్రానికి చెందిన సూరిబాబు (52) హైదరాబాద్‌లోని బడంగ్‌పేటలో పరుపులు, దిండ్ల వ్యాపారం చేస్తున్నారు. ఆయన భార్య సునీత, కుమా ర్తెలు మౌనిక, కల్పన ఉన్నారు. మౌనికకు వివాహం కాగా.. కల్పన ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది. ఈ నెల 20న (మంగళవారం) కర్నూలు జిల్లా కల్లూరులో సూరిబాబు మేనత్త ప్రసూన మనవడు సాయి వివాహం జరిగింది. దానికి సూరిబాబు, సునీత, కల్పనతో పాటు అనంతపురం జిల్లా పూలకుండ్ల మండలం మేకల చెరువు గ్రామానికి చెందిన అత్త రాజమ్మతో కలసి హాజరయ్యారు. తిరిగి బుధవారం ఉదయం 6 గంటల సమయంలో తమ కారు (రెనాల్ట్‌ పల్స్‌)లో హైదరాబాద్‌కు బయలుదేరారు. వారితోపాటు సూరిబాబు మేనత్త ప్రసూన ఉన్నారు.

రెప్పపాటులో ప్రమాదం..
సూరిబాబు కుటుంబం పెళ్లికి హాజరై హైదరాబాద్‌కు వెళుతుండగా.. ఆంజనేయులు, మిగతావారు మూల మల్లలో వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుంచి వస్తున్నారు. ఉదయం 7.45 గంటల సమ యంలో కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామశివారు వద్ద ఆంజనేయులు బృందం కారు (మహీంద్రా వెరిటో) అదుపుతప్పింది. అత్యంత వేగంతో డివైడర్‌ ఎక్కి.. అవతలివైపు రోడ్డులో ఎదురుగా వస్తున్న సూరిబాబు కారును బలంగా ఢీకొట్టింది. మహీంద్రా వెరిటో వాహనంలో ఉన్న ఆంజనేయులు, రాజు, మల్లేశ్, బీరప్పతోపాటు రెనాల్ట్‌ కారులో ఉన్న సూరిబాబు, ప్రసూన, రాజమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. సునీత, కల్పన, నరేశ్, మొగిలయ్యలు తీవ్రంగా గాయపడగా.. మహబూబ్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. సునీత మార్గమధ్యంలోనే మృతి చెందగా.. నరేశ్‌ చికిత్స పొందుతూ మరణించాడు. మొగిలయ్య, కల్పనల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు.

మితిమీరిన వేగంతో..
ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే.. ఘటన సమయంలో రెండు కార్లు కూడా గంటకు 100 కిలోమీటర్లకుపైగా వేగంతో దూసుకెళుతున్నట్లు తెలు స్తోంది. కార్ల టైర్లు పగిలిపోయి.. ముందు సీటు భాగం వరకు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. రెండు కార్ల డ్రైవర్లు సీటు బెల్ట్‌ పెట్టుకుని ఉండడంతో.. వారి తలకు గాయాలు కాలేదు. కానీ వాహనాలు స్టీరింగ్‌ వరకు దెబ్బతినడంతో ఛాతీ, ఇతర శరీర భాగాలపై ఒత్తిడి పడింది. సూరిబాబు నడుపుతున్న వాహనం బెలూన్లు తెరుచుకున్నా ప్రాణనష్టం తప్పలేదు.

విషాదంలో కుటుంబాలు
రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించడంతో వారి కుటుంబాలన్నీ తీవ్ర విషాదంలో కూరుకు పోయాయి. హైదరాబాద్‌ నుంచి వెళుతూ మృతి చెందిన బీరప్ప, ఆంజనేయులు, రాజు, మల్లేశ్‌.. అందరికీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మహీంద్రా వెరిటో యజమాని బీరప్పకు రెండేళ్ల క్రితమే రజితతో వివాహం జరిగింది. బీరప్ప మృతితో ఆమె కన్నీట మునిగిపోయింది. ఇక ఆంజనేయులుకు భార్య నర్సమ్మ, ఆరేళ్లలోపు వయసున్న ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. రాజుకు భార్య రేణుక, పదేళ్లలోపు వయసున్న ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మల్లేశ్‌కు భార్య పద్మ, ఏడేళ్ల కుమారుడు శివ, ఐదేళ్ల కుమార్తె పావని ఉన్నారు. ప్రమాదంలో ఈ కుటుంబాలు తమ పెద్ద దిక్కును కోల్పోవడంతో రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. ఇక రెనాల్ట్‌ కారులో హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న సూరిబాబు, ఆయన భార్య సునీత ఇద్దరు మృతి చెందారు. కుమార్తె కల్పన తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

డివైడర్‌ ఎత్తు తగ్గడంతో భారీ ప్రమాదం
జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించిన తర్వాత మధ్యలో డివైడర్‌ను తక్కువ ఎత్తుతో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వేసిన రోడ్డుపైనే మళ్లీ రోడ్డు వేస్తూ వెళ్లడంతో రోడ్డు ఎత్తు పెరిగి.. మధ్యలో డివైడర్‌ ఎత్తు తగ్గినట్లయింది. దీంతో కొద్దిగా అదుపు తప్పిన వాహనాలు కూడా.. డివైడర్‌ను ఢీకొట్టి ఆగిపోకుండా అవతలివైపునకు దూసుకెళ్లి భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జరిగిన ప్రమాదంలోనూ అవతలి వైపు కారును ఢీకొని ప్రమాద తీవ్రత, మృతుల సంఖ్య పెరగడానికి ఇదే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సాంకేతిక లోపాలతో నిత్యం ప్రమాదాలే!
హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్లే 44వ నంబర్‌ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిని నాలుగు లేన్లుగా విస్తరించకముందు ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండి.. ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరిగాయి. అయితే జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించి మధ్యలో డివైడర్‌ ఏర్పాటు చేసినప్పటి నుంచి మరో రకంగా ప్రమాదాలు పెరిగిపోయాయి. మలుపులు ఎక్కువగా ఉండడం, కల్వర్టులు, క్రాస్‌ రోడ్ల వద్ద సరిగా రోడ్డు కనిపించని పరిస్థితి వంటి సాంకేతిక లోపాలే దీనికి కారణం. ఇలాంటి కారణంతోనే వనపర్తి జిల్లా (పాత మహబూబ్‌నగర్‌ జిల్లా) కొత్తకోట మండలం పాలెం వద్ద 2013 అక్టోబర్‌ 30న భారీ ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి వస్తున్న వోల్వో బస్సు కల్వర్టును ఢీకొనడంతో డీజిల్‌ ట్యాంకుకు నిప్పంటుకుంది.

45 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. దాంతో రోడ్డు నిర్మాణ లోపాలపై సందేహాలు వెల్లువెత్తాయి. పాలెం దుర్ఘటన తర్వాత తీరిగ్గా మేల్కొన్న అధికారులు.. 44వ నంబర్‌ జాతీయ రహదారిపై పలు చోట్ల మరమ్మతులు చేశారు. కల్వర్టులను సరిచేసి, రోడ్డు క్రాసింగ్‌లను విస్తరించారు. కానీ వేసిన రోడ్డుపైనే మళ్లీ తారుతో రోడ్డు వేయడంతో.. మధ్యలో ఉన్న డివైడర్‌ ఎత్తు తగ్గిపోయింది. దీంతో వాహనాలు డివైడర్‌ ఎక్కుతున్నాయి. కొన్నిసార్లు అవతలివైపునకు దూసుకెళ్లి.. ఆ లైన్‌లో ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొంటున్నాయి. ఇలా ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు.. నివారణపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

                            ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారును తొలగిస్తున్న సహాయక సిబ్బంది

                                                సూరిబాబు,  ఆంజనేయులు, రాజు


                                                 బీరప్ప, మల్లేశ్, నరేశ్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement