సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీ కమిషనర్ వినియోగించే వాహనం పరిమితికి మించిన వేగంతో ప్రయాణించడంతో ట్రాఫిక్ పోలీసులు రూ.6,210 జరిమానా విధించారు. బోనాలకు వస్తున్న భక్తులకు స్వాగతం పలుకుతూ గోల్కొండ ప్రాంతంలోని ప్రభుత్వ గోడలపై పోస్టర్లు అంటించిన పోలీసులకు ‘గ్రేటర్’ రూ.10 వేల ఫైన్ వేసింది. సరిగ్గా వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండూ వ్యవహారాలు దెబ్బకు దెబ్బ అన్నట్లు ఉన్నాయని కొందరు పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. జరిమానా విధించడంలో జీహెచ్‌ఎంసీ వ్యవహారశైలి కూడా ‘నిబంధనల్ని ఉల్లంఘిచినట్లే’ ఉందని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ వినియోగించే వాహనం సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ట్రాఫిక్ నిఘా కెమెరాలకు చిక్కింది. దీంతో గత ఏడాది ఆగస్టు 8 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 30 మధ్య ఆరు ఈ–చలాన్లు జారీ అయ్యాయి.
దీనికి సంబంధించిన జరిమానా మొత్తం రూ.6,210 పెండింగ్‌లో ఉన్నట్లు గత గురువారం మొహిత్ పటేల్ అనే నెటిజనుడు ట్వీట్ చేశాడు. ఇది సోషల్‌మీడియాతో పాటు మీడియాలోనూ హల్‌చల్ చేయడంతో జీహెచ్‌ఎంసీ స్పందించింది. కమిషనర్ దాన కిషోర్ వినియోగించే కారుపై (టీఎస్ 09 ఎఫ్‌ఏ 4248) ఉన్న ఆరు చలాన్లకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించింది.ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూ వాహనాన్ని నడిపిన డ్రైవర్లను కమిషనర్ దానకిషోర్ తీవ్రంగా మందలించారనీ ప్రకటించింది. ఇది జరిగిన వారం రోజులకు జీహెచ్‌ఎంసీ అధికారులు తమ ‘కక్ష’ తీర్చుకున్నారు. తమకు రూ.6210 జరిమానా విధించిన పోలీసులకు రూ.10 వేల ఫైన్ వేశారు. గోల్కొండ బోనాల నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేసిన పోలీసు విభాగం ఆ భక్తులకు స్వాగతం పలకాలని భావించింది. దీనికోసం రాష్ట్ర డీజీపీ నుంచి స్థానిక గోల్కొండ అదనపు ఇన్‌స్పెక్టర్ వరకు ఆరుగురి ఫొటోలతో పోస్టర్లను ముద్రించారు.
గోల్కొండ పోలీసుస్టేషన్ పేరుతో ముద్రించిన వీటి ద్వారా బోనాలకు వస్తున్న భక్తులకు స్వాగతం పలుకుతూ అనేకచోట్ల అతికించారు. వీటిని చూసిన జీహెచ్‌ఎంసీ అధికారులు..సదరు పోస్టర్లు తమ అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటయ్యాయంటూ గురువారం రూ.10 వేల చలాన్ జారీ చేశారు. ప్రభుత్వ విభాగమైన పోలీసు శాఖ ఇలాంటి అతిక్రమణలకు పాల్పడకూడదని జీహెచ్‌ఎంసీ అధికారులు అంటుండగా... ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పోస్టర్లు ఏర్పాటు చేశామని, సదరు పోస్టర్ అంటించిన గోడ జీహెచ్‌ఎంసీకి చెందిన కాదని పేర్కొంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులో, వాణిజ్య అవసరాల కోసమే ఇలా చేస్తే జరిమానా విధించాలి తప్ప ప్రభుత్వం విభాగం, ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేకుండా అంటిస్తే ఎలా విధిస్తారని ప్రశ్నిస్తున్నారు. సదరు గోడపై పోస్టర్ అతికించి పోలీసు విభాగం తప్పు చేస్తే... దానిపై తీసుకున్న చర్య ద్వారా జీహెచ్‌ఎంసీ కూడా తప్పు చేసిందని అధికారులు అంటున్నారు.
ఆ పోస్టర్లు గోల్కొండ పోలీసులు ముద్రించినట్లు వాటిని చూస్తేనే అర్థం అవుతోంది. జీహెచ్‌ఎంసీ చెబుతున్నట్లు అవి నిబంధనలకు విరుద్ధమైతే నేరుగా ఠాణాకు వెళ్ళి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయిన ఇన్‌స్పెక్టర్‌కు చలాన్ అందించవచ్చని, అయితే అలా చేయని జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ పోస్టర్ పక్కనే చలాన్ అతికించారని చెబుతున్నారు. పోలీసులు పోస్టర్ అతికించడం తప్పయితే... చలాన్ అతికించడం ఒప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ విభాగంలో ఈ–చలాన్‌ల జారీ మొత్తం సాంకేతికంగా వాహనం నెంబర్ ఆధారంగా జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా సదరు వాహనం ఎవరిది అనేది ట్రాఫిక్ పోలీసులకు తెలిసే అవకాశం లేదు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ వాడుతున్న వాహనంపై ఈ–చలాన్‌లు ఉన్న విషయం ఓ నెటిజనుడు ట్వీట్ చేయడంతో బయటకు వచ్చిందని, దీనికి సంబంధించి పోలీసులపై జీహెచ్‌ఎంసీ ‘కక్ష’ కట్టడం సాధ్యం కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment