నగరంలో గతేడాది కురిసిన వానలకు రోడ్లు జలమయమై ప్రజలు ఇలా నానా కష్టాలు పడ్డారు..(ఫైల్)
సాక్షి, సిటీబ్యూరో: చినుకు పడితే చిత్తడే. వానొస్తే వణుకే. విశ్వనగరంగా ఎదిగేందుకు పలు బాటలు పరుస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు ప్రతి సంవత్సరం వర్షాకాలం పలు సవాళ్లు విసురుతోంది. ఏమాత్రం వానొచ్చినా గుంతలమయమయ్యే రోడ్లు..చెరువులను తలపించే రహదారులు మామూలయ్యాయి. ఈ సమస్యల పరిష్కారానికి ప్రధాన రహదారుల మార్గాల్లో రీకార్పెటింగ్ పనులు భారీ కాంట్రాక్టు ఏజెన్సీలకు అప్పగించారు. లాక్‌డౌన్‌ను వినియోగించుకొని అవి వడివడిగా పనులు చేస్తున్నాయి. కానీ..అనేక ప్రాంతాల్లో వాన నీరు సాఫీగా సాగే పరిస్థితులు మాత్రం లేవు. రోడ్లు జలమయమయ్యే దుస్థితి మారలేదు. కాలనీలు చెరువులయ్యే సమస్యలు తీరలేదు. ఈ నేపథ్యంలో రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వర్షం వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను తక్షణం తాత్కాలికంగా ఎదుర్కొనేందుకు ప్రిపేర్డ్‌నెస్ ప్లాన్‌ను బల్దియా రూపొందించింది. ఇందులో భాగంగా వర్షం వల్ల తలెత్తే అవాంతరాలను ఎదుర్కొని పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు మాన్సూన్ స్పెషల్ టీమ్స్‌ను నియమించనుంది. వాటికి అవసరమైన వాహనాలను సమకూర్చనుంది.
నిలిచిపోయిన నీటిని సాఫీగా పారేలా చేసేందుకు, నాలాలు, మ్యాన్‌హోళ్లలో అడ్డం పడ్డ చెత్తా చెదారాల్ని తొలగించేందుకు, ఇతరత్రా పనుల కోసం మూడు రకాలైన టీమ్స్‌ను నియమిస్తుంది.వీటిని మినీ మొబైల్ మాన్సూన్ టీమ్స్, మొబైల్ మాన్సూన్ టీమ్స్, జోనల్ ఎమర్జెన్సీ టీమ్స్‌గా వ్యవహరిస్తోంది. ఒక్కో టీమ్‌లో ఆయా పనులు చేసేందుకు అవసరమైన కార్మికులతోపాటు యంత్ర సామాగ్రి ఉంటుంది. మినీ మొబైల్ మాన్సూన్ టీమ్స్‌కు జీపులను, మొబైల్ మాన్సూన్ టీమ్స్‌కు డీసీఎం/జేసీబీలను సమకూరుస్తారు. వర్ష సూచనను బట్టి వీలైనంత మేరకు ఎక్కడ వర్షం పడనుందో, అక్కడ సమస్యాత్మక ప్రాంతాలేవో గత అనుభవాలతో తెలిసి ఉండటంతో వాటికి సమీపంలోనే ఈ బృందాలు ఉంటాయి. అవసరాన్ని బట్టి ఇతర ప్రాంతాలకు వెళ్తాయి. వీటితోపాటు అవసరమైన జోన్లలో ప్రత్యేక ఎమర్జెన్సీ టీమ్‌ను కూడా నియమిస్తారు. వర్షాకాలంలో చేసే ఈ పనుల కోసం అవసరమైన మొత్తం 167 టీమ్స్‌కు, వాహనాలకు త్వరలోనే టెండర్లు పూర్తిచేయనున్నారు. అంచనా వ్యయం దాదాపు రూ. 25 కోట్లు. ఈ నిధులు ఎప్పుడంటే అప్పుడు ఖర్చు చేసి సమస్యలు పరిష్కరించేలా అధికారులు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment