సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక.. ‘విశ్వనగర విజన్’ సాకారం చేసేందుకు శ్రమిస్తున్నామని బల్దియా బాస్ దానకిశోర్ అన్నారు. గ్రేటర్ వాసులకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేస్తామన్నారు. అందుకోసం కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నుంచి మరో 20 టీఎంసీల నీటిని తరలించనున్నట్టు తెలిపారు. మహానగర వ్యాప్తంగా ట్రాఫిక్ అవస్థలు లేని బహుళ వరుసల రహదారులు తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు.. ఉప్పొంగే మురుగు సమస్యల నివారణకు సీవరేజీ మాస్టర్‌ప్లాన్ అమలు, మూడుకోట్ల మొక్కలు నాటి నగరాన్ని ‘గ్రీన్ సిటీ’గా తీర్చిదిద్దడం తమ ప్రాధాన్య అంశాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం మేరకు గ్రేటర్ పరిధిలో బల్దియా, జలమండలి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో చేపట్టనున్న నూతన ప్రాజెక్టులు, పథకాల వివరాలను శుక్రవారం ఆయన ‘సాక్షి’ దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సమగ్రంగా వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
మహానగరం దాహార్తిని మరో వందేళ్ల వరకు దూరం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కేశవాపూర్‌లో 10 టీఎంసీల గోదావరి జలాలు, నగర శివార్లలోని దేవులమ్మ నాగారం వద్ద మరో 10 టీఎంసీల కృష్ణాజలాల నిల్వకు సరికొత్త ప్రాజెక్టులకు చేపడుతున్నాం. ముందుగా రూ.4700 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న కేశవాపూర్ తాగునీటి పథకం పనులు ప్రారంభించి రెండేళ్లలోగా పూర్తిచేస్తాం. నగరం నలుమూలలకు గోదావరి, కృష్ణా జలాల సరఫరాకు వీలుగా రూ.4 వేల కోట్ల వ్యయంతో ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ జలహారం(వాటర్‌గ్రిడ్) ఏర్పాటు చేయనున్నాం. పాతనగరంలో నూతన రిజర్వాయర్ల నిర్మాణం, తాగునీటి సరఫరా వ్యవస్థ విస్తరణకు రూ.500 కోట్లు వెచ్చించనున్నాం. ప్రధాన నగరంలో పురాతన పైపులైన్ల స్థానంలో నూతన పైపులైన్ల ఏర్పాటు, రోజూ నీటి సరఫరా, లీకేజీల నివారణకు మరో వెయ్యి కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశాం. ఓఆర్‌ఆర్‌కు ఆనుకొని ఉన్న గేటెడ్ కమ్యూనిటీల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు మరో రూ.500 కోట్లు వెచ్చిస్తాం. భూగర్భ జలాలను విచక్షణా రహితంగా తోడేస్తున్న ప్రైవేట్ ట్యాంకర్లను నియంత్రించేందుకు జలమండలి ఫిల్లింగ్ కేంద్రాల ద్వారా వాటికి నీటిని సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. పేదలకు ఉచితంగా సరఫరా చేసే మంచినీటి ట్యాంకర్లు పక్కదారి పట్టకుండా వాటికి జీపీఆర్‌ఎస్ వ్యవస్థను అమర్చి పర్యవేక్షిస్తాం.
మురుగు నివారణకు సీవరేజీ మాస్టర్‌ప్లాన్
గ్రేటర్ చాలాచోట్ల మురుగు పొంగి పొర్లుతుంది. ఇకపై ఆ సమస్యలు లేకుండా సమగ్ర సీవరేజీ మాస్టర్‌ప్లాన్ అమలు చేయనున్నాం. ఇందులో రూ.5 వేల కోట్ల వ్యయంతో నగరం నలుమూలల్లో 50 మురుగుశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. వాటి ద్వారా మరో 1500 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసే అవకాశం ఉంది. సిటీలో ప్రధాన నాలాలు, మూసీ, ఇతర చెరువుల్లో మురుగు నీరు చేరకుండా వీటిని నిర్మిస్తాం. వీటిలో మురుగు నీటిని మూడు దశల్లో సమూలంగా శుద్ధిచేసి భవన నిర్మాణాలు, గార్డెనింగ్, ఫ్లోర్ క్లీనింగ్ వంటి అవసరాలకు వినియోగించుకోవచ్చు. మరో నెలరోజుల్లో దీనికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌ను షా కన్సల్టెన్సీ సిద్ధం చేయనుంది. మరో రూ.10 వేల కోట్లతో ప్రధాన నగరంతో పాటు శివార్లలో మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించిన పైపులైన్లు ఏర్పాటు చేస్తాం. మురుగు నీటి శుద్ధి, పునర్వినియోగంపై యాస్కీ సంస్థ విధానపత్రాన్ని సిద్ధం చేస్తోంది. ఇప్పటికే దేశంలో ఏ నగరంలోనూ లేనివిధంగా ఎస్టీపీల్లో ఫేకల్ స్లడ్జ్ ఆనవాళ్లు లేకుండా శుద్ధిచేస్తున్న చేస్తున్న సిటీగా గుర్తింపు సాధించాం.
గ్రేటర్ ఇక గ్రీన్ సిటీ..
గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సూచనల మేరకు నూతనంగా భవనాలు నిర్మించుకునేవారు గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్‌లో కొంత మొత్తాన్ని ఇంటిపై సౌరఫలకాల ఏర్పాటు ద్వారా సొంతంగా ఉత్పత్తి చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. జలమండలిలో ప్రస్తుతం 30 మెగావాట్లు, రాబోయే రోజుల్లో మరో వంద మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించాం. ప్రస్తుతం చెత్త నుంచి 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి వీలుగా ప్రాజెక్టు సిద్ధమవుతోంది. వచ్చే నాలుగేళ్లలో మరో 98 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధనే లక్ష్యం నిర్దేశించాం. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి, సౌరవిద్యుత్ ఉత్పత్తి, ప్రతీ ఇంటికి మొక్కల పంపిణీతో పాటు హరితహారంలో మూడుకోట్ల మొక్కల పెంపకమే లక్ష్యం. తద్వారా గ్రేటర్ నగరాన్ని హరితనగరంగా మారుతుంది.
మురికివాడలకు మౌలిక వసతులు
నగరంలోని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం ప్రాజెక్టును వేగవంతం చేశాం. మురికివాడల్లో మౌలిక వసతుల కల్పన, ఇంటింటికీ నల్లాల ఏర్పాటు, సోలార్ పవర్‌తో వీధిదీపాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మరింత మెరుగైన ర్యాంకును సాధించేందుకు ప్రయత్నిస్తాం.
ఎస్‌ఆర్‌డీపీతో బహుళ వరుసల దారులు
ఎస్‌ఆర్‌డీపీ పథకంలో భాగంగా రూ.22,500 కోట్లతో చేపట్టనున్న పనులను త్వరలో పూర్తిచేయనున్నాం. నగరంలో ఇప్పటికే పలు చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. మిగతా పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ఇప్పటికే చేపట్టిన పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయి. జంక్షన్ల అభివృద్ధితో డల్లాస్ తరహాలో తీరైన రహదారులను తీర్చిదిద్దుతాం.
సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ
జీహెచ్‌ఎంసీలో సుమారు 38 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిందరికీ దశలవారీగా ప్రజలకు మరింత సేవలందించేందుకు, సామర్థ్యం, నైపుణ్యం పెంచేందుకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇస్తాం.
అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు
చారిత్రక భాగ్యనగరంలో చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదను కాపాడుతూనే ఇస్తాంబుల్ తరహాలో పాతనగరాన్ని.. డల్లాస్ తరహాలో ప్రధాన నగరాన్ని తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రణాళికలు రూపొందించాం. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, జైకా, హడ్కో, ఎస్‌బీఐ తదితర బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణ సదుపాయం పొందేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇండియా క్రెడిట్, సెబీలు ఇప్పటికే జీహెచ్‌ఎంసీకి ‘ఏఏ’ క్రెడిట్ రేటింగ్ ఇచ్చాయి. ఈ రేటింగ్‌తో ఆయా ఆర్థికసంస్థల నుంచి ఒకేసారి ఏకమొత్తంగా సుమారు రూ.10 వేల కోట్ల రుణం పొందే అవకాశం ఉంది. నిధుల వెల్లువతో గ్రేటర్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడం ద్వారా సీఎం కేసీఆర్ కలలను సాకారం చేస్తాం. ఇన్నాళ్లు సిటీజన్లకు ఉన్న అన్ని రకాలా అవస్థలను దూరం చేస్తాం.
ఇక ట్రాఫిక్ అవస్థలకు చరమగీతం
లీ అసోసియేట్స్ అందజేసిన మాస్టర్‌ప్లాన్ ప్రకారం నగరంలో అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ, జంక్షన్ల విస్తరణ, ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా తీర్చిదిద్దే ఏర్పాట్లు రెడీ చేశాం. తక్షణం రూ.200 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నాం.
జలాశయాలకు మహర్దశ
గ్రేటర్ పరిధిలోని 185 చెరువులను తక్షణం ప్రక్షాళన చేయడంతో పాటు వాటిని సుందరీకరిస్తాం. ఇప్పటికే 18 చెరువుల ప్రక్షాళన పనులు మొదలయ్యాయి. జలాశయాలను కాపాడేందుకు లేక్ పోలీసులను ఏర్పాటు చేశాం. వాటిని కలుషితం చేస్తున్నవారిపై నిఘా పెట్టేందుకు సీసీటీవీలు సైతం ఏర్పాటు చేస్తాం.
భవన నిర్మాణ అనుమతులు సరళతరం
గ్రేటర్‌లో భవన నిర్మాణాల అనుమతులను మరింత సరళతరం చేయనున్నాం. ఇందుకోసం ‘డీపీఎంఎస్’ విధానంలో సరికొత్త సంస్కరణలు ప్రవేశపెడతాం. హరిత భవనాల నిర్మాణాలపై సిటీజన్లకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నెలలో ఒకరోజు ప్రత్యేకంగా అవగాహన తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 500 చదరపు అడుగుల విస్తీర్ణానికి లోబడి ఇళ్లు నిర్మించుకునేవారి సౌకర్యార్థం జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో ఎలాంటి వాస్తు ఫిర్యాదులు లేకుండా సుమారు మూడువేల ఇళ్ల నిర్మాణాల ప్లాన్‌లు అందరికీ అందుబాటులో పెట్టనున్నాం. ఇంటి నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకునేవారికి తమ దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే అవకాశం కల్పిస్తాం. బల్దియా అందించే ప్రతీసేవను నిర్ణీత గడువులోగా పొందేందుకు వీలుగా సిటిజన్ చార్టర్‌ను పక్కాగా అమలుచేస్తాం. డిప్యూటీ కమిషనర్ స్థాయిలో వివిధ రకాల సమస్యల పరిష్కారానికి డాష్‌బోర్డ్‌లను ఏర్పాటు చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment