సాక్షి, సిటీబ్యూరో : నగర ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఆయా సేవల్ని సరళీకరిస్తున్న జీహెచ్‌ఎంసీ..అదే తరుణంలో నిబంధనలు ఉల్లంఘించేవారు, అక్రమాలకు పాల్పడేవారిపై కఠినచర్యలు తీసుకోనుంది. ఇలా ఓవైపు సరికొత్త సంస్కరణల అమలు..మరోవైపు ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపనుంది. మునిసిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల కనుగుణంగా ఇప్పటికే భవన నిర్మాణ అనుమతుల జారీని 21 రోజులకు తగ్గించిన జీహెచ్‌ఎంసీ.. దీన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఏ అధికారి వద్దనైనా ఫైలు నిర్ణీత వ్యవధికంటే ఎక్కువ రోజులుంటుందో వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ అంశంలో ఇప్పటికే కొందరు అధికారులకు మెమోలు జారీ చేశారు. ప్రజలు భవన నిర్మాణ అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌లోనే అనుమతుల జారీ విధానాన్ని రెండేళ్లక్రితమే చేపట్టినప్పటికీ మరింత సరళీకరణలో భాగంగా అనుమతులను 21 రోజులకు తగ్గించారు. సర్కిళ్లు, జోన్ల పరిధిలోని భవనాల అనుమతులకు సంబంధించి ప్రధాన కార్యాలయం వరకు రానవసరం లేకుండా జోన్లకే స్టిల్ట్+ 5 అంతస్తుల వరకు అధికారాలిచ్చే చర్యలు తాజాగా చేపట్టారు.
ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకొని ఆర్కిటెక్టులు ఇబ్బందులు పెట్టకుండా ఉండేందుకు భవన నిర్మాణాలకు తగిన డిజైన్లను కూడా జీహెచ్‌ఎంసీయే రూపొందించి త్వరలో అందుబాటులోకి తేనుంది. ఇది అమల్లోకి వస్తే.. నిర్ణీత స్థల విస్తీర్ణంలో ఎన్ని అంతస్తుల భవనం కట్టుకోవచ్చో అన్ని అంతస్తులకు సంబంధించి నాలుగైదు రకాల డిజైన్లు ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంచుతారు. ప్రజలు తాము కోరుకున్నడిజైన్‌ను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. తద్వారా ఆర్కిటెక్ట్‌తో పని ఉండదు. అప్రూవ్డ్ లేఔట్లలోని ప్లాట్లలో నిర్మాణం చేసుకోవాలనుకునేవారికి, ముందస్తు క్షేత్రస్థాయి తనిఖీల్లేకుండానే ఒకరోజు వ్యవధిలోనే ప్రాథమిక అనుమతులు జారీ చేసేందుకు సాఫ్ట్‌వేర్‌ను తగిన విధంగా రూపొందిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఇది అందుబాటులోకి రానుందని చీఫ్‌సిటీప్లానర్ దేవేందర్‌రెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీ చేపట్టే వివిధ ప్రాజెక్టులతోపాటు నగరంలో ఏ సంస్థ అభివృద్ధి పనులు ప్రారంభించినా అవసరమైన భూసేకరణ బాధ్యతలు జీహెచ్‌ఎంసీపై మోపుతున్నారు.
భూసేకరణ అధికారాలు కలెక్టర్ల పరిధిలో ఉండటంతో జీహెచ్‌ఎంసీనుంచి కలెక్టర్లకు పంపడం.. అక్కడినుంచి తిరిగిరావడంలో జాప్యం తోపాటు కలెక్టర్లకున్న వివిధ పనుల వల్ల కూడా ఆలస్యం జరుగుతోంది. వీటిని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ల పరిధిలోని భూసేకరణ అధికారాలను జీహెచ్‌ఎంసీకే అప్పగించేందుకు ప్రత్యేకంగా భూసేకరణ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీపరిధిలో ప్రస్తుతం ఆయా జిల్లాల కలెక్టర్లకున్న భూసేకణ అధికారం కమిషనర్‌కు బదలాయిస్తారు. ఇందుకు ప్రత్యేకంగా భూసేకరణ విభాగాన్ని ఏర్పాటుచేసి జాయింట్ కలెక్టర్‌ను అడిషనల్ కమిషనర్ హోదాలో నియమిస్తారు. కమిషనర్ అజమాయిషీలో ఆయన పనిచేస్తారు. ఈ విభాగానికి అవసరమైనంతమంది అధికారులు, ఇతరత్రా సిబ్బందినీ నియమిస్తారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదముద్ర పడగానే ప్రత్యేక భూసేకరణ విభాగం ఏర్పాటు కానుంది.
అతిక్రమణలపై కఠిన చర్యలు..
ఇలా ఓవైపు వివిధ సంస్కరణలు అమలు చేస్తున్నప్పటికీ, నిర్మాణాల్లో ఉల్లంఘనలు ఆగకపోవడంతో అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. అనుమతుల్లేకుండా జరిగే అక్రమనిర్మాణాలను గుర్తించడంతోపాటు వెంటనే కూల్చివేసే చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని బలోపేతం చేస్తున్నారు. ఎస్పీస్థాయి అధికారి డైరెక్టర్‌గా ఉన్న ఈ విభాగంలోని పోలీసు అధికారులు, తదితర సిబ్బందితోపాటు, జీహెచ్‌ఎంసీలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేస్తారు. అంతేకాదు..నాలాల వెంబడి, చెరువుల ఎఫ్‌టీఎల్‌లు, తదితర ప్రాంతాల్లో వెలిసే అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేస్తారు. ఆహారకల్తీ తదితర అంశాలపైనా కఠిన చర్యలు తీసుకోనున్నారు. భవన నిర్మాణాలకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి బిల్డింగ్ ట్రిబ్యునల్ అందుబాటులోకి రానుంది. ఇది పని ప్రారంభిస్తే ఇప్పటిమాదిరిగా వివిధ కోర్టుల స్టేలుండవు. నిర్మాణాలకు సంబంధించిన వివాదాలన్నీ ట్రిబ్యునల్ పరిధిలోకే వస్తాయి. కేసులు సత్వరం పరిష్కారమవుతాయి. రెరా(రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) సైతం పని ప్రారంభిస్తే ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. బూటకపు ప్రకటనలతో మోసం చేసే బిల్డర్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. కొనుగోలుదారులకు మేలు కలిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment